Sun, February 07, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'

చేనేత జీవితాలు
చేనేత కళ...ఒకప్పుడు రాచవైభోగాన్ని అనుభవించింది. గండపెండేరాలూ ఘనసన్మానాలూ అందుకున్న నేతన్నలు ఎంతోమంది. ఆ ఘనతంతా గతమే. చేనేత పరిశ్రమ సంక్షోభంలో పడిపోయింది. నేతకారుల జీవితాలు సమస్యల్లో చిక్కుకున్నాయి. నిస్పృహలో ఉన్న చేనేత కార్మికుల జీవితాల్లో కొత్త ఆశను నింపే రచన ‘అగ్గిపెట్టెలో ఆరుగజాలు’. నేతకారుల జీవితాలకు సంబంధించి పౌరాణిక ప్రస్తావనతో మొదలయ్యే నవల ... అనేకమైన మలుపులు తిరిగి చక్కని ముక్తాయింపుతో, గొప్ప ఆశావాద సంకేతంతో ముగుస్తుంది. లక్ష్మి, దేవ్‌, మీనా లాంటి పాత్రలు యువతలో ఆశావాదానికి ప్రతీకలు. తెలుగు గడ్డ మీదున్న పోచంపల్లి, మంగళగిరి మొదలు ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బెనారస్‌, తమిళనాడులోని కోయంబత్తూర్‌ ... ఇలా దేశంలోని చేనేత కార్మికులంతా ఓ సంఘంగా ఏర్పడి ‘ఆల్‌ ఇండియా మాస్టర్‌ వీవర్స్‌ అసోసియేషన్‌’ ఏర్పాటు చేసుకుంటే...చాలా సమస్యలు పరిష్కారం అవుతాయన్న సందేశంతో నవలను ముగించారు రచయిత్రి.

అగ్గిపెట్టెలో ఆరుగజాలు
రచన: మంథా భానుమతి
పేజీలు: 200: వెల: రూ.150/-
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.
- వెంకట్‌


బాల్య జ్ఞాపకాలు
బాల్యమంటేనే కమ్మని జ్ఞాపకాల ఖజానా. వెనక్కి తిరిగి చూసుకోడానికైనా, నెమరేసుకుని మురిసిపోడానికైనా ఆ మణిమాణిక్యాల భోషాణాన్ని బయటికి తీయాల్సిందే. మన్నెం శారద రచన ‘చిగురాకు రెపరెపలు’ అచ్చంగా అలాంటి అనుభూతుల మూటే. ఈ జ్ఞాపకాల కథలనిండా చిన్నారి శారద చేసిన అంతులేని అల్లరే కనిపిస్తుంది. కాస్త కారం తీసుకురమ్మంటూ పురమాయించిన చుట్టాలావిడకు ... కారంలో ఇసుక కలిపి ఇవ్వడం, సంగీతం మాస్టారు పిలకని కిటికీకి ముడివేయడం, చిన్నిచిన్న దోశలేసి పోలీసు స్టేషన్‌లోని ఖైదీలకు పంచడం, పోలీసు మావయ్య రివాల్వర్‌తో ఆడుకునే ప్రయత్నంలో చెడామడా తిట్లు తినేయడం ... ఇలా రకరకాల అనుభవాలు. పుస్తకాన్ని చదువుతూ...అప్రయత్నంగానే మనమూ బాల్యంలోకి వెళ్లొస్తాం.

చిగురాకు రెపరెపలు
రచన: మన్నెం శారద
పేజీలు: 112; వెల: రూ.100/-
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.
- ప్రసాద్‌


అభ్యుదయ కథాంశాలు
చుట్టూవున్న సమాజంలోని వివిధ అపసవ్యాలను ఇతివృత్తాలుగా గ్రహించిన కథలూ, ఆలోచనాత్మకమైన వ్యాసాలూ కలిసిన సంపుటమిది. పారేసుకున్న రూపాయి కోసం 60 ఏళ్ళుగా వెతుకుతున్నానని చెప్పిన వృద్ధుడు... నిజానికి దేనికోసం తపనపడుతున్నాడో ‘దొరకని నాణెం’ కథలో తెలుస్తుంది. ఇంటిచాకిరీలో నలిగిపోయిన గృహిణుల వ్యథలకు ‘మార్నింగ్‌ వాక్‌’, ‘చివరి ఉత్తరం’ అద్దం పడతాయి. ఓ కథ అద్దెగర్భం ఒప్పందాల్లోని ఆర్థిక, అమానవీయ కోణాలను ప్రతిభావంతంగా చిత్రిస్తే, మరో కథలో... ఏళ్ళతరబడి భర్త పీడనను భరించిన ఓ స్త్రీ, తమ పిల్లలు జరపాలనుకున్న షష్టిపూర్తిని వ్యతిరేకిస్తుంది. దీన్ని ఎలా ముగిస్తే బాగుంటుందో రచయిత్రి రంగనాయకమ్మ రాసిన అభిప్రాయాన్ని ఈ కథ చివర జోడించటం బాగుంది. అక్షరదోషాలు దొర్లకుండా శ్రద్ధ తీసుకునివుంటే బాగుండేది.

దొరకని నాణెం
రచన: వి. వెంకట్రావు
పేజీలు: 212; వెల: రూ.60/-
ప్రతులకు: ఎన్‌.కె.బాబు, 24-8-1
లింగదారిపేట, విజయనగరం.
- సీహెచ్‌.వేణుఅనగనగా ఓ మనిషి...
మనిషి ఎప్పుడు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, అతడి పరిణామక్రమం ఎలాంటిది, ఆ వికాస చరిత్ర ఎన్ని మలుపులు తీసుకుంది - ఆలోచించినకొద్దీ ప్రశ్నలే. ‘మానవుడి కథ’ ద్వారా ఎమ్‌.ఇల్యీన్‌, వై.సెగాల్‌ ఆ సందేహాలలో చాలావాటికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆవిర్భావం నుంచి అత్యంత శక్తిమంతుడిగా ఎదిగేదాకా... ఆ ఉత్కంఠభరితమైన కథను చదివి తీరాల్సిందే.

మానవుడి కథ
రచన: ఇల్యీన్‌, సెగాల్‌
అనువాదం: పి.రాజేశ్వరరావు
పేజీలు: 200; వెల: రూ.160/-
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.
- రాజేంద్ర

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

అనుక్షణం ఉత్కంఠగా... ‘క్షణం’

అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగే కథనంతో తెరకెక్కిన చిత్రం ‘క్షణం’. పీవీపీ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి రవికాంత్‌....

 
 
 
Top  |  previous page
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Digital Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net