close

వార్తలు / కథనాలు

ఈ గుర్తుకు అర్థమేంటి.. ప్రయోజనమేంటి

ఈ గుర్తుకు అర్థమేంటి.. ప్రయోజనమేంటి

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడం దగ్గరి నుంచి, ఆన్‌లైన్‌ వేదికగా జరిగే ప్రతి లావాదేవీకి డెబిట్‌ కార్డు లేదా క్రెడిట్‌ కార్డులను మనం ఉపయోగిస్తూనే ఉంటాం. కొన్ని బ్యాంకులు వివిధ డిజైన్లలో ఆయా కార్డులను అందిస్తాయి. ఇంకొన్ని బ్యాంకులు కొంత రుసుము వసూలు చేసి కార్డు మీద మన ఫొటోను ముద్రించి ఇస్తాయి. అయితే, ఇటీవల కాలంలో మీ క్రెడిట్‌/డెబిట్‌ కార్డుపై పైనున్న చిత్రంలో ఉన్నటువంటి గుర్తును గమనించారా? వైఫై సింబల్‌ను పోలి ఉన్న ఈ గుర్తుకు అర్థం ఏంటి? ఈ కార్డు వల్ల ప్రయోజనం ఏంటి?

మీ క్రెడిట్‌/డెబిట్‌ కార్డుపై ఇలాంటి సింబల్‌ ఉంటే దానిని కాంటాక్ట్‌లెస్‌ ఫీచర్‌ ఉన్న కార్డుగా వ్యవహరిస్తారు. ఈ కార్డును వినియోగిస్తున్న వారు షాపింగ్‌ మాల్స్‌, రిటైల్‌ స్టోర్ల వద్ద చెల్లింపులు చేయడానికి స్వైప్‌ చేయాల్సిన పని ఉండదు. కేవలం ప్రత్యేక పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ పరికరం (పీవోఎస్‌ మెషీన్‌) మీద ట్యాప్‌ చేస్తే చాలు... మీ లావాదేవీ పూర్తవుతుంది. నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌ (ఎన్‌ఎఫ్‌సీ)తో పనిచేసే ఈ కార్డుల్లో ఉండే చిప్‌ వద్ద మన ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసి నగదు చెల్లింపు జరిగేలా చేస్తుంది.

క్రెడిట్‌/డెబిట్‌ కార్డులను జారీ చేసే వీసా వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. ‘కాంటాక్ట్‌లెస్‌ డివైజ్‌ లేదా అలాంటి వ్యవస్థ అనుసంధానం చేసిన ప్రాంతాల్లో కేవలం ఈ కార్డును చూపించడం ద్వారా భద్రతతో కూడిన లావాదేవీలను చేయొచ్చు. కార్డును ట్యాప్‌ చేయగానే చెల్లింపులకు సంబంధించిన లావాదేవీని ధ్రువీకరించినట్లు అవుతుంది. కార్డును పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ యంత్రం వద్ద రెండు అంగుళాల దూరంలో ఉంచాలి’ అని తెలిపింది.

అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, కెనడా, ఫ్రాన్స్‌లలో అత్యధికమంది కాంటాక్ట్‌లెస్‌ కార్డులనే ఉపయోగిస్తున్నారని ఇటీవల ‘ఇండిపెండెంట్‌’ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో ఈ ట్రెండ్‌ మొదలైందని తెలిపింది. ఈ కార్డు వల్ల ప్రయోజనాలను చూసుకుంటే సాధారణ కార్డుతోపోలిస్తే, స్వైప్‌ చేయకుండా వేగంగా లావాదేవీలను పూర్తి చేయొచ్చు. ఎవరికీ కార్డును ఇవ్వాల్సిన పనిలేదు. చిన్న మొత్తాలకు సంబంధించిన లావాదేవీలకు సైతం ప్రతిసారీ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయాల్సిన అవసరం లేదు.

కాంటాక్ట్‌లెస్‌ కార్డును వినియోగించడం వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో? అలాగే ఇబ్బందులు కూడా కొన్ని ఉన్నాయి. ఇలాంటి కార్డులు చాలా భద్రమైనవి బ్యాంకులు చెబుతున్నా.. కొంతకాలం కిందట చోటు చేసుకున్న ఓ ఘటన వీటిపై భద్రతను ప్రశ్నిస్తున్నాయి. 2016లో ఓ వ్యక్తి పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) మెషీన్‌తో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న రైలు ఎక్కి, అందులోని ఓ వ్యక్తి జేబులో ఉన్న కార్డుకు దగ్గరగా పీవోఎస్‌ యంత్రాన్ని తీసుకెళ్లడం ద్వారా నగదు లావాదేవీ చేసేశాడు. దీంతో వీటి భద్రతపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే, కాంటాక్ట్‌లెస్ ‌కార్డుల్లో ఎక్కువ మొత్తంలో నగదు ఉండకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే విధంగా జేబులో కార్డు పెట్టుకునే సమయంలోనూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. భారత్‌లో ఇప్పటివరకూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. మొన్నీ మధ్య వచ్చిన ‘అభిమన్యుడు’ సినిమాలో కాంటాక్ట్‌లెస్‌ కార్డు నుంచి డబ్బు దొంగిలించిన సన్నివేశం మీరు చూసే ఉంటారు.


Tags :

మరిన్ని