
వార్తలు / కథనాలు
మనుషులంతా ఒక్కటే అని మానవతావాదులు అంటుంటారు. కానీ మనుషులను వేరు చేసే ఎన్నో అంశాలు సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి. కులం, మతం, ప్రాంతం, ఆర్థిక స్థితులను బట్టి మనుషుల మధ్య వ్యత్యాసం, పరుల పట్ల వివక్ష ఏర్పడుతుంటాయి. వీటి కన్నా దారుణమైన ఓ వివక్ష.. దానికి మద్దతిస్తూ అమలైన ఓ చట్టం అమెరికా చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోయింది. అదే ‘అగ్లీ లా’. శాన్ఫ్రాన్సిస్కోలో మొదలైన ఈ చట్టం అన్ని రాష్ట్రాల్లో అమలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. శతాబ్దానికిపైగా అమల్లో ఉన్న ఈ చట్టం ఆ తర్వాత రద్దయింది.
1849లో అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఓ వ్యక్తికి బంగారం లభించింది. దీంతో ఆ ప్రాంతంలో బంగారం ఉందని తెలిసి, దాన్ని దక్కించుకోవడం కోసం పలు ప్రాంతాల నుంచి, దేశాల నుంచి లక్షల మంది శాన్ఫ్రాన్సిస్కోకు వలస వచ్చారు. కొన్నాళ్లకు బంగారం మైనింగ్ ఆగిపోయింది. అయితే ఆ సమయానికి కొందరు బాగా సంపన్నులుగా మారగా.. మరికొందరు ఉన్నది పోగొట్టుకొని రోడ్డున పడ్డారు. అంగవైకల్యం, వ్యాధిగ్రస్తులకు ఉపాధి దొరక్కపోవడంతో భిక్షాటన చేసేవాళ్లు. అయితే అప్పటికే శాన్ఫ్రాన్సిస్కోలో సంపన్నుల వర్గం బాగా పెరిగిపోయింది. అంగవైకల్యం ఉన్నవారు ఇలా బహిరంగంగా రోడ్లపై భిక్షాటన చేస్తుంటే వారికి నచ్చలేదట. దీంతో 1867లో స్థానిక నాయకులు ‘అగ్లీ లా’ను తీసుకొచ్చారు. దీని ప్రకారం ఎవరైనా అంగవైక్యలం ఉన్నవాళ్లు బయట కనిపిస్తే పోలీసులు తీసుకెళ్లి ప్రత్యేక భవనంలో బందించేవారట.
శాన్ఫ్రాన్సిస్కో బాటలోనే అనేక రాష్ట్రాలు
శాన్ఫ్రాన్సిస్కో తీసుకొచ్చిన ‘అగ్లీ లా’ను అమెరికాలోని ఇతర నగరాలు అమలు చేయడం ఆరంభించాయి. 1881లో చికాగో ఈ చట్టాన్ని అమలు చేసింది. అంగవైకల్యం, వ్యాధి ఉన్న వ్యక్తులు రోడ్లపైకి వస్తే వారికి ఒక డాలరు జరిమానా కట్టాలని ఆదేశించింది. ఆ తర్వాత ఒరెగాన్లోని పోర్ట్లాండ్, లూసియానాలోని న్యూ ఒర్లీన్స్, కొలొరడాలోని డెన్వర్, నెబ్రస్కాలోని లింకన్, ఒహియోలోని కొలంబస్, పెన్సిల్వేనియాలో ఈ తరహాలోనే చట్టాలను అమలు చేశాయి. అయితే ఈ చట్టంపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఒక శతాబ్దం తర్వాత అంటే 1974లో ఈ చట్టాన్ని రద్దు చేశారు. అనంతరం అంగవైకల్యం ఉన్నవారికి కొన్ని హక్కులు కల్పిస్తూ 1990లో ‘అమెరికన్స్ విత్ డిజబిలిటీస్’ అనే చట్టాన్ని తీసుకొచ్చారు.
- ఇంటర్నెట్ డెస్క్