
వార్తలు / కథనాలు
ఇంటర్నెట్ డెస్క్: కుటుంబాన్ని పోషించడానికి, జీవితంలో ఎదగడానికి సాధారణంగా మగాళ్లు ఉద్యోగం చేస్తుంటారు. ఎంతో కష్టపడుతుంటారు. అయితే, అంతగా కష్టపడుతున్న భర్తను చూసి ఏ భార్య అయినా గర్వపడుతుంది. అయితే, ఈవిడ గారు మాత్రం తన భర్త రాత్రిపగలూ మరీ ఎక్కువగా కష్టపడుతున్నాడని ఏకంగా అతడిని కిడ్నాప్ చేసేసింది. ఆ తర్వాత జరిగిన విషయాలను ఎప్పటికప్పుడు ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. గత నెలలో ఆమె చేసిన పోస్టు ప్రస్తుతం జపాన్‌లో వైరల్‌గా మారింది.
జపాన్‌కి చెందిన ఓ మహిళ తన భర్త పనిలో మునిగిపోయి.. ఆరోగ్యం పాడుచేసుకుంటున్నాడని ఆవేదన చెందింది. సాధారణంగా అయితే భర్త ఇంటికి రాగానే భార్య వేడి నీళ్లు పెట్టి, స్నానం చేశాక సేదతీరమని చెబుతుంది. కానీ ఆమె తన భర్తను కిడ్నాప్ చేసింది. రాత్రి షిఫ్టులో ఉన్న తన భర్త ఉదయం బయటికి వచ్చే సమయానికి అతడి ఆఫీస్ ముందు నిల్చుంది. అతడు బయటకు రాగానే రైల్వేస్టేషన్‌కు లాక్కెళ్లింది. ఎక్కడికి? ఎందుకు? అని తన భర్త అడుగుతున్నా సమాధానం ఇవ్వకుండా కొన్ని గంటలపాటు రైలు, బస్సు ప్రయాణం చేసి నగరాలు దాటి.. మారుమూల పర్వతప్రాంతమైన ఇజు పెనిన్సులాకు తీసుకెళ్లింది.
అక్కడ ఒక ప్రాచీన సంప్రదాయ హోటల్లో దిగిన తర్వాత భర్తను ఓపెన్ ఎయిర్ బాత్ చేయమని చెప్పిందట. ఆ తర్వాత అతడికి గదిలోకి తీసుకెళ్లి విశ్రాంతి తీసుకోమందట. దీంతో రాత్రంతా విధుల్లో.. ఉదయం కొన్ని గంటలపాటు ప్రయాణంలో అలిసిపోయిన అతడు హాయిగా నిద్రపోయాడట. తన భర్త అలా ఆదమరిచి నిద్రపోతున్న ఫొటోను కూడా ఆమె పోస్టు చేసింది. కేవలం తన భర్త విశ్రాంతి తీసుకోవడం కోసమే కిడ్నాప్ చేసి ఈ ప్రశాంతమైన ప్రాంతానికి తీసుకెళ్లానని చెబుతూ.. ఆ అనుభవాలను సోషల్‌మీడియాలో వెల్లడించింది. ఎలాగైతేనేం తన కిడ్నాప్ ప్లాన్ విజయవంతంగా పూర్తయ్యిందంటూ రాసుకొచ్చింది. భలే భార్య కదూ..!