Lokesh Kumar: జగన్‌ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్‌ఆర్‌ఐ వైద్యుడు లోకేశ్‌

జగన్‌ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్‌ చేసి దాడి చేశారని ఎన్‌ఆర్‌ఐ వైద్యుడు లోకేశ్‌ కుమార్‌ తెలిపారు.

Updated : 18 May 2024 18:57 IST

విజయవాడ: జగన్‌ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్‌ చేసి దాడి చేశారని ఎన్‌ఆర్‌ఐ వైద్యుడు లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉన్న తనను సీఎం భద్రతా సిబ్బంది గుర్తుపట్టి అకారణంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛాతి నొప్పి వస్తోందని చెప్పినా పట్టించుకోకుండా హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికన్‌ పౌరుడైన తనపై పోలీసులు, అధికారులు దౌర్జన్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించి, అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై ప్రైవేటు కేసులు పెట్టి.. వారిపై చర్యలు తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తానని లోకేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. 

సీఎం జగన్‌ విదేశీ పర్యటనకు వెళ్తున్న సమయానికి కొన్ని గంటల ముందు గన్నవరం విమానాశ్రయం వద్ద డాక్టర్‌ లోకేశ్‌ కుమార్‌ను పోలీసులు గుర్తించి నిర్బంధించారు. వైకాపా పాలన, అవినీతి, అక్రమాలు, మనీలాండరింగ్‌ అంశాలను ప్రధానంగా ఉటంకిస్తూ డాక్టర్‌ లోకేశ్‌ పలు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇటీవల అమెరికా నుంచి రాష్ట్రానికి వచ్చిన ఆయన తిరిగి అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎయిర్‌ ఇండియా విమానంలో దిల్లీకి వెళ్లి.. అక్కడి నుంచి అమెరికా తిరుగు ప్రయాణం అయ్యేందుకు టికెట్‌ ప్రింటింగ్‌ కోసం గన్నవరం విమానాశ్రయానికి వెళ్లగా..పోలీసులు నిర్బంధించారని లోకేశ్‌ తెలిపారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాలు తిప్పారని, ఛాతీపై బలంగా కొట్టారని ఆరోపించారు. ఈ ఘటనపై అమెరికా ఎంబసీతో పాటు ప్రధాని కార్యాలయం, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌ తదితరులకు సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని