eWebinar: ఆచరణ మీదైతే.. కోరిన కొలువు!

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 01 Dec 2025 06:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

సరైన ప్రణాళికతోనే విజయం
ఈనాడు - ఈప్రతిభ వెబినార్‌లో నిపుణుల సూచనలు

ఈనాడు ఈప్రతిభ వెబినార్‌లో మాట్లాడుతున్న నిపుణులు బి.నరేశ్, తాటికొండ ప్రతిజ్ఞ, రేమల్లి సౌజన్య 

2026లో ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా శ్రమిస్తున్న ఆశావహుల కోసం ఈనాడు ఈప్రతిభ  ఆదివారం నాడు ఉచిత వెబినార్‌ నిర్వహించింది. సరైన దిశలో నిరంతర అభ్యాసంతో కోరుకున్న కొలువు దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదని  నిపుణులు పేర్కొన్నారు. పోటీపరీక్షల నిపుణులు రేమల్లి సౌజన్య, డాక్టర్‌ తాటికొండ ప్రతిజ్ఞ అభ్యర్థులకు విలువైన సూచనలు, సలహాలు అందించారు. కెరీర్‌ కౌన్సిలింగ్‌ నిపుణులు డాక్టర్‌ బి.నరేశ్‌కుమార్‌ మోడరేటర్‌గా వ్యవహరించారు.


నిన్నటి కల.. రేపటి లక్ష్యం

ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. సమయపాలన, అనుసరించాల్సిన వ్యూహం, మైండ్‌సెట్‌... ఉద్యోగ సాధనలో కీలకపాత్ర పోషిస్తాయి. ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీపరీక్షల్లో పాల్గొనే లక్షలాదిమందిలో కొందరినే విజయం వరిస్తుంది. వారు అనుసరించే టైం మేనేజ్‌మెంట్, ఆచరణాత్మక ప్రణాళిక, నిరంతర అభ్యాసమే దీనికి కారణం.

అభ్యసనం ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. పోటీ పరీక్షల్లో అకడమిక్‌ పరీక్షల మాదిరిగా తక్కువ సమయంలో చదివి రాయడం కుదరదు. ముఖ్యంగా రీజనింగ్, అరిథ్‌మెటిక్‌ లాంటి సెక్షన్లలో సమయాభావం ప్రధాన సవాలుగా నిలుస్తోంది. అందుకే మొదట సులభమైన ప్రశ్నలను ఆన్సర్‌ చేయడం ఉత్తమం. కఠినమైన ప్రశ్నలతో ప్రారంభిస్తే సమయం వృథా. అభ్యర్థులు తమకు ఏ సబ్జెక్ట్‌లో ఎక్కువ పట్టు, ఆసక్తి ఉన్నాయో చూసుకుని దానికి అనుకూలంగా ఉండే పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అయితే లక్ష్యం చేరుకోగలరు.

డాక్టర్‌ బి.నరేశ్‌ కుమార్‌


సక్సెస్‌ కోసం R -T - E స్ట్రాటజీ

చాలా మంది పరీక్షార్థులు సామర్థ్యం ఉన్నా.. నిర్వహణ లోపం, సరైన వ్యూహాలు అనుసరించకపోవడం వల్ల ఉద్యోగ సాధనలో విఫలమవుతున్నారు. R - T - E స్ట్రాటజీ ద్వారా ఉద్యోగ పోటీలో ముందుండొచ్చు. 

R - రివిజన్‌ సైకిల్‌ స్ట్రాటజీ: ఏదైనా టాపిక్‌ చదివేటప్పుడు ముఖ్యమైన అంశాలను షార్ట్‌ నోట్స్‌ రూపంలో ప్రిపేర్‌ చేసుకోవాలి. అప్పుడు తేలిగ్గా పునశ్చరణ చేసుకోవడానికి వీలుంటుంది. ఉదాహరణకు ఒక వారంలో చదివింది రెండు గంటల్లో రివిజన్‌ చేసేలా ఉండాలి.  

T - టెస్ట్‌ బేస్డ్‌ లెర్నింగ్‌ స్ట్రాటజీ: చదివింది ఎంత వరకు గుర్తుంటుందో తెలుసుకోవడానికి ఇది తోడ్పడుతుంది.  చదవడం ద్వారా టాపిక్‌పై అవగాహన వస్తుంది. సరిగ్గా నేర్చుకున్నామా.. లేదా అన్నది ప్రాక్టీస్‌ టెస్ట్స్‌ రాయడంతో తేలిపోతుంది. 

E - ఎర్రర్‌ ఎలిమినేషన్‌ మెథడ్‌ స్ట్రాటజీ: దాదాపు ప్రతి పోటీపరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. అందుకే కచ్చితంగా జవాబు తెలిసిన ప్రశ్నలను అటెంప్ట్‌ చేయడం ముఖ్యం. అంతగా తెలియని వాటి జోలికి వెళ్లకపోవడమే మంచింది. 

ఈ మూడు స్ట్రాటజీలు అనుసరించడం ద్వారా కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌లో విజయం సాధించవచ్చు.

డాక్టర్‌ తాటికొండ ప్రతిజ్ఞ


ఒకటే పుస్తకం పది సార్లు..

ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర స్థాయి నియామక పరీక్షల్లో ప్రశ్నా సరళిలో మాత్రమే మార్పు తప్ప అన్నింటి సిలబస్‌ దాదాపు ఒకేలా ఉంటుంది. జనరల్‌ స్డడీస్‌ సబ్జెక్ట్స్‌పై పట్టు సాధిస్తే ఉద్యోగ సాధన సులభతరం అవుతుంది. ఇందుకోసం దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం.

తెలుగు రాష్ట్రాల నుంచి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ)కి పోటీ పడేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. అన్ని స్థాయుల్లో కలిపి ఏటా సుమారు 20 నుంచి 25వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు విడుదల అవుతున్నాయి. బ్యాంక్‌ మాదిరే ఎస్‌ఎస్‌సీ నియామక ప్రక్రియ కూడా ఏడాదిలోపే పూర్తవుతుంది. సిలబస్‌ పరంగా బ్యాంక్, ఎస్‌ఎస్‌సీ ఒకేలా ఉంటాయి.గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఎస్‌ఎస్‌సీలో ఉద్యోగం సాధిస్తే కెరీర్‌ బాగుంటుంది.  రాష్ట్రస్థాయిలో పోలిస్తే ఏటా ఉద్యోగ ప్రకటనలు ఇచ్చే కేంద్ర ఏజెన్సీలు/ బోర్డు పరీక్షలకు ప్రిపేర్‌ అయితే మంచి ఫలితం ఉంటుంది.

రేమల్లి సౌజన్య


మల్టిపుల్‌ రివిజన్స్‌ తప్పనిసరి..

ఏదైనా విషయాన్ని మనం నేర్చుకునేటప్పుడు ముఖ్యంగా కోర్‌ కాన్సెప్ట్‌పై దృష్టి సారించాలి. ఒక పుస్తకాన్ని పది సార్లు చదవాలి తప్ప పది పుస్తకాలను ఒక సారి చదిదవం కరెక్ట్‌ కాదు. మల్టిపుల్‌ రివిజన్స్‌తో ఆ టాపిక్‌ను పూర్తిగా నేర్చుకోవచ్చు. ఈ వ్యూహాన్ని అనుసరించడం ద్వారా తేలిగ్గా ఉద్యోగాన్ని సాధించగలం.


Tags :
Published : 01 Dec 2025 04:30 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని