ఓ మహిళ అయ్యుండీ అర్థం చేసుకోదే!

మా బాస్‌ అమ్మాయిలకు వ్యతిరేకం. షాకింగ్‌ విషయమేమిటంటే తనూ స్త్రీనే. టీమ్‌లో ఎవరైనా కుటుంబ లేదా వ్యక్తిగత సమస్యల కారణంగా సెలవు అడిగినా, సాయమడిగినా ఇబ్బందికరంగా వ్యవహరిస్తుంది. ఈ పరిస్థితిలో ఎలా పనిచేయాలో అర్థం కావడం లేదు.

Updated : 11 Nov 2021 06:43 IST

మా బాస్‌ అమ్మాయిలకు వ్యతిరేకం. షాకింగ్‌ విషయమేమిటంటే తనూ స్త్రీనే. టీమ్‌లో ఎవరైనా కుటుంబ లేదా వ్యక్తిగత సమస్యల కారణంగా సెలవు అడిగినా, సాయమడిగినా ఇబ్బందికరంగా వ్యవహరిస్తుంది. ఈ పరిస్థితిలో ఎలా పనిచేయాలో అర్థం కావడం లేదు.

- సృజన, వైజాగ్‌

ఇల్లు, ఆఫీస్‌ బాధ్యతలను సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అర్థం చేసుకునే, మద్దతిచ్చే బాస్‌ ఉంటే పని కొంచెం తేలికవుతుంది. అలా కాక పిల్లల స్కూలు ఈవెంట్లకు హాజరు కావడం, అనారోగ్యంగా ఉన్న కుటుంబ సభ్యులను చూసుకోవడం లాంటి కారణాలకు సెలవడిగిన ప్రతిసారీ విసుక్కుంటే కొంచెం కష్టమే. కరోనా తర్వాత ఇల్లు, ఆఫీసు రెండింటి పనితో తీరిక లేని వారికి ఇది మరీ సవాలు. వీటిని అర్థం చేసుకోలేని బాస్‌ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.
* ముందు మీ హక్కులను తెలుసుకోండి. సెలవుల వివరాలు, పనికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు, కంపెనీ పాలసీల గురించి క్షుణ్నంగా తెలుసుకోండి. నేరుగా హెచ్‌ఆర్‌ అధికారిని అడిగీ తెలుసుకోవచ్చు. దాని ఆధారంగా మీకున్న అవకాశాలను అంచనా వేసుకోండి.
* మీ పై అధికారిని కలిసి పరిస్థితిని వివరించండి. సంస్థకు, బృందానికి అందిస్తున్న సేవలతోపాటు మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతలనూ తెలియజేయండి. మొత్తంగా నిజాయతీగా, పారదర్శకంగా ఉండేలా చూసుకోండి. ఆమెకు సహానుభూతి లేనంత మాత్రాన కఠినాత్మురాలని చెప్పలేం. బహుశా ఆ దిశగా ఆలోచించకపోయుండొచ్చు. ఉదాహరణకు- మీ బాస్‌కు పిల్లలు లేకపోయుంటే ప్రస్తుత ఆన్‌లైన్‌ పాఠాల ఇబ్బందులు తెలిసుండకపోవచ్చు. తల్లులే టెక్‌పరంగా, పాఠాలు మొదలైన వాటి పరంగా ఎలా సాయమందిస్తున్నారన్నది అవగాహన ఉండదు.
* సహానుభూతిని ప్రదర్శించండి. అధికారికి మన సానుభూతి అవసరమేముంది అనుకోకండి. వాళ్లకీ పై నుంచి ఒత్తిడి, ఆతృత ఉంటాయి. తక్కువ వనరులతో ఎక్కువ ఉత్పత్తి రాబట్టడానికి కష్టపడుతుంటారు. కాబట్టి ఆమె కోణంలోనూ ఆలోచించండి. ఇదంతా వ్యూహాత్మకంగా సాగాలి. ఆమె ఇబ్బందులు, ఆందోళన కలిగించే అంశాలను అడిగి చూడండి. అలాగే లక్ష్యాల గురించి తెలుసుకోండి. వాటికి మీ వంతు సాయం అందిస్తానని చెప్పి చూడండి. మాట్లాడితే.. చాలావరకూ సమస్యలు పరిష్కారమవుతాయి. ముందు దాన్ని ప్రయత్నించి చూడండి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్