close

వార్తలు / కథనాలు

మైకేల్‌ జాక్సన్‌ రూపం కోసం.. 

బ్యూనస్‌ ఎయిర్స్‌ : ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. ఉన్నారే అనుకోండి.. మనలాంటి రూపం కలిగిన వాళ్లు అసలు ఉంటారో లేదో తెలియడం చాలా కష్టం. అయితే సెలబ్రిటీల విషయంలో ముఖ్యంగా సినిమా స్టార్లు, క్రికెటర్లు, రాజకీయ నాయకులను పోలినవారు అక్కడక్కడా కనిపిస్తుంటారు. ఆ కోవలోని డూప్‌లలో ప్రపంచంలో అత్యధికంగా కనిపించేది మాత్రం మైకేల్‌ జాక్సన్‌లే. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది మైకేల్‌ జాక్సన్‌లు ఉంటే ఆయనలా కనిపించడం కోసం ఏకంగా 30వేల డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.21లక్షలు) ఖర్చు చేశాడు అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌కు చెందిన లియో బ్లాంకో(22). గత ఏడేళ్లుగా అతడు చేయించుకున్న సర్జరీలు, వాడిన సౌందర్య ఉత్పత్తుల ఫలితంగా ఇప్పుడు అంతా మైకేల్‌ జాక్సన్‌ ఇతనేనేమో అని అబ్బురపడే రూపాన్ని సంతరించుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. పాప్‌ రారాజుగా ప్రపంచవ్యాప్తంగా వెలుగువెలిగిన మైకేల్‌ జాక్సన్‌కు లియో చిన్నప్పటి నుంచే ఆరాధకుడు. 15ఏళ్ల వయసులో మైకేల్‌లాగా కనిపించాలనే కోరిక అతడిలో బలంగా నాటుకుపోయింది. అంతే అప్పటి నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. డాక్టర్లను కలిసి వారి సలహా మేరకు ఈ ఏడు సంవత్సరాల కాలంలో 11 ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకొని పాప్‌ రారాజు రూపాన్ని సంతరించుకొన్నాడు. మరింతగా తన రూపాన్ని మార్చుకోవాలని ఉబలాటపడుతున్నాడు. ఇటీవల ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లియో మాట్లాడుతూ ఇప్పటి వరకూ ప్లాస్టిక్‌ సర్జరీలు, సౌందర్య ఉత్పత్తులపై 30వేల డాలర్లు ఖర్చు చేశానని చెప్పాడు. ముక్కుపై నాలుగు శస్త్రచికిత్సలు జరగ్గా, మిగిలినవి బుగ్గలపై, దవడపై, గడ్డంపై చేయించుకున్నట్లు పేర్కొన్నాడు. ఈ శ్రమ ఫలితంగా తన వీధిలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దఎత్తున అభిమానులు తయారయ్యారని చెప్పాడు. అయితే లియో పోకడలపై కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా లియో ముఖంలో వస్తున్న మార్పులను చూస్తే బాధగా ఉందని, కొన్నిసార్లు ఈ అబ్బాయి నా కొడుకేనా అనే అనుమానం వేస్తోందని లియో తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. లియో చిన్నప్పటి ఫొటొలను గమనిస్తే ప్రస్తుతం సర్జరీలు, సౌందర్య సాధనాల వాడకం వల్ల తన ముఖంలో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

‘ఎన్ని అవాంతరాలు ఎదురైనా నా శరీరం, ఆత్మ, ధనం మొత్తాన్ని ప్రపంచంలో అత్యుత్తమ మైకేల్‌ జాక్సన్‌ రూపంగా కనిపించడానికి వెచ్చిస్తానని’ లియో పేర్కొనడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు