close

ప్ర‌త్యేక క‌థ‌నం

పంట రుణంలో తిరకాసు

బ్యాంకుల రుణలక్ష్యాలు పెరుగుతున్నా రైతన్న బాధలు యథాతథం
అప్పులకు వడ్డీ కలిపి కొత్త రుణంగా చూపిస్తున్న వైనం
చివరకు వడ్డీ వ్యాపారులే శరణ్యం
ఈనాడు - అమరావతి

రైతు రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్ల కొర్రీలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఏడాదికి రూ.84 వేల కోట్ల పంట రుణాలిస్తున్నట్లు బ్యాంకులు గొప్పలు చెబుతున్నాయి. ఇంత సొమ్ము అందుతుంటే అప్పుల కోసం రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఎందుకు ఆశ్రయిస్తున్నారనే ప్రశ్నకు నీళ్లు నములుతున్నాయి. ఏటికేడాది రుణ లక్ష్యాలు పెంచడం తప్పితే రైతుల అప్పుల బాధలు ఎంత మాత్రం తీరడం లేదని రెండు రోజుల కిందట జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలోనే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అప్పులకు వడ్డీలు కలిపి కొత్త రుణాలుగా చూపిస్తున్నారనే అంశం ఈ సందర్భంగా బ్యాంకర్ల మాటల్లోనే స్పష్టమైంది. రుణ లక్ష్యాలను పూర్తి చేయాలనే తపనతో రైతు అవసరాలను పక్కన పెట్టి పంట వేయని వారికి కూడా ఇబ్బడిముబ్బడిగా రుణాలిస్తుండటంతో అసలైన రైతుకు అన్యాయం జరుగుతోంది.

లెక్కల్లో మతలబు ఇదీ
పంటరుణం ఏడాదిలోగా చెల్లిస్తే రూ.వందకు నాలుగు శాతం వడ్డీ మాత్రమే బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఏడాది దాటితే తొమ్మిది శాతం.. అదనంగా మరో రెండు శాతం కలిపి వడ్డీ లెక్కలేస్తున్నాయి. రెండేళ్లు గడిచేసరికి అసలు, వడ్డీలకు వడ్డీలు కలిసి తడిచి మోపెడవుతోంది. ఒక రైతు రూ.లక్ష రుణం తీసుకుని రెండేళ్ల తర్వాత కొత్త రుణంగా మార్చుకుంటే రూ.1.25 లక్షలకుపైనే అవుతోంది. దీన్నే బ్యాంకర్లు కొత్త రుణంగా చూపిస్తున్నారు. అంటే ఏడాదికి 12 శాతంపైనే వృద్ధి నమోదైనట్లు కన్పిస్తుంది. రాష్ట్ర స్థాయిలో పంటరుణాల గణాంకాలు కూడా ఇదే తీరున పెరుగుతున్నాయి.

భూమిపై ఇచ్చే రుణం ఇంతే!
భూమిపై పంట రుణమిచ్చే సమయంలో బ్యాంకులు నేరుగా వెబ్‌ల్యాండ్‌లోకి ప్రవేశించి రైతుకున్న భూవిస్తీర్ణం, రుణాది వివరాలు తెలుసుకోవచ్చు. లోన్‌ఛార్జిగా పిలిచే ఈ విధానంలో పట్టాదారు పాసుపుస్తకాలతోనూ పనిలేదు. నాలుగేళ్లుగా పరిశీలిస్తే బ్యాంకులు ఏటా రూ.12 వేల కోట్లకు మించి రుణాలిచ్చిన దాఖలాల్లేవు.

బంగారంపై అధికం
కొన్ని బ్యాంకులు లక్ష్యంలో 50 శాతం వరకు బంగారంపై రుణాలిస్తున్నాయి. సాగుకు అవకాశమే లేని నగర ప్రాంత శాఖల్లోనూ 4 శాతం వడ్డీపై పంట రుణాలిస్తుండడం దీనికి నిదర్శనం. దీంతో వివిధ రంగాలకు చెందిన వారితోపాటు ఉద్యోగులు కూడా ఏదో సర్వేనంబరుపై రైతు పేరుతో రుణాలు తీసుకుంటున్నారు. ముగ్గురు, నలుగురు కుటుంబసభ్యులుంటే ఒక్కొక్కరి పేరుతో రూ.3 లక్షల (వడ్డీ రాయితీ వర్తించేది ఇంతవరకే) చొప్పున మొత్తం రూ.12 లక్షలనుంచి రూ.16 లక్షల రుణాన్ని పొందుతున్నారు. రెండు, మూడు బ్యాంకుల్లో రూ.25 లక్షల వరకు పంటరుణాల కింద తీసుకుంటున్న వారున్నారు. ఏడాదిలోగా రుణం వసూలు కావడంతోపాటు లక్ష్యం చేరుకోవచ్చని బ్యాంకర్లు వీటికే ప్రాధాన్యమిస్తున్నారు.

నిజమైన రైతుకు అందితేనే
బ్యాంకుల నుంచి పంట రుణం అందకపోవడం వల్లే రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల ఊబిలోకి చేరుతున్నారు. బ్యాంకర్లు నిజమైన రైతులకే రుణాలిస్తే ఈ ఇబ్బందులు ఉండవు. ప్రభుత్వం కూడా ఈ దిశగా కార్యాచరణ రూపొందించాలి. గ్రామాలవారీగా సాగుదారులు, విస్తీర్ణం, వేసిన పంట వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి వారికే బ్యాంకుల నుంచి పంటరుణం అందేలా చేయాల్సి ఉంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.