
వార్తలు / కథనాలు
ఇంటర్నెట్ డెస్క్: పోలీసులు.. ప్రజల కోసం పనిచేసే రక్షక భటులు. దేశానికి భద్రతగా సైనికులు ఉంటే.. దేశంలోని ప్రజలకు రక్షణగా పోలీసులు ఉంటారని అంటుంటారు. అలాంటి పోలీసులను తలచుకోగానే ముందుగా గుర్తొచ్చేది వారు వేసుకునే ఖాకీ రంగు యూనిఫాం. కానీ, మీరు ఎప్పుడైనా గమనించారా?దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పోలీసులు ఈ ఖాకీ రంగు యూనిఫాం ధరిస్తే.. కోల్‌కతా పోలీసులు మాత్రం తెలుపు రంగు యూనిఫాం వేసుకుంటారు. ఎందుకలా అనే సందేహం కలిగిందా ఎపుడైనా?అయితే, ఇది చదివేయండి...
బ్రిటీష్ కాలంలో మొత్తం తెలుపే..
సుసంపన్న.. స్వతంత్ర భారత దేశంలోకి ఆంగ్లేయులు అడుగుపెట్టి.. మెల్లమెల్లగా దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. మొదట్లో పశ్చిమ బెంగాల్‌నే వారి ఆవాసంగా చేసుకున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. ఆ తర్వాత ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో దేశంలో పోలీసు వ్యవస్థను బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పోలీసులందరూ తెలుపు రంగు దుస్తులను యూనిఫాంగా ధరించాలని ఆదేశించింది. అయితే, విధుల్లో భాగంగా చేసే పనులతో వారి తెలుపు రంగు యూనిఫాం మురికి అయిపోయేది. దీంతో ఉతికినా పోని మరకలపై వివిధ రంగులతో పెయింట్ వేసి సర్దుకునేవారు. ఇంకొంతమంది పోలీసులు తెలుపు రంగు దుస్తులకు లేత నీలి రంగు వేసేవారు. మరికొన్ని చోట్ల తెలుపు రంగు దుస్తులే సాయంత్రం అయ్యేసరికి పసుపు రంగులోకి మారేవి. ఈ సమస్యను గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు ఖాకీ రంగు దుస్తులను సూచించారు. లేత పసుపు.. గోధుమ రంగు కలిపితే వచ్చేదే ఖాకీ రంగు. ఈ రంగు చూడటానికే దుమ్ము, మట్టి రూపంలో కనిపిస్తుంటుంది. కాబట్టి మురికిగా మారినా పెద్దగా అలా కనిపించదు. దీంతో పోలీసులే టీ ఆకులతో, ఫ్యాబ్రిక్ రంగులతో వారి తెలుపు రంగు యూనిఫాంను ఖాకీ రంగుకు మార్చుకునేవారు.
అధికారికంగా మారిన యూనిఫాం
1846లో సర్ హెన్రీ లారెన్స్ అనే బ్రిటీష్ అధికారి ‘కార్ప్స్ ఆఫ్ గైడ్స్’ పేరుతో బ్రిటీష్ ఇండియన్ ఆర్మీలో ఓ విభాగాన్ని ఏర్పాటు చేశాడు. దానికి సర్ హ్యారీ లమ్స్‌డెన్ కమాండెంట్‌గా నియమితులయ్యారు. అప్పుడు కూడా పోలీసులు తెలుపు రంగు, లేత నీలి రంగు, టీ ఆకులతో ఖాకీ రంగులా మార్చిన తెలుపు దుస్తులను ధరించేవారు. దీంతో 1847లో కమాండెంట్ లమ్స్‌డెన్ ఆదేశాల మేరకు ఖాకీ రంగు పోలీసుల అధికారిక రంగుగా మారిపోయింది పోలీసులు అంతా ఈ రంగు దుస్తులనే ధరించడం తప్పనిసరి చేశారు.
కోల్‌కతాలో ఇంకా తెలుపే
నిజానికి పశ్చిమ బంగాల్లో రెండు రకాల పోలీసు వ్యవస్థలు ఉన్నాయి. పశ్చిమ బంగాల్ రాష్ట్ర పోలీసుల వ్యవస్థ ఒకటైతే.. కోల్‌కతా మెట్రోపాలిటన్ నగర పోలీసు వ్యవస్థ మరొకటి. 1845 లోనే బ్రిటీష్ ప్రభుత్వం కోల్‌కతా కోసం ప్రత్యేకంగా పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీంతో కోల్‌కతా పోలీసులంతా తెలుపు రంగు దుస్తులనే యూనిఫాంగా ధరించేవారు. 1847లో పోలీసులంతా ఖాకీ రంగు దుస్తులు ధరించాలని లమ్స్‌డెన్ ఆదేశాలు జారీ చేయగా.. అందుకు కోల్‌కతా పోలీసులు నిరాకరించారు. ఇందుకు కారణముంది. కోల్‌కతా నగరం సముద్రానికి కాస్త దగ్గరగా ఉండటంతో ఉష్ణోగ్రత ఎక్కువగానే ఉంటుంది. తెలుపు రంగు అయితే వేడిని గ్రహించదు కాబట్టి తెలుపు రంగు దుస్తులు ధరించేందుకు ప్రాధాన్యమిచ్చారు. 1861లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఏర్పాటైంది. రాష్ట్ర పోలీసులు కూడా తెలుపు రంగే ధరించారు. కానీ, ఆ తర్వాత ఖాకీ రంగులోకి మారారు. కోల్‌కతా-హౌరా జంటనగర పోలీసులు మాత్రం ఇప్పటికీ తెలుపు రంగు దుస్తులనే యూనిఫాంగా ధరిస్తున్నారు. రాష్ట్ర పోలీసు ఎవరు? కోల్‌కతా పోలీసు ఎవరు? అనేది సులభంగా గుర్తించడం కోసం కూడా ఇది ఉపయోగపడుతోంది.