
వార్తలు / కథనాలు
(ఫొటో: గ్రీన్‌బ్యాంక్ అబ్జర్వేటరీ ఫేస్బుక్)
ఈ స్మార్ట్ యుగంలో మారుమూల గ్రామానికి కూడా టెక్నాలజీ చేరువైంది. దీంతో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ వైఫై, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఇప్పుడు అందరూ వాడుతున్నారు. కానీ, అమెరికాలోని ఓ పట్టణ ప్రజలు ఇప్పటికీ వాటికి దూరంగానే ఉండాల్సి వస్తోంది. ఎందుకంటే అక్కడ స్మార్ట్ఫోన్లు, వైఫైతో ఇంటర్నెట్ వాడటం.. వైర్లెస్ గ్యాడ్జెట్లను ఉపయోగించడం నిషేధం. ఎందుకంటారా? అయితే ఇది చదవండి..
1950 దశకంలో అమెరికా ప్రభుత్వం ఖగోళ పరిశోధన నిమిత్తం ఓ ప్రాజెక్టును చేపట్టాలని భావించింది. అంతరిక్షం నుంచి వెలువడే తరంగాలను సేకరించి.. వాటి గురించి తెలుసుకోవడం కోసం భారీ రేడియో టెలిస్కోప్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే భారీ టెలీస్కోప్లను ఏర్పాటు చేయాలంటే భూమిపై మానవుడు సృష్టించిన పరికరాల్లో నుంచి వచ్చే రేడియో తరంగాలు అడ్డుపడకుండా ఉండేలా మారుమూల ప్రాంతాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. అలా ఎంపికైన ప్రాంతమే వెస్ట్ వర్జీనియాలోని గ్రీన్ బ్యాంక్ పట్టణం. అంతరిక్షంలో ఏవైనా రేడియో తరంగాలు వస్తే, వాటిని గుర్తించడం కోసం 1958లో ఇక్కడ భారీ రేడియో టెలీస్కోప్ను ఏర్పాటు చేసి ‘గ్రీన్ బ్యాంక్ అబ్జర్వేటరీ’ని స్థాపించారు. ఈ ప్రాంతాన్ని నేషనల్ రేడియో క్విట్ జోన్‌గా ప్రకటించారు. దీని ప్రకారం గ్రీన్‌బ్యాంక్ చుట్టుపక్కల దాదాపు మూడున్నర కిలోమీటర్ల వరకు ఎవరూ వైర్లెస్ గ్యాడ్జెట్లను, వైఫైని వాడకూడదు. ఎవరైనా వాడితే వాటి రేడియో తరంగాలు.. అంతరిక్షం నుంచి వచ్చే రేడియో తరంగాలకు ఆటంకం కలిగిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అప్పటి నుంచి గ్రీన్‌బ్యాంక్ పట్టణ ప్రజలు టెక్నాలజీకి దూరంగానే ఉండిపోయారు. స్మార్ట్ఫోన్ల యుగం వచ్చి.. అనేక వైర్లెస్ గ్యాడ్జెట్లు అందుబాటులోకి వచ్చినా వాటిని వాడే పరిస్థితులు అక్కడ లేవు. అందుకే వాటికి బదులు ఇంకా ల్యాండ్‌లైన్ ఫోన్లు, కేబుల్ ఇంటర్నెట్నే వాడుతుంటారు. ఆధునిక సదుపాయాలు లేక, ఇక్కడి నిబంధనలు భరించలేక కొందరు గ్రీన్ బ్యాంక్ వదిలిపోయినవాళ్లూ ఉన్నారు. మరికొందరు మాత్రం స్వస్థలాన్ని వదిలి వెళ్లలేక ఇప్పటికీ అక్కడే ఉంటున్నారు. అయితే కొందరు అక్రమంగా వైఫైను వాడుతున్నట్లు అక్కడి అధికారులు గుర్తిస్తున్నారు. కానీ, వారిని ఎలా నిలువరించాలో తెలియక తలపట్టుకుంటున్నారు. దీంతో పరిశోధకులే మానవులు సృష్టించిన రేడియో తరంగాలను తొలగించే విధంగా ‘ఆర్ఎఫ్ఐ ఎక్సిషన్ టెక్నిక్’ను అభివృద్ధి చేస్తున్నారు. తద్వారా ఇక్కడి ప్రజలు వైర్లెస్ టెక్నాలజీని ఉపయోగించినా అంతరిక్షం నుంచి వచ్చే రేడియో తరంగాలకు ఆటంకం కలగకుండా ఉండేలా చేయనున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్