logo

మచ్చలేని నేత.. మన ‘నర్రా’

నకిరేకల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించిన మార్క్సిస్టు యోధుడు నర్రా రాఘవరెడ్డి అవినీతి మచ్చలేని నేతగా ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపు పొందారు.

Published : 23 Oct 2023 04:06 IST

నకిరేకల్‌, న్యూస్‌టుడే: నకిరేకల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించిన మార్క్సిస్టు యోధుడు నర్రా రాఘవరెడ్డి అవినీతి మచ్చలేని నేతగా ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపు పొందారు. వరుస విజయాల ఎర్రకోటగా.. ఏపీ బెంగాల్‌గా నకిరేకల్‌కు నర్రా అరుదైన గుర్తింపు సొంతం చేశారు. ఈ సెగ్మెంట్‌ ఆవిర్భవించి ఆరున్నర దశాబ్దాలు దాటింది. ఇప్పటి వరకు 14 దఫాలుగా జరిగిన ఎన్నికల్లో 10 పర్యాయాలు కమ్యూనిస్టులే విజయం సాధించారు. ఇక్కడ 47 ఏళ్ల పాటు ఎర్రజెండా పాలనే సాగింది.

ఇద్దరిలో ఒకరు

2007లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సత్తా సంస్థ మచ్చలేని నేతలను ఇద్దరిని మాత్రమే గుర్తించగా అందులో నర్రా ఒకరు. ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నాడు ఆ సంస్థ ఆధ్వరంలో హైదరాబాద్‌లో రాఘవరెడ్డిని ఘనంగా సన్మానించారు.  

ఇదీ.. ప్రస్థానం

నియోజకవర్గంలోని చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన రాఘవరెడ్డి బడికి వెళ్లాల్సిన 16 ఏళ్ల వయసులో ముల్లు కర్ర పట్టి పశువులు మేపేందుకు వెళ్లారు. ముంబాయి జిన్నింగ్‌ మిల్లుల్లో కార్మికుడిగా జీవితం ప్రారంభించి.. రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు. అవినీతి అక్రమాలు, బంధుప్రీతికి దూరంగా ఉంటు తన ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చలేని నేతగా, ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు.

  • నాడు రైతుల భాగస్వామ్యంతో నియోజకవర్గంలో ఒకే సారి 50 గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించారు.
  • ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌లో ప్రభుత్వం ఇంటిస్థలం ఇచ్చినా తీసుకోకుండా ఆదర్శంగా నిలిచారు.
  • ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి తనకు వచ్చే వేతనంలో కొంత భాగాన్ని పార్టీకి ఇచ్చేవారు.

వరుస విజయాలు

1967లో సీపీఎం నుంచి రాఘవరెడ్డి తొలిసారి విజయం సాధించారు. 1972లో పరాజయం పాలయ్యారు. 1978, 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో వెనుతిరిగి చూడకుండా వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. 1999 వరకు ఎమ్మెల్యేగా సేవలందించారు. వయో భారంతో 2015 ఏప్రిల్‌ 9న తన 91వ ఏటా మరణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని