logo

రెండో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జయకేతనం

రెండో లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌ విజయం సాధించింది. వరంగల్‌ స్థానం నుంచి సాదత్‌ అలీఖాన్‌, మహబూబాబాద్‌ నుంచి ఇటికాల మధుసూదనరావు ఎన్నికయ్యారు.

Published : 16 Apr 2024 04:58 IST

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి : రెండో లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌ విజయం సాధించింది. వరంగల్‌ స్థానం నుంచి సాదత్‌ అలీఖాన్‌, మహబూబాబాద్‌ నుంచి ఇటికాల మధుసూదనరావు ఎన్నికయ్యారు. 1957లో జరిగిన ఎన్నికల్లో వరంగల్‌ నుంచి ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(ఐఎన్‌సీ) అభ్యర్థి సాదత్‌ అలీఖాన్‌, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(పీడీఎఫ్‌) పార్టీ అభ్యర్థి పెండ్యాల రాఘవరావుల మధ్య ముఖాముఖి పోటీ ఎదురైంది. కాంగ్రెస్‌ అభ్యర్థి సాదత్‌ అలీఖాన్‌నే విజయం వరించింది. ఆయన 14,955 ఓట్ల మెజార్టీ సాధించారు. మొత్తం 3,43,246 ఓట్లకు 1,99,543 ఓట్లు పోలయ్యాయి. 58.13 శాతం పోలింగ్‌ నమోదైంది. మొదటి ఎన్నికల కంటే పోలింగ్‌ 7.1 శాతం పెరిగింది. వరంగల్‌ జనరల్‌ స్థానం నుంచి మొదటి ఎన్నికల్లో గెలుపొందిన రాఘవరావు రెండోసారి పోటీచేసి ఓడిపోయారు. కాంగ్రెస్‌ పార్టీ మొదటి ఎన్నికల్లో ఓటమి చెందిన కాళోజీ నారాయణరావుకు బదులు హైదరాబాద్‌కు చెందిన సాదత్‌ అలీఖాన్‌ను బరిలో దించింది.

1957లో రెండో లోక్‌సభ ఎన్నికల సమయంలో మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం ఆవిర్భవించింది. ఈ స్థానానికి మొదటి ఎన్నికలు 1957లో జరిగాయి. మొదటి ఎంపీగా ఇటికాల మధుసూదనరావు ఎన్నికయ్యారు. తన సమీప పీడీఎఫ్‌ అభ్యర్థి సర్వదేవభట్ల రామనాథంపై 7,256 ఓట్ల ఆధిక్యం సాధించారు. మహబూబాబాద్‌ నియోజకవర్గంలో 3,72,879 ఓట్లకు గాను 2,00,672 ఓట్లు పోలయ్యాయి. 53.82 శాతం పోలింగ్‌ నమోదైంది. మధుసూదనరావు స్వగ్రామం హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం భీంపల్లి.. స్వాతంత్య్ర పోరాటంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని