
వార్తలు / కథనాలు
ఇంటర్నెట్ డెస్క్: పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తున్న అంశాల్లో ప్లాస్టిక్ ఒకటి. నిత్యజీవితంలో, ముఖ్యంగా వస్తువుల ప్యాకింగ్ ప్రక్రియలో ప్లాస్టిక్ వినియోగం అత్యధికంగా ఉంటోంది. ప్యాకింగ్ విప్పిన తర్వాత అదంతా చెత్తలోకి చేరుతుంది. వ్యర్థాలుగా భూమిపై రోజురోజుకూ పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్‌ను కాల్చివేయడం ద్వారా వెలువడే విషవాయువులు వాయు కాలుష్యానికి దారితీస్తున్నాయి. రోడ్లపై, చెరువుల్లో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తే వాటిని తినడం వల్ల జంతువులు, నీటిలో ఉండే ప్రాణులకు హాని జరుగుతోంది. ఇలా జీవజాతికి ముప్పుగా మారిన ఈ ప్లాస్టిక్‌ను నిర్మూలించాలని గత కొంత కాలంగా ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా దాని వాడకంపై నిషేధం విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ ప్యాకింగ్ తగ్గించడానికి, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు వివిధ కంపెనీలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయో చూద్దాం!
ప్యాకింగ్ బంద్
ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండకూడదనుకుంటే.. చేయాల్సింది దానిని వాడకుండా ఉండటమే. వీలైనంత వరకూ ప్లాస్టిక్ ప్యాకింగ్‌కు దూరంగా ఉండాలి. అత్యవసరమైతే గానీ ప్లాస్టిక్ జోలికి పోకూడదు. వీలైనంత వరకు వస్త్రంతో చేసిన సంచులు వాడటం ఉత్తమం. యూకే వ్యాప్తంగా ఇప్పటికే పలు సూపర్మార్కెట్లు, కూల్‌డ్రింక్స్ టిన్స్, గ్రీటింగ్ కార్డ్స్, బెడ్షీట్ల వంటి వాటిని కవర్లలో ప్యాక్ చేయడం మానేశాయి. ఉత్తర అమెరికాలో వాల్‌మార్ట్ షాపింగ్‌మాల్‌లో బొమ్మలకు ప్యాకింగ్ చేయట్లేదు. కూరగాయలు, పండ్లు, ఇతర వస్తువులకు ప్లాస్టిక్‌తో ర్యాపింగ్ చేయడాన్ని వాల్‌మార్ట్ నిషేధించింది.
సృజనాత్మక ప్రత్యామ్నాయం
కొన్నిసార్లు ప్లాస్టిక్ ప్యాకింగ్ తప్పని పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాటికి సృజనాత్మక ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. కార్ల్స్‌బర్గ్ బీర్ల సంస్థ ఆరు టిన్లతో ఒక యూనిట్‌ను ప్యాక్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ప్లాస్టిక్‌కు బదులు జిగురును ఉపయోగిస్తోంది. ఆరు టిన్లను ఒకదానితో ఒకటి జిగురుతో అంటించి ప్యాక్ చేస్తోంది. స్వీడన్‌కు చెందిన ఐసీఏ రీటైల్ సంస్థ పండ్లు, కూరగాయలపై బ్రాండ్ల పేరును లేజర్‌తో ముద్రించే ప్రయత్నం చేస్తోంది. అమెరికాలో ఆహారపదార్థాలపై సంస్థ లోగోలు, పేర్లను తినదగిన పదార్థాలతో రూపొందిస్తున్నారు.
రీఫిల్స్
యూనిలివర్, ఎస్.సీ జాన్సన్ వంటి సంస్థలు గాఢత ఎక్కువగా ఉండే క్లీనింగ్ రసాయనాలను చిన్న ప్యాకెట్లలో విక్రయిస్తున్నాయి. వీటిని మొదటిసారి కొనుగోలు చేసిన ప్లాస్టిక్ సీసాలో పోసి.. కొన్ని నీళ్లు కలిపి వాడుకోవచ్చు. ప్లాస్టిక్ సీసా ఖాళీ అయిన ప్రతిసారి కొత్తది కొనే బదులు ఈ విధంగా చేస్తే.. ప్లాస్టిక్ వాడకం తగ్గిపోతుంది. ఈ ఆలోచన బాగుండటంతో టూత్పేస్ట్లు, డిటర్జెంట్ పౌడర్లను కూడా మందు బిళ్లల రూపంలో తయారు చేస్తున్నారు. కోకాకోలా, పెప్సీ కూడా ఈ తరహా విధానంలోకి మారడానికి ప్రయత్నిస్తున్నాయి.
ప్రత్యామ్నాయం.. పునర్వినియోగం
ఒకప్పుడు పాలను పాల వ్యాపారులు సీసాల్లో విక్రయించేవారు. ప్రతిరోజూ ఖాళీ చేసిన సీసాను తీసుకొని పాలు నింపిన మరో సీసా ఇచ్చేవాళ్లు. ప్రస్తుతం పాలను ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నారు. అయితే ఫ్రాన్స్‌కి చెందిన ఓ కంపెనీ మళ్లీ గతకాలం పద్ధతిని అమలు చేస్తోంది. ఫ్రాన్స్, లాటిన్ అమెరికాలో పాలు, పాల ఉత్పత్తులు, ఆహార పదార్థాలను ఇంటికి తెచ్చి ఇచ్చే ‘డానన్’ సంస్థ పాలను సీసాలు, జగ్గుల్లో విక్రయిస్తోంది. చందాదారులుగా మారిన కస్టమర్ల ఇంటికి వాటిని తెచ్చిచ్చి.. మరుసటి రోజు వాటిని తీసుకొని.. శుభ్రపర్చి తిరిగి ఉపయోగిస్తోంది. ముంబయిలో ‘డబ్బావాలా’ల గురించి అందరికీ తెలిసిందే. ఆఫీసుల్లో ఉద్యోగులకు వారి ఇంటి నుంచి లంచ్ బాక్సులను తీసుకొచ్చి ఇస్తుంటారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని లండన్‌లో ‘డబ్బా డ్రాప్’ పేరుతో ఓ సంస్థ ఏర్పాటైంది. కస్టమర్లు ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలను స్టీల్డబ్బాల్లో డెలివరీ చేసి.. ఖాళీ చేసిన తర్వాత తిరిగి తీసుకుంటారు.
ప్లాస్టిక్ రీసైకిల్
ప్యాకింగ్ చేసే ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయలేకపోవచ్చు. కానీ, రీసైకిల్ చేసే ప్లాస్టిక్‌ను తయారు చేయొచ్చు. ఆకుపచ్చ ప్లాస్టిక్ బాటిల్లో స్ప్రైట్ కూల్‌డ్రింక్‌ను విక్రయించే కోకాకోలా రీసైకిల్ చేయగలిగే పారదర్శక ప్లాస్టిక్‌ను వినియోగించాలని నిర్ణయించింది. కోల్గేట్ కూడా టూత్‌పేస్ట్ ట్యూబ్‌లను రీసైకిల్ చేయగలిగే ప్లాస్టిక్‌తో తయారు చేస్తోంది. పీఅండ్‌జీ, నెస్లే వంటి పలు సంస్థలు తమ ఉత్పత్తులపై బార్‌కోడ్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. బార్కోడ్ ద్వారా ఆటోమెటిక్‌గా వ్యర్థంగా మారిన ప్లాస్టిక్‌ను సంబంధిత రీసైక్లింగ్ ప్లాంట్‌కు చేరేలా చేస్తాయి.
సేంద్రియ ఎరువుల కోసం..
ప్లాస్టిక్‌కు బదులు బయోడిగ్రేడబుల్ పదార్థాలను ఉపయోగిస్తే పర్యావరణానికి జరిగే హానిని తగ్గించవచ్చు. ఎరువు, బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసే వీలుంటుంది. కొన్ని టీ సంస్థలు వాటి టీ బ్యాగుల్లో ప్లాస్టిక్‌కి బదులు బయోడిగ్రేడబుల్ పదార్థాలను వాడుతున్నాయి. వాటిని ఒక్కచోట చేర్చి సేంద్రీయ ఎరువు తయారు చేయొచ్చు. ఆపిల్ గోవర్ బొస్టాక్ అనే సంస్థ విక్రయించే పండ్లపై ఎరువుల తయారీకి ఉపయోగపడే పదార్థాలతో స్టిక్కర్లను వాడుతోంది.
కాగితంతో సరి
కొన్ని వస్తువులకు ప్లాస్టిక్‌కు బదులు కాగితాన్ని కూడా ఉపయోగించవచ్చు. అలాంటి వాటికోసం ప్రత్యేకంగా కాగితంతో కవర్లను తయారు చేస్తున్నారు. ఎక్కువగా కిరాణా దుకాణాల్లో ఇలాంటి కాగితం కవర్లను ఉపయోగిస్తున్నారు. మొబైల్ ఫోన్ నుంచి కప్పుల వరకు అన్ని వస్తువులను కొన్ని సంస్థలు కాగితం, కార్డ్‌బోర్డులతో ప్యాకింగ్ చేస్తున్నాయి.