
హైదరాబాద్ వార్తలు




వికారాబాద్ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: పురపాలికలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా అదనంగా పనులు నిర్వహించిన కార్మికులకు అదనంగా డబ్బులు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ కోరారు. శనివారం అన్ని వార్డుల్లో పర్యటించి కార్మికుల పనులను పరిశీలించి వారితో చర్చించానని ఆయన అన్నారు. కార్మికులకు పురపాలక అధికారులు సరఫరా చేసే మధ్యాహ్న భోజనం సక్రమంగా లేదన్నారు.





వికారాబాద్ టౌన్, న్యూస్‌టుడే: మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం చేయూతను అందిస్తుందని భారాస జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. శనివారం పట్టణంలోని అంబేడ్కర్ భవనంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు మంజూరైన కుట్టుమిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇంటి వద్దనే ఉంటూ జీవనోపాధి పొందేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఆర్థిక అభివృద్ధి సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నవాబ్‌పేట, న్యూస్‌టుడే: బలన్మరణానికి పాల్పడిన పంచాయతీ కార్మికుడి మృతిపై అనుమానం ఉందంటూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. ఈ సంఘటన మండల పరిధిలోని అక్నాపూర్‌లో చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన దయ్యాల రత్నయ్యకు భార్య సత్తమ్మతో పాటు, పిల్లలున్నారు. గ్రామ పంచాయతీలో కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రత్నయ్య ఈ నెల 18 బలవన్మరణానికి (ఉరేసుకొని మృతిచెందాడు) పాల్పడ్డాడు. మద్యం అలవాటు ఉండేదని, ఆ మత్తులోనే ఉరేసుకొని మృతిచెంది ఉంటాడని, పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇదే గ్రామానికి చెందిన కొందరు రత్నయ్యను కొట్టి చంపి, ఉరేసి ఉంటారని గ్రామంలో చర్చ జరిగింది. ఈ విషయం కుటుంబీకులకు తెలిసింది. మా తమ్ముడు (రత్నయ్య) మృతిపై అనుమానం ఉందంటూ మృతుడి అన్న చంద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం తహసీల్దారు రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు, గ్రామస్థుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. వైద్యాధికారి శాంతప్ప సమక్షంలో పంచనామ నిర్వహించారు. దర్యాప్తుతో పాటు, వైద్యుల నివేదిక అనంతరం హత్యా, బలవన్మరణమా అనే విషయం తేలుతుందని ఎస్సై భరత్‌భూషణ్ తెలిపారు.
చేవెళ్ల, న్యూస్‌టుడే: చేవెళ్ల కోర్టు కాంప్లెక్స్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని న్యాయవాదులు ఎంపీ రంజిత్ రెడ్డిని శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. బార్ అసోసియేషన్‌కు పక్కా భవనం నిర్మించాలని కోరారు. చేవెళ్లలో అదనపు జిల్లా కోర్టు, అడిషనల్ జూనియర్ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు న్యాయవాదులు తెలిపారు. చేవెళ్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు యాదిరెడ్డి, కార్యదర్శి చంద్రశేఖర్, న్యాయవాదులు రామ్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, రఘునాథ్‌రెడ్డి, శంషుద్దీన్, వెంకటేశం తదితరులు ఉన్నారు.
నవాబ్‌పేట, న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్ సారథ]్యంలో పల్లెల్లో అభివృద్ధి జరుగుతోందని, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరుతున్నాయని చేవెళ్ల శాసన సభ్యులు కాలె యాదయ్య అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పథ]కాలు పరిశీలించడంతోపాటు నేరుగా సమస్యలు తెలుసుకునేందుకు శుభోదయం కార్యక్రమం చేపట్టామన్నారు. కార్యక్రమంలో భాగంగా శనివారం ముందుగా మండల పరిధిలోని ముబారక్‌పూర్‌లో సర్పంచి చిట్టెపు బాలమణి, ఎంపీటీసీ దయాకర్‌రెడ్డితో కలిసి పర్యటించారు. గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో రూ.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం మైతాబ్‌ఖాన్‌గూడలో సర్పంచి అనితారంగారెడ్డి, ఎంపీటీసీ సుమలత మాణిక్‌రెడ్డిలతో కలిసి గ్రామంలో కలియతిరిగారు. గ్రామంలో మూడు రోజులుగా నీటి సరఫరా లేదని, ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యేకు మహిళలు వివరించారు. కార్యక్రమంలో మండల భారాస పార్టీ, సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డి, రావుగారి వెంకట్‌రెడ్డి, ఏఎంసీ, పీఏసీఎస్ ఛైర్మన్లు డా. ప్రశాంత్‌గౌడ్, పోలీస్ రాంరెడ్డి, నాయకులు రంగారెడ్డి, చిట్టెపు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈనాడు, హైదరాబాద్: లండన్ నగరంలో రహదారుల పొడవునా, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వీధి పటాలను.. హైదరాబాద్, వరంగల్‌లాంటి నగరాల్లో ఏర్పాటు చేయాలంటూ అనుజ్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ను కోరగా.. ఆయన వెంటనే స్పందించారు. బోర్డులు ఏర్పాటు చేసిన ప్రాంతం చుట్టూ.. చెప్పుకోదగిన ప్రాంతాలను డిజిటల్ పటంలో చూపుతూ, వాటి ప్రాముఖ్యాన్ని, అక్కడికి చేరుకునే మార్గాన్ని సూచించడం వీధి పటాల గొప్పదనం. లండన్ నగరాన్ని వీక్షించేందుకు వెళ్లే పర్యాటకులకు, కొత్త వారికి అవి చాలా ఉపయోగపడుతున్నాయని సమాచారం. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ రాష్ట్ర పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని శనివారం ట్యాగ్ చేశారు.
ఈనాడు- హైదరాబాద్: ఇతర దేశానికి చెందిన నేరగాళ్లు నగరానికి వచ్చి డబ్బు కొట్టేసిన ఉదంతమిది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బంగ్లాదేశ్‌కు చెందిన దొంగలు రూ.8 లక్షలు కొట్టేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కూకట్‌పల్లిలో విదేశీ నగదు మార్పిడి(మనీ ట్రాన్స్‌ఫర్ ఏజెన్సీ) సంస్థ కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరు వ్యక్తులు ఏజెన్సీలోకి ప్రవేశించి ప్రతినిధితో పరిచయడం పెంచుకున్నారు. రెండుసార్లు 500 డాలర్ల నగదు మార్పిడి చేసుకొంటూ నమ్మకం కలిగేలా చేశారు. మూడోసారి పథకం ప్రకారం.. తమ తల్లి అనారోగ్యానికి గురైందని, వెంటనే రూ.8 లక్షలు కావాలని ఏజెన్సీ ప్రతినిధికి సమాచారమిచ్చారు. తాముండే ప్రాంతానికి వచ్చి డాలర్లు తీసుకుని.. నగదు ఇవ్వాలని కోరారు. ఇదంతా నమ్మిన ఉద్యోగి.. నగదును తమ కుమారుడికి ఇచ్చి పంపారు. నిందితులు మొత్తం సొమ్ము ఇవ్వకుండా నోట్ల కట్ట పైన, కింద 100 డాలర్ల నోట్లు ఉంచి... మధ్యలో మాత్రం ఒక డాలర్ నోట్లు 98 ఉంచారు. ఉద్యోగి కుమారుడు ఇవేవీ గమనించలేదు. నిందితులు నగదు తీసుకుని వెళ్లిపోయారు. మరుసటి రోజు అతని తండ్రి చూడగా.. కంగుతిని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కారు సమాచారంతో బంగ్లాదేశీ లింకు.. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు నిందితులు వినియోగించిన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అతనిచ్చిన వివరాల ఆధారంగా నిందితులిద్దరూ బంగ్లాదేశీయులని తేలింది. ఇక్కడ డబ్బు కొట్టేశాక.. నేరుగా చెన్నై వెళ్లారు. అక్కడి నుంచి కోల్‌కతా.. అటు నుంచి బంగ్లాదేశ్ వెళ్లిపోయారు. నిందితుల పాస్‌పోర్టు, ఇతర వివరాలు సేకరించారు. లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. నిందితులు మరోసారి దేశంలో అడుగుపెడితే వెంటనే అరెస్టవుతారని పోలీసులు చెప్పారు.
ఈనాడు, హైదరాబాద్: ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా శనివారం కొత్తగా 682 పాస్‌పోర్టులు మంజూరు చేసినట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య వెల్లడించారు. మొత్తం 700 అపాయింట్‌మెంట్లు మంజూరు చేయగా.. 682 పాస్‌పోర్టుల దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన వాటిని తిరస్కరించినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలోని 14 తపాలా కార్యాలయాల్లోని సేవా కేంద్రాల్లో ప్రతి శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
General News
CM Jagan: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ
-
India News
Stalin: బుల్లెట్ రైలులో సీఎం స్టాలిన్.. రెండున్నర గంటల్లో 500కి.మీల ప్రయాణం!
-
Movies News
The Kerala Story: వాళ్ల కామెంట్స్‌కు కారణమదే.. కమల్‌హాసన్ వ్యాఖ్యలపై దర్శకుడు రియాక్షన్
-
General News
TSPSC Paper Leak Case: సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరం.. ఐటీ ఉద్యోగి అరెస్టు
-
World News
Cosmetic Surgeries: సౌందర్య చికిత్సతో ఫంగల్ మెనింజైటిస్.. కలవరపెడుతున్న మరణాలు
-
Politics News
PM Modi: భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలతో అధిష్ఠానం కీలక భేటీ
