Balakrishna: చికిత్స కోసం తారకరత్నను బెంగళూరు తరలిస్తాం: బాలకృష్ణ

తారకరత్న ఆరోగ్య పరిస్థితి  నిలకడగానే ఉందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు.బెంగళూరు తీసుకెళ్తే బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారని వెల్లడించారు.

Updated : 27 Jan 2023 17:03 IST

కుప్పం: తారకరత్న ఆరోగ్య పరిస్థితి  నిలకడగానే ఉందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం తారకరత్న బీపీ 120/80 చూపిస్తుంది. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్‌ అయింది. ఇక్కడి వైద్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మిగతా పారామీటర్స్‌ అన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతం ప్రాథమిక చికిత్స అందించారు. తారకరత్న ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు చంద్రబాబు ఆరా తీస్తున్నారు. బెంగళూరు తీసుకెళ్తే బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఎయిర్‌ లిఫ్ట్‌ లేదా అంబులెన్సా అని ఆలోచిస్తున్నాం. బెంగళూరు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని బాలకృష్ణ వెల్లడించారు.

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే యువగళం సైనికులు, సెక్యూరిటీ సిబ్బంది తారకరత్నను కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని బాలకృష్ణ, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పర్యవేక్షిస్తున్నారు.అస్వస్థతకు గురైన నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తెదేపా అధినేత చంద్రబాబు ఆరా తీశారు. తారకరత్నకు చికిత్స అందిస్తోన్న కుప్పంలోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని