close

Published : 18/04/2021 12:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విదేశీ బ్యాంకులకు ఏమైంది?

దేశీయ సంస్థల నుంచి తీవ్ర పోటీ నేపథ్యం 
మూలధనం, నియంత్రణపరంగా సవాళ్లు

దిల్లీ: ఆసియాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారత్, చైనాలో మనుగడ సాధించేందుకు విదేశీ బ్యాంకులు సతమతమవుతున్నట్లు కనిపిస్తోంది. రూ.వందల కోట్లలో పెట్టుబడులు పెడుతున్నప్పటికీ.. వ్యాపారపరంగా దూసుకెళ్లలేకపోతున్నాయి. ఈ రెండు దేశాల్లోని రిటైల్‌ వ్యాపారాల నుంచి నిష్క్రమించనున్నట్లు అమెరికా సంస్థ సిటీ గ్రూపు ప్రకటించడమే తాజా ఉదాహరణ. దేశీయ రుణ సంస్థల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన పోటీని తట్టుకోలేకపోవడమే ఇందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా వినియోగ ఆధారిత రుణాలు (కన్జూమర్‌ ఫైనాన్స్‌), నైపుణ్యవంతులైన ఉన్నతాధికారుల విషయంలో విదేశీ సంస్థలకు దేశీయ సంస్థల నుంచి గట్టి పోటీ ఎదురవుతోందని చెబుతున్నారు. అధిక మూలధనం, నియంత్రణపరమైన సవాళ్లు లాంటివి ఇతర కారణాలుగా పేర్కొంటున్నారు. 
* 2020లో చైనాలో విదేశీ బ్యాంకుల మార్కెట్‌ వాటా 1.2 శాతం 2019లో ఇది 1.8 శాతం 
* భారత్‌లో విదేశీ బ్యాంకుల మార్కెట్‌ వాటా దశాబ్దం కిందట 7.2 శాతం ఇప్పుడు 6.8 శాతానికి పడిపోయిందని అంచనా.
ఆశావహ సంస్థలూ ఉన్నాయ్‌: చైనాలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి పోటీ, భారత్‌లో అధిక మూలధన పరిమితి నిబంధనలు విదేశీ బ్యాంకులకు సవాలు విసురుతున్నాయి. వీటిని తట్టుకుని నిలబడలేక ఈ విపణుల నుంచి వైదొలగేందుకు సిటీ గ్రూపు లాంటి కొన్ని బ్యాంకులు యోచన చేస్తున్నాయి. అయితే హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్స్‌ పీఎల్‌సీ నుంచి సింగపూర్‌కు చెందిన డీబీఎస్‌ గ్రూపు వరకు మరికొన్ని విదేశీ బ్యాంకులు మాత్రం ఈ విపణుల్లో వృద్ధి లక్ష్యాలను సాధిస్తామనే ఆశాభావంతో ఉన్నాయి. 
* భారత్‌లో లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ను డీబీఎస్‌ గ్రూపు కొనుగోలు చేయడాన్ని ఇందులో భాగంగానే చూడొచ్చు. దేశీయంగా సంక్షోభంలో చిక్కుకున్న ఓ బ్యాంకును విదేశీ బ్యాంకు ద్వారా గట్టెక్కించేందుకు ప్రభుత్వమూ ప్రయత్నించడం బహుశా ఇదే మొదటిసారి. 
* జపాన్‌కు చెందిన మిత్సుబిషీ యూఎఫ్‌జే ఫైనాన్షియల్‌ గ్రూపు కూడా భారత్‌లో తన కార్యకలాపాలు విస్తరించేందుకు ఆసక్తి చూపుతోందని తెలుస్తోంది. 
* హెచ్‌ఎస్‌బీసీ కూడా చైనా, దక్షిణాసియాలో తన ఉనికిని మరింతగా విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది.

డిజిటల్‌ బ్యాంకింగ్‌ కీలకం

విదేశీ బ్యాంకులు రాణించాలంటే డిజిటల్‌ బ్యాంకింగ్‌ విధానం ఓ మంచి అవకాశమని విశ్లేషకులు అంటున్నారు. ఏ విదేశీ బ్యాంకైతే విజయవంతమైన డిజిటల్‌ బ్యాంకింగ్‌ విధానాన్ని రూపొందించుకుంటుందో.. ఆ బ్యాంకు దేశీయ బ్యాంకులతో గట్టిగా పోటీ పడగలదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని