close

వార్తలు / కథనాలు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకులివే..!

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విడాకులివే..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 25ఏళ్ల పాటు జీవనం సాగించిన ఈ జంట ఇప్పుడు విడాకులు తీసుకొనుంది. సంపదలోనే కాదు.. విడాకుల సెటిల్‌మెంట్‌ విషయంలో కూడా బెజోస్‌ రికార్డు సృష్టించబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన విడాకుల్లో అగ్రస్థానం ఆయనకే దక్కబోతోంది. విడాకుల భరణం కింద ఆయన భార్య మెకంజీకి సుమారు 68 బిలియన్‌ డాలర్లు అందే అవకాశం ఉంది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.4.7లక్షల కోట్లకు పైమాటే.

అలాంటి కొన్ని ఖరీదైన విడాకుల వివరాలు..

* న్యూయార్క్‌ చెందిన జాసలీన్‌ వైల్డెన్సిట్‌.. ఆర్ట్‌ డీలర్‌, వ్యాపారవేత్త అయిన అలెక్‌తో 1999లో విడాకులు తీసుకుంది. జాసలీన్‌ తన ముఖానికి చేయించుకున్న కాస్మొటిక్‌ శస్త్రచికిత్సల ద్వారా చాలా ఫేమస్‌ అయింది. విడాకుల అనంతరం ఆమెకు భరణం కింద సుమారు 2.5బిలియన్‌ డాలర్లు, 13ఏళ్ల పాటు ఏటా 100మిలియన్‌ డాలర్లు అందాయి. కానీ ఆమె ఆ భరణం నగదును కాస్మొటిక్‌ సర్జరీలకు మాత్రం ఉపయోగించకూడదని న్యాయస్థానం చెప్పిందట.

* అమెరికన్‌-ఆస్ట్రేలియన్‌ మీడియా మొగల్‌ రూపర్డ్‌ మర్దోక్‌ తన భార్య అన్నాతో విడాకులు తీసుకున్నారు. 32ఏళ్ల కాపురం, ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్లు వైవాహిక బంధానికి స్వస్తి చెప్పారు. విడాకుల సెటిల్‌మెంట్‌ కింద అన్నాకు రూపెర్ట్‌ 1.7బిలియన్‌ డాలర్లు చెల్లించినట్లు తెలుస్తోంది. అందులో 110మిలియన్‌ డాలర్లు నగదు రూపంలో ఇచ్చాడు. విడాకులు తీసుకున్న 17 రోజుల తర్వాత రూపెర్ట్‌ తనకంటే 38 ఏళ్ల చిన్నదైన వెండి డెంగ్‌ను వివాహమాడాడు. కొన్ని నెలల తర్వాత అన్నా కూడా పెళ్లి చేసుకుంది. డెంగ్‌తో బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2013లో ఆమెతో విడాకులు తీసుకుని 2016లో మాజీ మోడల్‌ జెర్రీ హాల్‌ను పెళ్లాడాడు. ఆయనకు ఇది నాలుగో పెళ్లి.

* బ్రిటన్‌కు చెందిన బిలియనీర్‌ బెర్నీ ఎక్లో తన భార్య స్లేవికాకు 2009లో విడాకులు ఇచ్చారు. వారి విడాకుల ఖరీదు సుమారు 4 బిలియన్‌ డాలర్లు. అప్పట్లో ఇదే అత్యంత ఖరీదైన విడాకులుగా చరిత్ర సృష్టించింది. కానీ ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ కింద ఆమెకు 1 బిలియన్‌ డాలర్ల నుంచి 1.2బిలియన్‌ డాలర్ల వరకు మాత్రమే ముట్టినట్లు తెలుస్తోంది.

* అమెరికా వ్యాపారవేత్త, కాంటినెంటల్‌ రిసోర్సెస్‌ సీఈవో హరోల్డ్‌ హామ్‌ తన భార్య సూ ఆన్‌ హామ్‌కు 2012లో విడాకులు ఇచ్చారు. వివాహమైన 24ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ విడిపోయారు. 11 బిలియన్‌ డాలర్లు భరణం ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ చివరకు హామ్‌ సంపదలో నుంచి 5శాతం చెల్లించాడు. 

* సౌదీ బిలియనీర్‌ అద్నాన్‌ ఖషోగ్గి ఆయన భార్య సోరయ 1974లో విడాకులకు దరఖాస్తు చేసుకోగా 1979లో వచ్చాయి. 1982లో వీరిద్దరి మధ్య భరణం ఒప్పందం జరిగింది. 874మిలియన్‌ డాలర్లు భరణంగా ఇస్తానని అద్నాన్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్నాడు. అద్నాన్‌ 2017లో తన 81వ ఏట మరణించాడు. కానీ అద్నాన్‌ తనకు భరణం కింద ఎటువంటి నగదు ఇవ్వలేదని సోరయ చెబుతోంది.

* లాస్‌వేగాస్‌కు చెందిన క్యాసినో మొగల్‌ స్టీవ్‌ వేన్‌ తన భార్య ఎలైన్‌తో 2010 మార్చిలో విడాకులు తీసుకున్నారు. భరణం కింద ఆమెకు 741మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంది. ఇంకో విషయం ఏమిటంటే వేన్‌ రిసార్ట్‌ స్టాక్‌లో ఎలైన్‌ దీర్ఘకాల సభ్యురాలు, కంపెనీలో ఎక్కువ వాటా ఆమె పేరు మీదే ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరిద్దరూ విడాకులు తీసుకోవడం ఇది రెండోసారి. 1986లో ఆయన మొదటిసారి ఆమెతో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ వీళ్లిద్దరూ 1991లో పెళ్లి చేసుకొని 2010లో రెండో సారి విడాకులు తీసుకున్నాడు.

* రష్యాకు చెందిన బిలియనీర్‌ డిమిట్రీ రెబోబోవ్లేవ్‌ తన భార్య ఎలీనాతో 26ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ 2008లో విడాకులు తీసుకున్నాడు. ఆరేళ్ల తర్వాత స్విస్‌ కోర్టు ఎలీనాకు భరణం కింద 4.8బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సిందిగా డిమిట్రీకి ఆదేశాలు జారీ చేసింది. దాన్ని 2015లో జెనీవా కోర్టులో అప్పీల్‌ చేయగా 564 మిలియన్‌ స్విస్‌ ఫ్రాంకులు చెల్లించాలంది. కానీ చివరకు ఎలీనాకు 600 మిలియన్‌ డాలర్లు భరణం కింద చెల్లించాడు.

* హాలీవుడ్‌ నటుడు మెల్‌ గిబ్సన్‌ తన భార్య రాబిన్‌తో ఉన్న 31ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ 2011 డిసెంబరులో విడాకులు తీసుకున్నారు. విడాకుల భరణం కింద ఆమెకు గిబ్సన్‌ సంపద నుంచి సగం అందాల్సి ఉంది. అంటే సుమారు 425 మిలియన్‌ డాలర్లు భరణంగా ఇవ్వాల్సి వచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు