ఆర్థిక ప్రణాళికతో భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుందాం!  - Importance-of-financial-palnning
close

Updated : 09/03/2021 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్థిక ప్రణాళికతో భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుందాం! 

జీవితంలో విజయాలు అమాంతంగా వచ్చి పడవు. సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలే విజయాలకు కారణమవుతాయి. సరైన ప్రణాళిక, విశ్లేషణ, ఆచరణ, సమీక్షలతో విజయానికి బాటలు వేసినవారమవుతాం. చాలా కొద్ది మంది మాత్రమే కలలపై దృష్టి సారించి వాటిని సాకారం చేసుకునేందుకు కృషిచేస్తారు. అవకాశాలనేవి చాలా తక్కువ, వాటిని అందిపుచ్చుకునేందుకు సరైన సమయంలో తెలివైన నిర్ణయాలు తీసుకోగలగాలి. తప్పుడు ఊహలు, వచ్చిన అవకాశాలను చేజార్చుకోవడం లాంటివి చేస్తే ఆర్థిక జీవితాన్ని మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుంది.

ఆర్ధిక ప్రణాళిక అంటే..
ఆర్థిక ప్రణాళిక, దాని ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మనలో చాలా మందికి ఆర్థిక ప్రణాళిక అంటే రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు అది కేవలం సంపన్నులకో లేదా వృద్ధులకో అనుకుంటారు. మరికొందరు ఇంటి కోసం నెలవారీ వేసుకొనే బడ్జెట్‌ అనుకుంటారు. మరికొందరు బీమా తీసుకోవడం, పన్ను ప్రణాళిక వేసుకోవడం అనుకుంటారు. విచిత్రంగా మరికొందరు బీమా లేదా పెట్టుబడి సలహాదారు లేదా ఆడిటర్‌లు మాత్రమే ఆర్థిక ప్రణాళికలు తయారుచేస్తారు అనే భావనలో ఉంటారు. వాస్తవానికి ఆర్థిక ప్రణాళిక అంటే ఇంటి బడ్జెట్‌, రుణాలు, పొదుపు−మదుపు, పెట్టుబడులు, బీమా, పన్నులు… ఇలా అన్నీ కలగలిసినవి.

పెరుగుతోన్న ధరలు, తక్కువ ఆదాయం, ఉద్యోగ అభద్రత, జీవనశైలి లో మార్పు, జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురవ్వడం , వైవిధ్యమైన మదుపు మార్గాలు మనల్ని ఆర్థిక ప్రణాళిక రూపొందించే దిశగా నడిపిస్తాయి.

స్వేచ్చకు మార్గం ఆర్ధిక ప్రణాళిక:
ఆర్థిక ప్రణాళిక స్వేచ్ఛకు రూపం కల్పిస్తుంది. మీకిష్టమైన వ్యాపకానికి స్వేచ్ఛగా ఖర్చుపెట్టేందుకు, స్నేహితులతో సరదాగా గడిపేందుకు, డబ్బుతో పొందగలిగే చిన్న చిన్న ఆనందాలను నెరవేర్చుకోవచ్చు. వాటన్నింటినీ ప్రణాళికబద్ధంగా రూపొందించుకున్న బడ్జెట్‌తో సాధించుకోవచ్చు.

సరైన ప్రణాళికతో మన పెట్టుబడిని పెంచుకునే అవకాశం ఉంది. మన ఖర్చుల్లో దేనికి ఎంత అవసరమో ఒక అవగాహనకు రాగలుగుతాం. గృహావసరాలకు, లక్ష్యాలకు, రుణాలకు, పన్ను చెల్లింపులకు …ఇలా ప్రతి దానికీ కేటాయించుకోవచ్చన్నమాట. మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా జీవనశైలిని నియంత్రించుకునే అవకాశం లభిస్తుంది.

పరిస్థితులను, లక్ష్యాలను అర్థంచేసుకునేందుకు, వాటి ప్రాధాన్యతను గుర్తించేందుకు ఆర్థిక ప్రణాళిక అవసరం. అందమైన భవిష్యత్తు కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. భవిష్యత్తులో ఎదుర్కోబోయే ప్రశ్నలకు సమాధానాలు సుస్పష్టంగా కదలాడుతుంటాయి. ఓ బాధ్యతను లేదా లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ఎంత మొత్తం, ఏ సమయానికి అవసరమవుతుందో అనే అంచనాకు రావడమే కాదు అందుకు అనుగుణంగా మన పెట్టుబడులను ఎందులో పెట్టాలి వాటి లబ్ధిదారులను ముందే నిర్దేశించుకునే అవకాశం దొరుకుతుంది.

అవసరాలకు కోరికలకు తేడా అదే:
అవసరానికి కోరికకు మధ్య ఉన్న చిన్నగీతను ఆర్థిక ప్రణాళిక రూపుమాపుతుంది. అనవసర కోరికలకు పోయి అప్పులపాలవ్వడం వల్ల ఆందోళన చెందక తప్పదు. అదే చక్కని ఆర్థిక ప్రణాళిక వేసుకుంటే దేనికి ఎంత ఖర్చు చేయాలో ఓ అవగాహనకు రాగులుగుతారు. దీని వల్ల మీ క్రెడిట్‌ స్కోర్‌ పెరిగే అవకాశం ఉంది.

ప్రణాళికతో భవిష్యత్తులో రమారమి ఎంత డబ్బు అవసరమవుతుందో ఏ సమయం వరకు అవసరమవుతుందో అంచనా వేయగలుగుతాం. సరైన సమయానికి అనవసర హైరానా పడకుండా ఉండేందుకు ఆర్థిక ప్రణాళిక ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.

ఉద్యోగం కోల్పోయినప్పుడో, ప్రమాదం వల్ల ఉద్యోగం చేయలేని క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం వేసుకునే ఆర్థిక ప్రణాళికే మనవారికి చేదోడుగా నిలుస్తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోబోతామని ముందే తెలుసున్నందున అందుకు తగ్గట్టు ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుంటాం కాబట్టి వాటిని సునాయాసంగా ఎదుర్కోగలుగుతాం.

* సరైన బీమా పాలసీలు తీసుకోవడం ద్వారా కుటుంబసభ్యులకు ఆర్థిక భరోసాను అందించగలిగినవారమవుతాం.

* సరైన ప్రణాళిక మీ కుటుంబ పరిస్థితులను, లక్ష్యాలను, నష్టాన్ని తట్టుకునే శక్తిని తెలుసుకునేందుకు వీలవుతుంది. దీంతో మీకు తగిన పెట్టుబడులు, పాలసీలు ఎంచుకునే అంశంలో ఓ అంచనాకు రాగలుగుతారు.

* పన్నులను చెల్లించే సమయం, వాటిని తగ్గించుకునే మార్గాలను ఆర్థిక ప్రణాళిక నేర్పిస్తుంది.

* పెట్టుబడులను సమీక్షించేందుకు, లక్ష్యాలను పూర్తిచేసుకునేందుకు ఆర్థిక ప్రణాళికలే ఆలంబనగా నిలుస్తాయి.

ప్రతి ఒక్కరికి అవసరం ఆర్ధిక ప్రణాళిక:
ఆర్థిక ప్రణాళిక అనేది కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితిమైనది కాదు. బాధ్యతలు, లక్ష్యాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక ప్రణాళిక అవసరమవుతుంది. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక నిరంతరం సాగే ప్రక్రియ. మీ కెరీర్‌లో, జీవితంలోని వివిధ దశల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

చివరకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేమిటంటే డబ్బులనేవి చెట్లకు కాయవు. అలా జరిగితే ఈ ఆర్థిక ప్రణాళిక అవసరమే ఉండదు. సంతోషానికి, విజయానికి మార్గం సుగమం చేసుకునేందుకు ఆర్థిక ప్రణాళికకు బాటలు వేయాల్సిందే. ఈ సుదీర్ఘ ప్రయాణానికి తెరలేపే బాధ్యత మనందరిది. కాదంటారా?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని