Pawan kalyan: గౌరవం తగ్గకుండా పొత్తు కుదిరితే ఓకే.. లేదంటే ఒంటరిగా: పవన్‌ కల్యాణ్‌

ఒంటరిగా ఉండి గెలిచే పరిస్థితి ఉంటే ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. కానీ, ఆ భరోసా జన సైనికులు ఇస్తారా? అని ప్రశ్నించారు. నియంతను కలిసి కట్టుగా ఎదుర్కోవాలన్నారు.

Updated : 12 Jan 2023 22:57 IST

రణస్థలం: పొత్తులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ క్లారిటీ ఇచ్చారు. తెదేపాతో జనసేన పొత్తు పెట్టుకుంటుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబుతో సమావేశమైనప్పుడు పొత్తులు, సీట్ల సర్దుబాటు గురించి చర్చించలేదని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యువశక్తి’ సభలో పవన్‌ మాట్లాడుతూ.. జనసేన వ్యూహంపై పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చారు.

‘‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఎందుకు అన్నానంటే... 53 నియోజకవర్గాల్లో వైకాపా సాంకేతికంగానే గెలిచింది. ఇటీవల చంద్రబాబుతో సమావేశమైతే కొందరు పిచ్చికూతలు కూస్తున్నారు. బేరాలు కుదిరాయని పిచ్చి వాగుడు వాగుతున్నారు. నేను అలాంటిని వ్యక్తిని కాదు. రూ.25కోట్లు ట్యాక్స్‌ కట్టే వ్యక్తిని. చంద్రబాబు, పవన్‌ రెండున్నర గంటలు ఏం మాట్లాడారని గొంతు చించుకుంటున్నారు. సంబరాల రాంబాబు గురించి 22 నిమిషాలు, పనికిమాలిన ఐటీ మంత్రి రాష్ట్రాన్ని 15వ స్థానంలోకి నెట్టేశాడేంటని 18 నిమిషాలు. లా అండ్‌ ఆర్డర్‌ ఎందుకు చితికిపోయింది, ఏం చేయాలి అని 38 నిమిషాలు మాట్లాడుకున్నాం. మాట్లాడే కొద్దీ కేసులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు ఎలా ఉండాలి అని గంటన్నర సేపు మాట్లాడుకున్నాం. వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పా. కానీ, దాని వెనుక నేను కోరుకుంటున్నది స్టెబిలిటీ ఆఫ్‌ స్టేట్‌. వైకాపా అద్భుతమైన పాలన అందించి ఉంటే నేను గొంతెత్తే వాడిని కాదు. కానీ బాధిస్తా ఉంటే ఎదురు తిరుగుతాం. గతంలో తెదేపాను తిట్టానంటున్నారు.. కానీ, కొన్ని సార్లు సర్దుకు పోవాలి తప్పదు. వచ్చే ఎన్నికల్లో ఓటు చీలకూడదు. సీట్ల గురించి చంద్రబాబుతో నేను మాట్లాడలేదు. రాజకీయాల్లో వ్యూహం ఉండాలి. ఒంటరిగా వెళ్లి వీర మరణం పొందడం అవసరం లేదు. ఒంటరిగా ఉండి గెలిచే పరిస్థితి ఉంటే ఎవరితోనూ పొత్తు పెట్టుకోం. ఆ భరోసా జన సైనికులు ఇస్తారా? నియంతను కలిసి కట్టుగా ఎదుర్కోవాలి. గౌరవం తగ్గకుండా పొత్తు కుదిరితే వెళ్తాం... లేదంటే ఒంటరిగానే పోటీ చేస్తాం. రాజకీయాల్లో దశాబ్దం పాటు ఒంటరిగానే పోరాడా. వస్తే జనసేన ప్రభుత్వం.. లేదంటే మిశ్రమ ప్రభుత్వం. రాజకీయం అంతా 3 కులాల చుట్టే ఎందుకు తిరుగుతోంది. రాష్ట్రంలో ఇంకా అనేక కులాలు ఉన్నాయి.. అందరూ సమానమే. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. మీకోసం రోడ్ల మీదకు వస్తా. ఏడాదికి రూ.250 కోట్లు సంపాదించగలను. నా రోజు సంపాదన కోటి రూపాయలు. కోటి మంది ప్రజలకోసం కోట్లు వదులుకోవడానికి సిద్ధం’’ అని పవన్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని