close

వార్తలు / కథనాలు

అక్కడి చెట్లకు అతివలే అండ

అక్కడి చెట్లకు అతివలే అండ

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్నప్పుడు తాతనో, బామ్మనో ఓ కథ చెప్పమంటే ‘అనగనగా ఓ అడవి.. ఆ అడవిలో ఓ మృగరాజు’ అనో, ‘చీమలు దూరని చిట్టడవి.. కాకులు దూరని కారడవి’ అనో చెప్పేవారు. ప్రస్తుతం కాలం మారింది. అలా కథలు చెప్పమని అడిగే వారూ కరువయ్యారు. ఆ అడవులు కూడా దాదాపుగా కనుమరుగవుతున్నాయి. ప్రకృతి ప్రసాదించిన పచ్చదనాన్ని ప్రేమించే వారు తప్ప వనం గోడు పట్టించుకునే నాథుడే లేడు. అదేదో సినిమాలో చెప్పినట్లు ‘వచ్చామా ఉన్న ప్రకృతి వనరులను ఉపయోగించుకున్నామా పోయామా’ అని కాకుండా వర్తమానంలో బాగా బతకాలనే స్వార్థం కోసం భవిష్యత్తరాలకు అన్యాయం చేస్తున్నారు. అయితే, కొంతమంది ప్రకృతి ప్రేమికులు మొక్కలను సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటారు. ఇక గిరిజన ప్రాంతాల్లో ఉండేవారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పశ్చిమ్‌ బంగా బంకురా జిల్లా పరిధిలోని హకీం సినాన్‌ గ్రామ మహిళలు ఇందుకు మినహాయింపు కాదు. పూర్తిగా ఆదివాసీ గ్రామాల్లో ఉండే ఈ మహిళలు చెట్లను కాపాడుకోవడానికి ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు.

ప్రకృతి వనరులే జీవనాధారం: హకీం సినాన్‌ గ్రామం జనజీవనానికి చాలా దూరంలో ఉంటుంది. పశ్చిమ్‌ బంగాలో అత్యధికంగా అడవులుండే ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడి ప్రజలకు అన్ని సౌకర్యాలు ప్రకృతే కల్పిస్తుంది. ఇక్కడి వాళ్లకి వనమూలికలు, వైద్య సుగుణాలున్న వేర్లు, తేనె, వివిధ రకాల పళ్లు ఇవే జీవనాధారం. ఇక్కడ సాంతాలు అనే గిరిజన తెగకు చెందిన వాళ్లు ఎక్కువగా ఉంటారు.

రాత్రిళ్లు చెట్లకు కాపలా: ఎన్నో అరుదైన చెట్లు ఇక్కడ ఉంటాయి. దీంతో స్మగ్లర్లు రాత్రి వేళల్లో రెచ్చిపోతుంటారు. కొన్నాళ్ల కిందట స్మగ్లర్ల గుంపు వచ్చి చెట్లు నరకడం ఓ వ్యక్తి చూశాడు. వాళ్లను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటనతో కలత చెందిన ఇక్కడి మహిళలు.. అప్పటి నుంచి రాత్రి సమయాల్లో ఒక బృందంగా ఏర్పడి కాపలా కాస్తున్నారు. ఒకవేళ రాత్రిళ్లు ఎవరైనా స్మగ్లర్లు చెట్లను నరకడానికి వస్తే వాళ్ల అలికిడి తెలుసుకోవడానికి వీళ్లకు ఓ కోడ్‌ భాష ఉంటుంది. దీని ద్వారా వెంటనే స్పందించి స్మగ్లర్ల ఆటకు అడ్డుకట్ట వేస్తారు.

ఎన్జీవో సాయంతో: జనావాసానికి దూరంగా ఉన్న ఈ గ్రామ ప్రజలు అడవులకు చేస్తున్న సేవల గురించి తెలుసుకున్న ‘ప్రధాన్‌’ అనే ఎన్జీవో వాళ్లకు ఆర్థిక సాయం అందజేస్తోంది. పండ్లు, తేనె, వనమూలికలు వంటి వాటిని విక్రయించగా వచ్చిన డబ్బుతో వారితో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయించి స్వయం ఉపాధి కల్పిస్తోంది. మన్యం విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తోంది.

పాలిచ్చి పెంచిన తల్లినే చంపుకొంటారా?: పట్టపగలు అడవులు నరకడానికి వచ్చే స్మగ్లర్లకు ఈ మహిళలు సూటిగా సుతి మెత్తగా బుద్ధి చెప్తారు. ‘పాలిచ్చి పెంచిన తల్లిని మీరు నరుకుతారా? అదేవిధంగా మేం కన్న బిడ్డల్లాగా చూసుకునే వీటిని ఎలా నరుకుతారు?.. మీరు నమ్మే దేవుడి విగ్రహాలను ఇలాగే కూల్చేస్తారా? మరి మేం పూజించుకునే ఈ చెట్లను ఎందుకు కూల్చుతారు?’ అని తెలివిగా ప్రశ్నిస్తుంటారు. వీరి తెలివికి మెచ్చిన ప్రధాన్‌ సంస్థ ఈ మాటలకు బ్యానర్ల రూపాన్నిచ్చింది. అక్కడక్కడా బ్యానర్లను కట్టించింది.

చెట్లను దత్తత తీసుకుంటారు: ఇక్కడివారు ఒక్కో ప్రాంతాన్ని దత్తత తీసుకుంటారు. వారి పరిధిలోని మొక్కలకు ఎటువంటి హానీ కలగకుండా చర్యలు తీసుకోవడం వీరి బాధ్యత. చెట్ల మనుగడకు వీళ్లు చేస్తున్న సేవలను ప్రభుత్వం గుర్తించింది. ఈ మన్యం ప్రజలకు సాయం చేయాల్సిందిగా కొందరు ఫారెస్ట్‌ అధికారులను నియమించింది. అటు అధికారులు, ఇటు మన్యం ప్రజల సహకారంతో ప్రస్తుతం అక్కడ స్మగ్లింగ్‌ను పూర్తిగా అరికట్టగలిగారు.


Tags :

మరిన్ని