close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పున్నమి వెలుగు

- గోగినేని మణి

‘‘చల్లగాలికి ఇలా ఇంటిముందు మంచం వేసుకుని కూర్చుని తియ్యటి కొబ్బరినీళ్ళు తాగుతుంటే... ప్రాణానికి ఎంత హాయిగా ఉందో! ఇంతకంటే వైభోగం ఇంకేం ఉంటుందీ అనిపిస్తోంది’’ పడమటి వైపుకు పయనమవుతున్న దినకరుడిని చూస్తూ ఒకింత పరవశంతో అన్నాడు జానకిరామయ్య.
శకుంతలమ్మ ఆయనవైపు చిరునవ్వుతో చూసి ‘‘ఈవేళ కొత్త ఏం ఉందీ... ఇది  రోజూ జరిగేదేగా’’ అంది.
‘‘ఏమిటో...’’ అంటూ నిట్టూర్చాడు. ‘‘మొన్న ఫోనులో అబ్బాయి అందరం కలిసి ఉండే అవకాశం ఇన్నాళ్ళకు వచ్చిందని చెప్పినప్పటి నుండీ... ఈ అదృష్టం చేజారి పోతున్నట్లు దిగులుగా అనిపిస్తోంది.’’
‘‘మీరు రిటైరయ్యారు కాబట్టి మనమూ వాడితోపాటే ఉండొచ్చని అన్నాడు. మంచిమాటేగా దిగులెందుకూ’’ అంది.
‘‘ఏమో మరి... ఈ ఇంటినీ సొంత ఊరునీ విడిచి వెళ్ళాలంటే నాకు మాత్రం బెంగగానే ఉంది. వీటిపట్ల నాకింత మమకారం ఉందని నాకూ ఇప్పుడే అర్థమవుతోంది.
‘‘సారథి దగ్గర్నుండి ఫోను వచ్చినప్పటినుంచీ అదోలా కనిపిస్తుంటే ఏమో అనుకున్నాను, ఇందుకే అన్నమాట. అయినా అప్పుడపుడూ వచ్చి వెళ్తూనే ఉంటాంగా..!’’
‘‘నువ్వో పిచ్చిమొహానివి... ఇక్కడ మనకేం ఉందని వచ్చిపోతుంటాం చెప్పు. బారెడు భూమయినా లేదాయె. అబ్బాయేమో ఆమధ్య లోను తీసుకుని అక్కడ పెద్ద అపార్ట్‌మెంట్‌ కొన్నాడా... ఇక ఈ ఊళ్ళో ఎవరూ ఉండనప్పుడు ఈ పాత పెంకుటిల్లు పాడుబడ్డట్లవుతుందనీ, అమ్మేసి ఆ ఫ్లాట్‌ లోనుకి కట్టేస్తే సుఖంగా ఉండొచ్చనీ అంటాడు... కాదనగలమా? ఆ తర్వాత మనకి నచ్చినా, నచ్చకపోయినా అక్కడ ఉండాల్సిందే. తిరిగి రావాలనుకున్నా దారి అలా మూసుకుపోతుందన్నమాట. ‘నీకు రావాల్సిన రిటైర్మెంట్‌ తాలూకు డబ్బంతా సరిగానే అందిందా’ అంటూ ఆ వివరాలూ అడిగాడు. అంటే, ఈ పాత ఇల్లు అమ్మిన డబ్బు సరిపోకపోతే, ఇదీ జమ చేసేయాలనే ఉద్దేశం ఉందేమో!’’
‘‘ఎటూ వాడికి చెందేదేకదా, అవసరమైతే కొంచెం ముందుగానే ఇస్తాం... అంతేగా! ఆ మాత్రం దానికి ఇంత ఆలోచనెందుకూ..?’’
‘‘నువ్వో పిచ్చి మొహానివని అందుకే అంటున్నాను. ఇప్పుడు మన దగ్గరున్నదంతా అప్పగించేస్తే, ఆపైన ఏ పెద్ద ఖర్చులు వచ్చినా వాళ్ళముందు చేయి చాపాల్సిందేగా, కాదంటే అప్పుడు బాధపడాల్సి వస్తుంది.’’
‘‘ఏమిటో... ఇలాగే జరుగుతుందన్నట్లుగా అంత నమ్మకంగా ఎలా చెప్పగలరూ?’’
‘‘అనుభవం. ఇదేం కొత్తకాదు. ఇలాంటివి ఎన్ని చూడటం లేదూ..?’’
‘‘మన సారథి అలా చేయడు. నాకా నమ్మకం ఉంది.’’
‘‘తల్లిదండ్రులందరూ తమ పిల్లలు మాత్రం ప్రత్యేకమనే అనుకుంటారు’’ అంటూ నిట్టూర్చాడు. ఆయన తన అరచేతి వైపు చూసుకోవటాన్ని ఆమె గమనించింది. అప్పుడాయనకు ఏం గుర్తుకు వచ్చి ఉంటుందో ఆమె సరిగానే ఊహించింది.
సారథి హైస్కూలు చదువుకి వచ్చే సమయానికి, వేరేచోట ఉద్యోగం చేస్తున్న జానకిరామయ్య ప్రయత్నాలు ఫలించి సొంత ఊరుకు కొంచెం దగ్గరలోకి ట్రాన్స్‌ఫర్‌ వచ్చింది. అప్పటికి అతని తల్లీ తండ్రీ సొంత ఊళ్ళోనే ఉండి తమకున్న మూడెకరాల వ్యవసాయంతో కాలక్షేపం చేస్తున్నారు. జానకిరామయ్య తనకి పోస్టింగ్‌ వచ్చిన ఊరిలో తనొక్కడే ఉండి, భార్యనూ కొడుకునూ సొంతింటిలో తన తల్లిదండ్రులతోపాటే ఉంచి, వారానికి రెండు మూడుసార్లు వచ్చి వెళ్తుండేవాడు. వ్యవసాయం మీద రాబడి అంతంత మాత్రమే. జానకిరామయ్య సంపాదన కలిసిరావడం వలన ఏవో కొన్ని ఒడుదొడుకులు ఉన్నాగానీ రోజులు బాగానే గడిచిపోయేవి.
సారథి టెన్త్‌క్లాసులో ఉన్నప్పుడు జరిగిన సంఘటన అది... జానకిరామయ్య తను ఉద్యోగం చేసే ఊరుకి బయలుదేరి వెళ్తున్న సమయంలో అతని తండ్రి తమ పొలంలో కలుపు తీయాల్సిన అవసరాన్ని గుర్తుచేశాడు. ఆ సంవత్సరమే వాళ్ళ ఎద్దులు చనిపోవటంతో దున్నటానికి ఎద్దుల్ని అద్దెకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ నెలలోనే హాస్పిటల్‌ ఖర్చులూ అదనంగా వచ్చాయి. జానకిరామయ్య మొత్తం ఖర్చు ఎంతవుతుందో మనసులోనే లెక్కవేసుకొని, రెండుమూడు రోజుల్లో తిరిగి వచ్చినప్పుడు ఆ ఏర్పాటు చూస్తానని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు.
మూడురోజుల తర్వాత... స్కూలు నుండి వచ్చిన సారథి వంటగదిలో పనిచేసుకుంటున్న తల్లి దగ్గరకు వచ్చి ‘‘మన పొలంలో కలుపుతీత పైసా ఖర్చు లేకుండా అయిపోయిందమ్మా’’ అన్నాడు హుషారుగా.
‘‘అదెలా!?’’ అంటూ శకుంతలమ్మ ఆశ్చర్యపోతే, అప్పుడు వివరంగా చెప్పాడు.
‘‘తాతా, నేనూ భలే సరదాగా పూర్తి చేసేశాం. కాడి లాగుతూ ముందు నేనూ, వెనుక తాతా అన్నమాట. అలుపు తెలియకుండా నేను పాటలూ, తాత పద్యాలూ అనుకున్నాం. తాత ముందుగా ‘సిరికిం జెప్పడు...’ మొదలుపెట్టి పూర్తిచేశాక నేను ‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా...’ అంటూ నాకిష్టమైనది అందుకున్నాను. తర్వాత తాత ‘జయమ్ము నిశ్చయమ్మురా...’ అని ప్రారంభిస్తోంటే, నీవి పద్యాలు మాత్రమేనని నేను గొడవ చేసేసరికి ‘చెల్లియో, చెల్లకో...’ అంటూ రాగం తీశాడు. మొన్న స్కూలుకి ఎలాగూ సెలవేగా, నిన్న మాత్రం మానేశాను. ఈరోజేమో ఒక గంట ఆలస్యంగా వెళ్ళేసరికి మా సార్‌ ఆటలాడుతూ ఆలస్యం చేశాననుకుని ఒక్కటిచ్చారు’’ అంటూ నవ్వాడు.
తమాషా సంగతి చెబుతున్నట్లుగా నవ్వుతున్న కొడుకు వైపు కళ్ళు విప్పార్చి చూసింది. ‘‘ఏంటి నాన్నా... నువ్వు... కాడెద్దులా...’’ అంటూ కొడుకు భుజాలపైన చేతులు వేయగానే ఆమెకి చెంపలమీదుగా కన్నీళ్ళు ధారలు కట్టాయ్‌. అంతలోనే ‘‘సారథీ’’ అన్న ఉరుములాంటి కేక ఇంటిగుమ్మం ముందునుండి వినిపించగానే సారథి పరుగుపెట్టాడు. కళ్ళు తుడుచుకుంటూ ఆమె కూడా వెనకనే అడుగులు వేసింది.
‘‘ఏంట్రా నువ్వు చేసిన పని... ఆటలకు వేళాపాళా లేదా? బడి ఎగ్గొట్టి బలాదూరు తిరుగుతావా... ఇదెప్పటి నుండి?
మీ మాస్టారు నీమీద కంప్లైంట్‌ చేస్తే, అది నాకెంత అవమానంగా ఉంటుందో ఆలోచించావా?’’ అంటూ జానకిరామయ్య కొడుకు రెండు చెంపలూ టపటపా వాయించేశాడు.
అప్పుడే బయటకు వచ్చిన తండ్రి ‘‘వాడి తప్పేంలేదు’’ అంటూ తనూ మనవడూ కలిసి చేసిన పనిని చెప్పగానే జానకిరామయ్య అక్కడ వరండాలోనే ఉన్న ముళ్ళకర్రను తీసుకొని కొడుకుని కొట్టిన అరచేతిమీద ఆవేశంతో కొట్టుకుంటుంటే అందరూ అడ్డంపడ్డారు.
ఆ తర్వాత రెండు రోజులూ శకుంతలమ్మ కళ్ళు తుడుచుకుంటూ కొడుకుని బుజ్జగించటం, భర్త అరచేతికి ఆరారా నవనీతం రాయటంతో సరిపోయింది. గాయం తొందరగానే తగ్గినా ఆయన అరచేతిలో మచ్చ మాత్రం మిగిలిపోయింది.
ఆ సంఘటనే ఇద్దరికీ అప్పుడు గుర్తుకు వచ్చింది.
ఆ తర్వాత జానకిరామయ్య తల్లిదండ్రులిద్దరూ కాలం చేయటం... అతనికి సొంత ఊరికి ట్రాన్స్‌ఫర్‌ రావటమూ జరిగింది. సారథి చదువు పూర్తిచేసి, ఉన్నత ఉద్యోగంలో స్థిరపడి, పెళ్ళి చేసుకుని, ఇద్దరు పిల్లలతో సిటీలో ఉంటున్నాడు.

* * * * *

శకుంతలమ్మ భర్త చేతిని అనునయిస్తున్నట్లుగా పట్టుకుని రెండు క్షణాలు మౌనంగా ఉండిపోయింది. తర్వాత ‘‘మీరు అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకండి. ఏదెలా జరిగినా ఫర్వాలేదు. ఎల్లుండి అబ్బాయి వస్తున్నానని చెప్పాడుగా... అన్నీ వివరంగా మాట్లాడదాం. వాడు అవసరమని అడిగితే మాత్రం కాదనకుండా డబ్బు ఇచ్చెయ్యండి. నన్ను పిచ్చిమొహాన్నని అన్నా సరే’’ అంది.
‘నేనూ అంతేలే. వాడు అడిగితే దగ్గర లేకపోయినా అప్పు తెచ్చి అయినా ఇవ్వనా’ మనసులోనే అనుకుంటూ నిట్టూర్చాడు.
అనుకున్న రోజున సారథి రానే వచ్చాడు. కబుర్లతో, సారథి ఊళ్ళోకి వెళ్ళి బంధుమిత్రులను కలవటంతో రెండురోజులు గడిచిపోయాయి. కొంచెం నీరసంగా ఉండటంతో జానకిరామయ్య మాత్రం కొడుకుతో బయటకు వెళ్ళకుండా ఇంటిపట్టునే ఉండిపోయాడు.
సారథి ఏ విషయమూ ప్రస్తావించకపోయే సరికి తన మనసులోని మాటను తనే ముందుగా బయటపెట్టడం మంచిదనే ఉద్దేశ్యంతో ఆరోజు మాటలమధ్య అన్నాడు- ‘‘ఈరోజుల్లో... పిల్లలవీ పెద్దలవీ పద్ధతులన్నీ వేరేవేరేగా ఉంటున్నాయి. అందుకే ఉమ్మడి కుటుంబాలకంటే విడివిడిగా ఉండటమే బావుంటోంది.’’
సారథి అంగీకరిస్తున్నట్లుగా తల ఊపాడు. ‘‘నిజమే నాన్నా, అందరూ ఉద్యోగాలతో ఎక్కడెక్కడికో వెళ్ళాల్సివస్తోంది. కలిసి ఉందామనుకున్నా కుదిరే పరిస్థితి ఉండటం లేదు. అయితే ఉమ్మడి కుటుంబాలే మంచివనో విడివిడిగా ఉండటమే మంచిదనో కచ్చితంగా చెప్పలేం. పరిస్థితులూ మనస్తత్వాలనుబట్టి మనకేది సౌకర్యంగా ఉంటుందో ఆలోచించుకుని మనమే నిర్ణయించుకోగలగాలి, అవునా? చిన్నచిన్న సమస్యలేవో వస్తూనే ఉంటాయి. సర్దుబాటు మనస్తత్వమే ముఖ్యం. అప్పుడే కుటుంబాలు సామరస్యంగా ఉంటాయి.’’

‘‘అవునుగానీ...’’ అంటూ ఆయన ఇంకా ఏదో చెప్పబోతోంటే, ‘‘తర్వాత తీరిగ్గా అన్నీ మాట్లాడుకుందాం నాన్నా. ఊళ్ళో కొంచెం పనుంది. ఓ ఫ్రెండ్‌ని కలవాలి’’ అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు. జానకిరామయ్య మొహం చిన్నబోయింది. అక్కడే ఉన్న భార్యతో మొన్నీమధ్య ఫోనులో అందరం కలిసి తిరగటానికి వీలుగా ఉంటుందని కొత్త మోడల్‌ కారు కూడా బుక్‌ చేశానని చెప్పాడు. ఆ సిటీలో ఎంత పెద్ద కారులో తిరిగినా నాకేమీ ఆనందంగా ఉండదని వాడికి చెప్పు’’ అన్నాడు.
‘‘అదేం, నేను చెప్పటమేమిటీ... మీరే చెప్పొచ్చుగా’’ కొంచెం చిరాగ్గానే అడిగింది.
‘‘వాడేదైనా మాట ఒకటికి రెండుసార్లు చెబితే నేను కాదనలేను. అందరం కలిసి
ఉండే అవకాశం వచ్చిందని అబ్బాయి ఆనందంగా చెబుతోంటే... నేను ఈ ఊరు విడిచి రాలేనని చెప్పాలంటే కష్టంగా ఉంది’’ నిట్టూరుస్తూ అన్నాడాయన.
‘‘నేనూ అంతే. మీ మనసులోని మాటను మీరే నొచ్చుకునేట్లుగా కాకుండా వాడికి మెల్లగానే నచ్చచెప్పండి. నాకైతే మనవలతో కలిసి ఉండటమే ముఖ్యంగానీ, ఎక్కడైనా ఒకటే’’ అంటూ ఆమె లోపలికి వెళ్ళిపోయింది.

* * * * *

ఆ మరునాడు కొడుకుతో తీరిగ్గా మాట్లాడదామని జానకిరామయ్య అనుకుంటే, అందుకు అవకాశం లేకుండా సారథి ఆ రోజంతా బయటే తిరుగుతున్నాడు.
ఆ సాయంకాలం భార్యాభర్తలిద్దరూ దూరంగా ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ ఇంటి ముందున్న గేటు దగ్గర నిలబడ్డారు.
ఆ దారినే వెళ్తున్న వాళ్ళ దూరపు బంధువు శ్రీపతి ‘‘ఏం రామయ్య బావా, ఇప్పుడు కులాసాయేనా..? నీకు ఒంట్లో కొంచెం నలతగా ఉందని మొన్న సారథి చెప్పాడు’’ అంటూ పలుకరించాడు. బాగానే ఉన్నానని చెప్పగానే ‘‘మీవాడు పట్నంలో ఉంటున్నాడని ఏమో అనుకున్నాగానీ... అబ్బో... బేరసారాల్లో బాగానే దిట్టనిపించుకున్నాడు’’ అంటూ నవ్వి పనిమీద హడావిడిగా వెళ్తున్నా కాబట్టి మరోసారి తీరిగ్గా కలుస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.
భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యంగా మొహమొహాలు చూసుకున్నారు.
‘‘అయితే నా ఆలోచన నిజమేనన్నమాట. ఈ ఊళ్ళో మనం అమ్మటానికి ఈ ఇల్లు తప్ప ఇంకేం మిగిలిందీ. మొన్న... తను అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా పూర్తయ్యాక ఆ వివరాలు చెబుతానని అన్నాడుగా... అంటే... ఇంటి గురించేనా? మంచి ధర వచ్చిందని ఆఖరున చెబుదామనుకుంటున్నాడంటావా..?’’ జానకీరామయ్య గొంతు గద్గదమైంది.
‘‘మీరన్నట్లుగా ఇక్కడెవరూ ఉండనప్పుడు ఇల్లు పాడుబడినట్లవుతుందని అమ్మకం పెట్టాడేమో! వాడూ పెద్దాడయ్యాడుగా... ఇలాంటి వ్యవహారాలన్నీ తనే చూసుకోవాలి కదాని ఆఖరున చెప్పొచ్చనుకున్నాడు కాబోలు’’ శకుంతలమ్మ మాటల్లోనూ దిగులు కనిపించింది.
‘‘సరేలే, వాడు వచ్చాక నేనే అడుగుతాను’’ మనసులోనే ఒక నిర్ణయానికి వచ్చిన జానకిరామయ్య స్థిరంగా అన్నాడు.
సారథి ఇంటికి వచ్చాక భోజనాలవీ పూర్తయ్యేవరకూ ఆగి, తీరుబడిగా కూర్చున్నప్పుడు తను చెప్పదలుచుకున్న విషయానికి నాందీ ప్రస్తావనగా ఆయన మొదలుపెట్టాడు.
‘‘నా మాటలు చాదస్తంగా అనిపించినాగానీ... నీకు చెప్పాలనిపిస్తోందిరా! బాల్యస్మతులతో ముడిపడిన ఊరంటే ఎవరికైనా ఇష్టమే, నాకూ అంతే. చాలాకాలంగా అలవాటుపడటం వల్లనో సొంతమనే మమకారంతోనో ఏమోగానీ... ఈ ఇల్లూ ఈ ఊరూ అంటే నాకు ప్రాణమే. వినటానికి విచిత్రంగా ఉండొచ్చుగానీ... నాకు మాత్రం ఈ ఊళ్ళోని రోజువారీ దృశ్యాలు కూడా అందంగా అపురూపంగా అనిపిస్తుంటాయి. నిజం...రా! ప్రొద్దున్నే లేచి బయటకు వస్తానా... అటు పక్కనున్న వేప చెట్టుమీద పక్షులన్నీ గోలగోలగా అరుస్తుంటే, నాకేం చిరాగ్గా ఉండదు. పైగా అవన్నీ అలా కబుర్లు చెప్పుకుంటున్నాయా... లేక నన్ను పలకరిస్తున్నాయా అనే ఆలోచనలు వచ్చి సరదాగా నవ్వుకుంటాను. ఇక ఇటువైపు చూస్తే... చెరువు గట్టుమీద... అరటిగెలలూ పాలబిందెలూ కూరగాయల బుట్టలతో సందడి సందడిగా కుర్రాళ్ళు తొక్కే సైకిళ్ళబారు కనిపిస్తుందా... అదేదో అందమైన దృశ్యంలాగే అనిపించి కాసేపు అలాగే కులాసాగా చూస్తుండిపోతాను. మన ఇంటిముందు దారి మీదుగా వచ్చేపోయే వారెవరైనా ‘బావా, మామా’ అంటూ కుశలమడిగితే చాలు, అందరూ నా ఆత్మీయులే అన్నట్లుగా- ఆ పలకరింపులకే పులకించిపోతూంటాను.’’
ఆయన మాటలకు సారథి మధ్యలో అడ్డం వచ్చాడు.
‘‘నువ్విలా చెబుతూంటే నాకేం విచిత్రంగా లేదు నాన్నా. నా మనసులోని మాటల్నే నీ ద్వారా వింటున్నట్లుగా ఉంది... అంతే! మీరైతే ఈ ఊళ్ళో ఎప్పటినుండో ఉంటున్నారు. నేనైతే ఇక్కడ ఉన్నది కొన్ని సంవత్సరాలే.
పై చదువులూ ఉద్యోగమూ అంటూ బయటకు వెళ్ళిపోయానా... అయినా ఇక్కడ గడిపిన రోజుల్ని తలుచుకుంటే... మనసుకెంత ఆనందంగా ఉంటుందో! చెక్క ఉయ్యాలబల్ల మీద తాతయ్య పక్కనే కూర్చుని ఊగుతూ కంఠస్థం చేసిన పద్యాలూ... రాత్రిపూట అన్నాలు తిన్నాక ఆరుబయట నాన్నమ్మతో కూర్చుని విన్న పేదరాశి పెద్దమ్మ కథలూ... ఇప్పటికీ నాకు గుర్తొస్తాయి. స్నేహితులతో పొలంగట్ల మీద పోటీలుపడి పరుగుపెట్టడం, తోటల్లో చెట్లెక్కి దూకడం, ఆడిన ఆటలూ... ఇలా ఎన్నో జ్ఞాపకాలున్నాయి. మన ఇల్లూ మన ఊరూ అంత అందమైనది నాకెక్కడా కనిపించలేదు. మీకు ఈ చుట్టుపక్కలకే ట్రాన్స్‌ఫర్‌ వచ్చినప్పుడు, అందరం ఉండటానికి వీలుగా కొన్ని మార్పులు చేయించినప్పుడు తాతయ్య ఎంత సంతోషించారో నాకు తెలుసు. ఇప్పుడు నేనూ మనింటికి కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాను’’ ఆనందంగా అన్నాడు.
జానకిరామయ్య అతనివైపు ఒక క్షణం ఆశ్చర్యంగా చూసి ‘‘అమ్మేస్తున్న ఇంటికి ముస్తాబులు కూడా ఎందుకురా’’ గొణిగినట్లుగా మెల్లగా అన్నాడు.
శకుంతలమ్మ వెంటనే మాటమాత్రమైనా చెప్పలేదేమిటంటూ అందుకుని శ్రీపతి చెప్పిన విషయాన్ని బయటపెట్టింది.
‘‘బేరసారాలంటే అమ్మటానికనే ఎందుకనుకున్నారూ... కొనటానికీ ఉంటాయి కదా’’ నవ్వుతూ అడిగాడు.
వాళ్ళ చూపుల్లోని ప్రశ్నల్ని గమనించిన సారథి వివరంగా చెప్పాడు...
‘‘అన్నీ సెటిలయ్యాక సర్‌ప్రైజ్‌ చేస్తూ చెప్పాలనుకున్నాను. నాన్నా, నాకు నచ్చిన కోర్సును ఎక్కడ చదువుతానని అన్నా అభ్యంతరం చెప్పకుండా సరేనన్నారు.
నా చదువుకోసమే మన మూడెకరాల పొలమూ అమ్మేశారని నాకూ తెలుసుగా. అప్పుడే నేను మనసులో... ఎప్పటికయినా మన ఊరులోనే కొంతైనా పొలం కొనగలగాలని గట్టిగా అనుకున్నా. ఇప్పటికి కుదిరింది. ఫారిన్‌లో ఉన్న శ్రీపతి బాబాయ్‌ చిన్నకొడుకు తన వాటాగా వచ్చిన నాలుగెకరాల్నీ అమ్మాలనుకుంటున్న విషయం నా ఫ్రెండు ద్వారా తెలిసింది. ఎలాగూ మీకిష్టమైన విషయమే కదాని మీతో సంప్రదించకుండానే నేనే సొంతంగా బేరం చేశాను.’’

‘‘నిజమా... నాలుగెకరాలు కొంటున్నావా?’’ ఆనందంగా అడిగిన జానకిరామయ్యకు మళ్ళీ ఒక సందేహం వచ్చింది. ‘‘మరి, నా రిటైర్మెంట్‌తో వచ్చిన డబ్బు సరిపోతుందా? నువ్వు ఫోనులో ఆ వివరాలడిగినపుడు
ఈ విషయం చెప్పకపోతే... నేను ఇంకోలా అనుకున్నాను.’’
‘‘మీ రిటైర్మెంట్‌తో వచ్చిన డబ్బుని మీ పేరనే బ్యాంకులో ఉంచుకుని మీకిష్టమైన విధంగా మీరు ఆలోచించుకుని ఖర్చు చేసుకోండి. నేను ఉద్యోగంలో చేరినప్పటినుండీ ఈ కోరిక కోసమే కొంత మొత్తాన్ని వెనకేస్తూ వచ్చాను. ఎంత అవసరం వచ్చినా దాన్ని మాత్రం కదపలేదు. అది పొలం కొనటానికి సరిపోతుంది. మీకు ఇప్పటివరకూ చెప్పని విషయం ఇంకొకటుంది...’’ అంటూ ఒక్క క్షణం ఆగి వాళ్ళు ఆత్రుతగా చూస్తుంటే మళ్ళీ చెప్పాడు.
‘‘మా కంపెనీవాళ్ళే కొన్ని కొత్త బ్రాంచ్‌లు ప్రారంభిస్తున్నారు. నేను ప్రయత్నం చేసి ఈ పక్క ఊళ్ళోని బ్రాంచికి వేయించుకున్నాను... మీలాగే అన్నమాట. అందుకే అందరం కలిసి ఉండే అవకాశం దొరికిందన్నాను. మీ కోడలు కూడా తన టీచరు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తోంది. ఈ ఊళ్ళోని స్కూల్లో ప్రయత్నించటమో లేక సొంతంగా ఏదైనా చేయటమో తర్వాత ఆలోచిస్తుంది. మీకు రిటైర్మెంటుతో రావాల్సిన డబ్బు విషయంగా ఏమైనా సమస్యలొస్తే, ఆ డిపార్ట్‌మెంటులో ఉన్న నా ఫ్రెండ్‌ సాయం అడగొచ్చని... మిమ్మల్ని ఆ విషయం అడిగానంతే!’’ అంటూ తండ్రి వైపు చూశాడు.
‘‘మీరు... మన ఊళ్ళోనే... మాతో కలిసి ఉంటారా..?’’ ఆనందంతో తబ్బిబ్బు అయిపోతూ, ‘‘మరి పిల్లలూ... వాళ్ళ చదువులూ...’’ అంటూ ఆగిపోయాడు.
‘‘ఇక్కడే కొన్నేళ్ళు చక్కగా చదువుకుంటారు. సొంత ఊళ్ళో ఉమ్మడి కుటుంబంలో ఆనందంగా గడిపిన రోజుల జ్ఞాపకాలు వీళ్ళకీ కావాలిగా! అవకాశం లేనప్పుడు ఎలాగూ తప్పదుగానీ, వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలిగా’’ అని, ‘‘నేను రోజూ ఆఫీసుకు వెళ్ళిరావటానికీ అందరం కలిసి ఎక్కడికైనా వెళ్ళటానికీ బావుంటుందనే కారు బుక్‌ చేశాను’’ అంటూ అన్ని సందేహాల్నీ నివృత్తి చేశానా అన్నట్లుగా నవ్వాడు.
శకుంతలమ్మ మొహం విప్పారింది. భర్త వైపు ‘విన్నారుగా’ అన్నట్లు నిష్ఠూరంగా చూసింది. ఆశ్చర్యంగా, ఆనందంగా కొడుకు మాటలు వింటున్న జానకిరామయ్య పక్కనే ఉన్న భార్యతో- ‘‘నిజమే... నాకు తొందరపాటు కొంచెం ఎక్కువేనని మరోసారి రుజువైంది’’ చాలా మెల్లగా అన్నాడు.
సారథి తల్లిదండ్రులిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థంకాక ‘‘నాన్నా, ఏమంటున్నారు... ఏదైనా సమస్యా?’’ అనడిగాడు.
ఏం లేదన్నట్లుగా తలూపుతూ ఆయన ఆనందంగా నవ్వాడు.
నీలాంటి కొడుకు ఆసరాగా పక్కన నిలబడితే... సమస్యల చీకటి అంటూ
ఏం ఉండదురా. నిత్యమూ పున్నమి వెలుగే! నువ్వు మాకోసం... ఇంత గొప్పగా... ఆయన కంఠం పూడుకుపోయింది.
‘‘నేను గొప్పగా చేసింది ఏం ఉంది నాన్నా! అడుగుజాడ మీదేగా, అనుసరించటమే నేను చేసింది’’ అన్నాడు చిరునవ్వుతో.
గుండెల నిండుగా పుత్ర వాత్సల్యం పొంగిరాగా తల్లిదండ్రులిద్దరూ కొడుకుని చూపులతోనే ఆశీర్వదించారు.

15 సెప్టెంబరు 2019

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.