close

చరిత్ర

ప్రపంచకప్‌ చరిత్ర

క్రికెట్‌ ఆడే ప్రతి ఒక్కడూ నన్నందుకోవడమే కల అంటారేంటో! సచినంతటోడు నన్ను పైకెత్తి అంతలా ఉద్వేగానికి గురవుతాడేంటో! దిగ్గజాలకే దిగ్గజాలు నన్ను ముట్టుకుని అలా మురిసిపోతారేంటో! నన్ను చేరుకోవడం కోసం క్రికెట్‌ దేశాలన్నీ ఏళ్లకు ఏళ్లు అంత శ్రమిస్తాయేంటో? నేనొచ్చానంటే పదుల కోట్ల మంది పనులు మానుకుని నా పేరే పలవరిస్తారేంటో?ఇంతకీ ఎవరు నేనంటారా..? ఇప్పుడు క్రికెట్‌ ప్రేమికులందరి నోళ్లలో నానుతున్న ప్రపంచకప్‌ను! ఇంకో నాలుగు వారాల్లోనే మళ్లీ మీ ముందునిలవబోతున్నా! 44 ఏళ్ల కిందట నేను పుట్టినపుడు ఊహించలేదు ఇంత క్రేజు! ఈ నాలుగున్నర దశాబ్దాల్లో ఎన్నెన్ని మలుపులో.. ఎన్నెన్ని గురుతులో..! ఒకసారి వెనుదిరిగి చూస్తే జ్ఞాపకాల దొంతర కళ్ల ముందు మెదులుతోంది! ఒకసారి గతంలోకి వెళ్లి అన్నీ తరచి చూడాలని ఉంది.. చూసొద్దాం రండి!

సన్నీ పడుకోబెట్టేశాడు

అధునాతన స్టేడియాలు.. ఫ్లడ్‌ లైట్ల వెలుగుల్లో డేనైట్‌ మ్యాచ్‌లు.. రంగు దుస్తుల్లో ఆటగాళ్లు.. అత్యాధునిక కెమెరాలతో ప్రత్యక్ష ప్రసారం.. వేల కోట్ల వ్యాపారం.. ఆటలో ఎన్నో హంగులు.. ఇలా నా చుట్టూ ఇప్పుడు ఎంత హంగామా ఉంటోందో చూస్తున్నారుగా! కానీ నా అరంగేట్ర రోజుల్లో ఇదేమీ లేదు. 1975లో క్రికెట్‌ పుట్టినింట నా పుట్టుక సాదాసీదాగానే సాగింది. తెల్లటి దుస్తుల్లో ఆటగాళ్లు.. ఎరుపు రంగు బంతి.. 60 ఓవర్ల మ్యాచ్‌లు.. ఒక్క రోజులో ముగిసిపోతాయన్న మాటే కానీ.. టెస్టులకు భిన్నంగా ఏమీ అనిపించలేదు మ్యాచ్‌లు. పైగా గావస్కర్‌ అనే మహానుభావుడు 174 బంతుల్లో 36 పరుగుల ఇన్నింగ్స్‌తో స్టేడియంలో ఉన్నోళ్లందరినీ నిద్రపుచ్చేశాడు. నేను కూడా మధ్యలో అలసిపోయి ఓ కునుకు తీశా. లేచి చూసినా సన్నీ డిఫెన్స్‌ ఆడుతూ కనిపించాడు. ఇలా మరికొన్ని మ్యాచ్‌లు నాలో నీరసం తెచ్చినా సర్దుకుపోయా. ఇక టోర్నీలో ఎనిమిది దేశాలు పోటీ పడ్డా.. నా చూపు మాత్రం ఒక జట్టు మీదే. వాళ్లను చూస్తే ప్రత్యర్థులకు హడలే.. అభిమానులకు వారి ఆట కనువిందే! ఆ సొగసు, ఆ దూకుడు గురించి ఏమని వర్ణించను! నేను మాట్లాడుతున్నది కరీబియన్‌ కింగ్స్‌ గురించే అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందరి ఫేవరెట్‌ అయిన ఆ జట్టే నాకు తొలి ముద్దు ఇచ్చింది. అప్పటి ప్రపంచ క్రికెట్‌ రారాజులు నన్ను పైకెత్తుతుంటే కలిగిన అనుభూతే వేరులే! తర్వాతి పర్యాయం మార్పేమీ లేదు. మళ్లీ వాళ్లదే జోరు. ప్రత్యర్థి మారిందంతే. మళ్లీ వెస్టిండియన్ల చేతుల్లోకే వెళ్తుంటే.. అంతకుముందులా ఉద్వేగం ఏమీ లేదు. ఏముంది కొత్త అనిపించింది.

కపిల్‌ దేవుడు.. అతడి డెవిల్సూ!

ప్రతిసారీ వాళ్లే గెలిస్తే నా పట్ల అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోతుందేమో అన్న ఆందోళన మొదలైంది. ఇలాంటి తరుణంలో 1983 సమరం మొదలైంది. వరుసగా మూడో పర్యాయం కూడా వేదిక ఇంగ్లాండే. ఫేవరెట్‌ వెస్టిండీసే. ఐతే నా మనసు మార్పు కోరుతోంది. సంచలనాలు కోరుకుంటోంది. అప్పుడే చూశా ఓ చరిత్రాత్మక మ్యాచ్‌! ఎవరో కపిల్‌ దేవ్‌ అట! ఏం ఆడాడులే ఆ రోజు. తన జట్టు 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన స్థితిలో వచ్చాడతడు. ఇన్నింగ్స్‌ అయ్యేసరికి అతడి పరుగులు 175. జట్టు స్కోరు 266. ఆ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారంలో చూసే అదృష్టం దక్కలేదట అభిమానులకు. కానీ ఆ ఇన్నింగ్స్‌ కళ్లారా చూసిన నా అనుభూతిని ఏమని వర్ణించను? ఆ ఇన్నింగ్స్‌, ఆ మ్యాచ్‌ నా ప్రస్థానాన్నే మార్చేసింది. ఇంకా చెప్పాలంటే ప్రపంచ క్రికెట్‌నే మార్చిందేమో! ఆ మ్యాచ్‌ ఓడితే ఇంటిముఖం పట్టాల్సిన జట్టు.. కపిలుడి పుణ్యమా అని ముందంజ వేసింది. తర్వాత ఏకంగా ఫైనల్‌ చేరి అతి భయంకర వెస్టిండీస్‌నే ఓడించి కప్పు ఎగరేసుకుపోయింది. లీగ్‌ దశలో మేటి ఇన్నింగ్స్‌తో జట్టును ముందుకు తీసుకెళ్లినోడే.. ఫైనల్లో విధ్వంసక రిచర్డ్స్‌ క్యాచ్‌ను అత్యద్భుత రీతిలో అందుకుని మళ్లీ హీరో అయ్యాడు. అనామక జట్టులా వచ్చి మహా మహా జట్లను మట్టికరిపించిన కపిల్‌ డెవిల్స్‌ నన్ను ముద్దాడుతుంటే ప్రపంచ సుందరి అయిన పులకింత నాది!
ఆ అద్భుత విజయం తర్వాత క్రికెట్‌ను నరనరాన ఎక్కించుకున్న భారతీయులతో నాకు ప్రత్యేక అనుబంధం ముడిపడిపోయింది. 1987లో వాళ్ల దేశానికే నన్ను ఆహ్వానిస్తే రెట్టించిన ఉత్సాహంతో వెళ్లా. అప్పటిదాకా పుట్టింటి సంబరాలకే పరిమితమైన నాకు.. మరో దేశ ఆతిథ్యం సరికొత్త అనుభూతిని పంచింది. క్రికెట్‌ను కనిపెట్టిన ఇంగ్లాండ్‌ను మించిన అభిమానం భారత్‌లో చూసి విస్తుబోయా. నేను ఒకసారి వీళ్ల సొంతమైతేనే ఇలా ఉంటే.. ఇంకోసారి నన్ను గెలిస్తే ఇంకెంత సంబరపడిపోతారో అనిపించింది. కానీ ఈసారి కపిల్‌ సేన సెమీస్‌లోనే నిష్క్రమించింది. ప్రపంచ క్రికెట్లో ఒక మహా ఆధిపత్యానికి ఆ టోర్నీలోనే బీజం పడింది. కంగారూల జట్టు చాప కింద నీరులా వచ్చి కప్పు ఎగరేసుకుపోయింది.

రంగుల్లో.. చిన్నోడి మెరుపుల్లో..

నాలుగేళ్ల తర్వాత నేను సరికొత్తగా ముస్తాబయ్యా. రంగు రంగు దుస్తులట.. ఫ్లడ్‌లైట్‌ వెలుగులట.. తెలుపు బంతితో మ్యాచ్‌లట.. ఫార్మాట్‌ కొత్త అట.. అబ్బబ్బో 92లో ఎన్నెన్ని ఆకర్షణలో! మ్యాచ్‌లు కూడా మహా రంజుగా సాగాయిలే! గ్రేట్‌బాచ్‌తో కలిసి ధనాధన్‌ ఓపెనింగ్‌, కొత్త బంతి ఇచ్చి స్పిన్నర్‌తో బౌలింగ్‌.. ఇలా న్యూజిలాండ్‌ నాయకుడు మార్టిన్‌ క్రో సంచలన నిర్ణయాలతో నా మనసు దోచేశాడు. ఇక అప్పటిదాకా పేరు మాత్రమే విన్న సచిన్‌ అనే చిన్నోడి ఆటను కూడా కళ్లారా చూసే భాగ్యం అప్పుడే దక్కింది. అందుకు సరైన వేదికే సిద్ధమైంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే భారత్‌కు యుద్ధం లాంటిదట. అందులోనూ నా ముంగిట తొలిసారి వీరి పోరు అనగానే క్రికెట్‌ ప్రపంచమంతా కళ్లప్పగించి చూసింది. విపరీతమైన ఒత్తిడి ఉండే ఆ మ్యాచ్‌లో ఆ చిన్నోడు అదిరిపోయే అర్ధసెంచరీతో నన్ను కట్టిపడేశాడు. మియాందాద్‌ కుప్పిగంతులు మరపురాని జ్ఞాపకమే. భారత్‌, పాకిస్థాన్‌ పోరులో మజా అప్పుడే తెలిసింది! భారత్‌ చేతిలో ఓడటమే కాదు.. ఓ దశ వరకు పేలవంగా ఆడిన పాకిస్థాన్‌ జట్టును తక్కువగా అంచనా వేశా. కానీ ఆ జట్టే చివర్లో అద్భుతాలు చేసింది. ఏకంగా కప్పు పట్టుకుపోయింది. లేక లేక దక్షిణాఫ్రికా జట్టు నిషేధం నుంచి బయటపడి ప్రపంచకప్‌లోకి వస్తే.. డక్‌వర్త్‌ లూయిస్‌ అంటూ ఏదో కొత్త పద్ధతి వచ్చి వారి కొంపముంచడం ఆ టోర్నీలో నేను మరిచిపోలేని ఓ చేదు జ్ఞాపకం!

ఇలా కూడా ఆడతారా?

96లో మళ్లీ ఉపఖండానికి తిరిగి రాగానే నాలో తెలియని ఉత్సాహం! ముందు టోర్నీలో చిన్నోడిలా ఉన్న సచినుడు.. ఈసారి భారీ అవతారంలోనే కనిపించాడు నాకు. అతడి మెరుపులు ఇంకా నా జ్ఞాపకాల్లో పదిలం. సచినుడి జోరు, భారత జట్టు ఊపు చూస్తే ఈసారి మళ్లీ వారి సిగలోకే చేరతానేమో అనిపించింది. కానీ ఈడెన్‌ గార్డెన్స్‌లో లంకేయుల చేతిలో వారి ఓటమి, అభిమానుల ఆవేదన చూసి గుండె తరుక్కుపోయింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. భారత్‌ను ఓడించిన లంకేయులు మామూలోళ్లు కాదు. జయసూర్య, కలువితరణ జోడీ ధనాధన్‌ ఓపెనింగ్‌తో ప్రత్యర్థుల్ని బెంబేలెత్తించేసి మ్యాచ్‌లను ముందే లాగేసుకోవడం చూసి ఓపెనర్లు ఇలా కూడా ఆడతారా అనిపించింది. మొత్తంగా లంకేయుల ఆటకు ఫిదా అయిపోయా. వారి ఒళ్లోనే వాలిపోయా! నాలుగేళ్లు గడిచాయి. మళ్లీ చాలా కాలం తర్వాత నా పుట్టింటికొచ్చా. నక్క తోక తొక్కి వచ్చిన కంగారూలు నన్ను పట్టుకుపోయారు. నక్క తోక తొక్కడమేంటి అంటారా? ఆ స్టీవ్‌ వా క్యాచ్‌ను గిబ్స్‌ పట్టినట్టే పట్టి వదిలేయకుంటే వాళ్లు లీగ్‌ దశ దాటేవాళ్లా? సెమీఫైనల్లో ఆ డొనాల్డ్‌ కొంచెం అప్రమత్తంగా ఉంటే కంగారూ జట్టు ఫైనల్‌ చేరేదా? అప్పటిదాకా టోర్నీలో అరివీర భయంకరంగా కనిపించిన పాకిస్థాన్‌ అదే స్థాయిలో ఆడితే కంగారూలు నిలిచేవాళ్లా?

ఏం కొట్టుడు.. ఏం కొట్టుడు!

2003లో చూశా అసలు మజా! చెత్తగా టోర్నీని మొదలుపెట్టి అభిమానులతో శవయాత్రలు చేయించుకున్న భారత జట్టు.. ఆ తర్వాత పుంజుకుని అద్భుత విజయాలు సాధించి నాతో పాటు అందరి మనసులూ గెలిచేసింది. నా కళ్ల ముందు ఎన్నో మెరుపులు చూశా, మరెన్నో విధ్వంసాలకు వేదికయ్యా! కానీ ఈ టోర్నీలో భీకరమైన అక్రమ్‌, వకార్‌, అక్తర్‌ త్రయాన్ని సచిన్‌ ఉతికారేసిన వైనాన్ని మాత్రం ఎన్నటికీ మరువజాలను. ఇప్పటికీ కళ్ల ముందే మెదులుతున్నాయి అక్తర్‌ పీచమణిచిన ఆ అప్పర్‌ కట్‌లు! ఇలాంటి మెరుపులు, చక్కటి విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లిన గంగూలీ సేన.. తన దేశానికి రెండోసారి నన్ను అందిస్తుందనే అనుకున్నా. కానీ కంగారూ జట్టు వదిలితేనా! తర్వాతి పర్యాయం కరీబియన్‌ గడ్డపై అంతా చేదు జ్ఞాపకాల మయం! నేనంత కళావిహీనంగా కనిపించిన టోర్నీ మరొకటి లేదేమో! భారత జట్టు గ్రూప్‌ దశలోనే ఇంటిముఖం పడితే ఇక నాకు ఆకర్షణ ఏముంటుంది? అది చాలదన్నదట్లు పాకిస్థాన్‌ కోచ్‌ బాబ్‌ వూమర్‌ మృతితో అందరి దృష్టీ నా నుంచి పక్కకెళ్లిపోయింది. ఇక మసక మసక చీకట్లో జరిగిన ఫైనల్‌తో టోర్నీ మరింత మసకబారిపోయింది. ఈ చేదు జ్ఞాపకాలతో నాలుగేళ్లు చాలా భారంగానే గడిపాను. ఐతే మళ్లీ ఉపఖండానికి వెళ్తున్నానన్న ఆనందం నాలో తిరిగి ఉత్సాహం తెచ్చింది.

మాస్టర్‌ చేతుల్లో ఒదిగిపోయి..

87లో తొలిసారి వచ్చా.. ఆదరణకు ఆశ్చర్యపోయా! 96లో ఇంకోసారి వచ్చా.. జన నీరాజనానికి మురిసిపోయా.. 2011లో మళ్లీ భారత గడ్డపై అడుగుపెట్టగానే ఇక్కడి అభిమానుల ప్రేమకు పులకించిపోయా! ఆట పట్ల వాళ్ల ఇష్టం చూసి ఆనందమేసినా.. తమ జట్టుపై పెట్టుకున్న ఆశలు, అంచనాలు చూసి భయమేసింది! భారత జట్టు కప్పు గెలవకపోతే ఏమైపోతారో అనిపించింది. పట్టువదలని విక్రమార్కుడిలా ఆరో పర్యాయం కప్పు కలతో బరిలోకి దిగుతున్న సచిన్‌ కోసమైనా భారత్‌ నన్ను సొంతం చేసుకోవాలనిపించింది. ఐతే ధోనీసేన అంచనాల ఒత్తిడిని తట్టుకుని నిలిచింది. ఆస్ట్రేలియా గండాన్ని దాటింది. పాకిస్థాన్‌ ప్రమాదాన్ని కాచుకుంది. అంతిమంగా శ్రీలంక విసిరిన సవాల్‌నూ ఛేదించింది. ఆఖర్లో మహేంద్రుడు కొట్టిన ఆ సిక్సర్‌ను మరువగలనా! నా చరిత్రలో అలాంటి ముగింపు ఎప్పుడూ చూడలేదు. ఇకపైనా చూడలేనేమో! నన్నందుకుని మాస్టర్‌ మురిసిపోతున్న క్షణాన నాలోనూ ఏదో తెలియని ఉద్వేగం! నేను సొంతమైన ఆనందంలో భారతావని స్పందించిన తీరు చూసి నాకు నేను ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువులా కనిపించా! ఇక గత టోర్నీలో మళ్లీ మామూలే! నన్ను తమ ఆస్తిలా భావించే కంగారూలు.. సొంతగడ్డపై పట్టు వదల్లేదు. మళ్లీ నన్ను పట్టుకుపోయారు!
నాలుగేళ్లు గడిచాయి. మళ్లీ నేను సరికొత్తగా ముస్తాబైపోయా! ఈసారి ఎన్నెన్ని ఆకర్షణలో! మరి ఇప్పటిదాకా ఎవరెవరి సొంతమో అయిన నేను.. ఈసారైనా నా పుట్టింటి వారి చిరకాల వాంఛ నెరవేరుస్తానా? భారత జట్టు మూడో ముచ్చట తీరుస్తానా? కంగారూలకు ఆరోసారి అవకాశమిస్తానా? మరొకరికి దక్కుతానా?


నేటి మ్యాచులు

దేవతార్చన

రుచులు

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net