దేశం కోసం.. మహా ప్రజాఉద్యమం

ప్రధానాంశాలు

దేశం కోసం.. మహా ప్రజాఉద్యమం

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులా?
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
ఇందిరాపార్కు వద్ద   ప్రతిపక్షాల మహాధర్నా

ఈనాడు- హైదరాబాద్‌, న్యూస్‌టుడే-గాంధీభవన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద ప్రతిపక్షాలు బుధవారం మహాధర్నా నిర్వహించాయి. సీపీఎం, సీపీఐ జాతీయ నేతలు, కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీలు, ప్రజాసంఘాల రాష్ట్ర నేతలు పాల్గొన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకూ మహాధర్నా కొనసాగింది. ఇందులో పాల్గొన్న సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. దేశాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా మహా ప్రజా ఉద్యమం మొదలైందని, మోదీని గద్దె దించేవరకు కొనసాగుతుందన్నారు. లౌకికవాదం, సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక వ్యవస్థను మోదీ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినవారిపై కేసులు పెడుతున్నారన్నారు. ప్రధాని పుట్టినరోజున రెండు కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు చెపుతున్నారని, ఆ తర్వాత ఎందుకు కొనసాగించలేదని ఆయన ప్రశ్నించారు. రైతులు ఆందోళన చేస్తున్నా, చనిపోతున్నా స్పందించే తీరిక లేని ప్రధానికి విదేశీ పర్యటనకు మాత్రం సమయం దొరుకుతోందా అని ప్రశ్నించారు. మోదీ విదేశీ పర్యటనల వెనక రహస్య ఎజెండా ఉంటుందని ఆరోపించారు.

ఐక్యపోరాటాలతో కాపాడుకుందాం: రేవంత్‌రెడ్డి

ఐక్య పోరాటాలతో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ల నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని రక్షించుకుందామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ధరణి, మల్లన్నసాగర్‌, ఫార్మాసిటీ భూనిర్వాసితుల సమస్యలు, పోడు భూములపై హక్కులపై ఉద్యమించాలన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించి పట్టాలిస్తానని చెప్పిన సీఎం మాట తప్పారని విమర్శించారు. వాటి కోసం పోరాడిన గిరిజన మహిళలు, చంటిపిల్లల తల్లులను, చివరికి మూడునెలల చిన్నారిని సైతం జైలుకు పంపించారని మండిపడ్డారు. పెట్రోల్‌, డీజిల్‌పై మోదీ, కేసీఆర్‌లు కలిసి లీటరుపై రూ.65 పన్నుల రూపంలో పిండుతున్నారన్నారు. అక్టోబరు 5న నిర్వహించే పోడు రాస్తారోకోలో భద్రాచలం వద్ద తాను పాల్గొంటానని రేవంత్‌రెడ్డి తెలిపారు.

దేశ రాజకీయాల్లో కీలక మలుపు: నారాయణ

దేశ రాజకీయాల్లో ఈ ధర్నా కీలక మలుపు అని.. గ్రామస్థాయి నుంచి దేశస్థాయి వరకూ అఖిలపక్ష పోరాటం మొదలైందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంటు విలువ రూ.3 లక్షల కోట్లయితే రూ.30 వేల కోట్లకు అమ్ముతున్నారని ఆరోపించారు. మాదక ద్రవ్యాలు గుజరాత్‌ ద్వారానే వస్తున్నాయన్నారు. నేతల ఇళ్లపై దాడి నీచ సంస్కృతి అని, రేవంత్‌రెడ్డి ఇంటిపై దాడిని అఖిలపక్షం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రెండు రాష్ట్రాల్లో నేతల తిట్ల దండకం సాగుతోందని విమర్శించారు.

ప్రజాయుద్ధంలా ఉండాలి: తమ్మినేని

పోడు భూముల హక్కుల సాధన ఉద్యమం మోదీ ప్రభుత్వంపై ప్రజా యుద్ధంలా ఉండాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గ్రామీణుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని, కేసీఆర్‌ మరో నిజాంలా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ఒక్కరే ప్రగతిభవన్‌లో ఉంటే ప్రతిపక్షాలన్నీ ఇందిరాపార్క్‌ వద్ద ఉన్నాయని తెజస నేత కోదండరాం అన్నారు. మహాధర్నాలో మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహులు, పార్టీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌అలీ, మధుయాస్కీ, కోదండరెడ్డి, చిన్నారెడ్డి, పొన్నం ప్రభాకర్‌లతోపాటు వేములపల్లి వెంకట్రామయ్య, అజీజ్‌పాషా, గోవర్ధన్‌, రంగారావు, సంధ్య తదితరులు పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తుండగా పోడుభూముల వ్యవహారంలో అరెస్టయిన ఖమ్మం జిల్లాకు చెందిన మహిళను, ఆమెతో పాటు జైలులో ఉన్న మూడు నెలల పసిబిడ్డను వేదికపైకి పిలిపించారు. ప్రజాజీవనానికి పనికివచ్చే వ్యవసాయ భూముల్ని నాశనం చేయొద్దని యాచారం ఫార్మాసిటీ బాధితుడు నారాయణ కోరారు. తెరాస పాలనపై చాడ వెంకట్‌రెడ్డి రాసిన పాటల సీడీని నాయకులు ఆవిష్కరించారు. మహాధర్నా సందర్భంగా కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు, ఇతర పార్టీల జెండాలతో ధర్నా చౌక్‌ కళకళలాడింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని