
వార్తలు / కథనాలు
ప్రతి ఇంట్లో నిత్యం కనిపించే కూరగాయ టమోటా. దీన్ని అన్ని కూరల్లో వేసుకోవచ్చు.. దీన్నే కూరగా వండుకోవచ్చు. అంతేనా టమోటా పచ్చడి, టమోటా రసం, టమోటా సూప్ అంటూ రకరకాల వంటకాలు చేయొచ్చు. ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన అనేక పోషకాలు దీంట్లో ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ ‘సి’ సమృద్ధిగా ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యమున్న టమోటాను గతంలో కేవలం ఓ అలంకార వస్తువుగా ఉపయోగించేవారట. ఆ తర్వాత తినేందుకు ప్రయత్నిస్తే విషమని ప్రచారం చేశారు. ఏకంగా కోర్టులో కేసు కూడా వేశారు. చివరికి ఆ టమోటానే ఇప్పుడు అత్యధిక మంది కొనుగోలు చేస్తున్న కూరగాయగా నిలుస్తోంది.
టమోటాలు మొదట మెక్సికో, దక్షిణ అమెరికాలోని పలు ప్రాంతాల్లో పండేవి. అక్కడి నుంచి స్పెయిన్‌కి చెందిన కొందరు యాత్రికులు వీటిని 1519లో యూరప్‌కి తీసుకొచ్చారు. మొదట్లో ఈ టమోటాలు అలంకారంగా ఉంటాయని టమోటా చెట్లను ఇంటి పరిసరాల్లో నాటేవారు. అయితే కొన్నాళ్ల తర్వాత కొందరు పాకశాస్త్ర నిపుణులు ఈ చెట్లకు కాసే టమోటాలను వంటకాల్లో ఉపయోగించడం మొదలుపెట్టారు. అవి రుచిగా ఉండటంతో ప్రజలు కూడా వాటిని తినడం ప్రారంభించారు. అయితే 17వ శతాబ్దంలో ఈ పండ్లలో టోమాటిన్ అనే విషపూరిత రసాయనం ఉందని కొందరు వృక్షశాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారు చెప్పింది నిజమే.. కానీ టోమాటిన్ అంత ప్రమాదకరమైన రసాయనం కాదు. అది కేవలం టమోటా చెట్ల కొమ్మల్లో.. ఆకుల్లో మాత్రమే ఎక్కువగా ఉంటుంది. టమోటా కాయల్లో స్వల్ప మొత్తంలో మాత్రమే ఉంటుందట, పండుగా మారిన తర్వాత అందులోని యాసిడిక్ రసాల వల్ల టోమాటిన్ నిర్వీర్యం అవుతుందట. అయినా టమోటాలు విషపూరితమేనని భావించి.. తినడానికి విముఖత చూపడం మొదలుపెట్టారు. దాన్ని ‘పాయిజన్ యాపిల్’ అని పేరు పెట్టారు.
టమోటాపై కేసు
అక్కడి ప్రజల వాదనలను అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన రాబర్ట్ గిబ్బన్ జాన్సన్ అనే ఉద్యానవనవేత్త, రైతు నమ్మలేదు. టమోటాలను తినొచ్చని బాగా విశ్వసించాడు. ఈ మేరకు 1808లో విదేశాల నుంచి ఈ టమోటాలను న్యూజెర్సీలోని సాలెంకు తీసుకొచ్చి పండించడం ప్రారంభించాడు. టమోటా సాగులో పోటీలు పెట్టి ఎవరు ఎక్కువ టమోటాలను పండిస్తారో వారికి బహుమతులుచ్చేవాడు. టమోటాలను జాన్సన్ పండించడంపై 1820లో కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ అంశంపై కోర్టులో కేసు వేశారు. టమోటాలు విషపూరితమని, వాటిని కేవలం అలంకారానికి ఉపయోగించాలని గానీ తినడమేంటని వాదించారు.
దీంతో టమోటా విషపూరితమని భావించేవారి నోళ్లు మూయించాలని భావించిన జాన్సన్ కోర్టు విచారణ రోజున ఓ బుట్ట నిండా టమోటాలను తీసుకొచ్చాడు. రెండు వేల మంది చూస్తుండగా ఆ టమోటాలను మొత్తం తినేశాడు. అతడికి ఏం కాకపోవడంతో అందరికి టమోటా తినొచ్చని నమ్మకం కలిగింది. అలా అమెరికాలో టమోటా తినే కూరగాయేనని నిరూపితమైంది. అయితే అదే సమయంలో ప్రపంచంలోని కొన్ని దేశాల్లో టమోటాపై ఎలాంటి చర్చలు లేకుండా వంటకాల్లో ఉపయోగించేవారు. 16 శతాబ్దంలో పోర్చుగీసు వ్యాపారుల ద్వారా మన దేశానికి టమోటాను పరిచయమై పలు ప్రాంతాలకు విస్తరించింది. అనంతరం బ్రిటీష్‌పాలనలో మన దేశంలో టమోటా సాగు బాగా పెరిగింది.
- ఇంటర్నెట్ డెస్క్