close
జనాభా లెక్కలకు రూ.8,754 కోట్లు

16 భాషల్లో సేకరణ
డిజిటల్‌, పేపర్‌ రెండూ వినియోగం

ఈనాడు, దిల్లీ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన 2021 జనాభా లెక్కల సేకరణకు రూ.8,754.23 కోట్లు కేటాయించాలని ఆర్థికశాఖ సిఫార్సు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. 16 భాషల్లో జనాభా లెక్కలు సేకరించనున్నట్లు మంగళవారం ఆయన లోక్‌సభలో పేర్కొన్నారు. ఈసారి లెక్కలను మొబైల్‌ యాప్‌తోపాటు, పేపర్‌ ద్వారానూ సేకరించనున్నట్లు చెప్పారు. జనాభా గణకులు తమ స్మార్ట్‌ఫోన్‌ ద్వారా వివరాలు సేకరించి నేరుగా సబ్‌మిట్‌ చేయొచ్చన్నారు. లేదంటే తొలుత పేపరు పద్ధతిలో సేకరించి తర్వాత వాటిని మొబైల్‌ యాప్‌ద్వారా అప్‌లోడ్‌ చేయవచ్చని చెప్పారు. పూర్తిగా పేపర్‌ ద్వారా కూడా సమర్పించే ప్రత్యామ్నాయం ఉంటుందన్నారు. జనాభా లెక్కల సేకరణ రెండు దశల్లో సాగుతుందని చెప్పారు. 2020 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఇళ్ల గుర్తింపు (హౌస్‌ లిస్టింగ్‌), ఇళ్ల లెక్కింపు (హౌసింగ్‌ సెన్సస్‌), 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు జనాభా లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.

అయిదేళ్లలో 43% తగ్గిన మావోయిస్టు హింస
కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి అయిదేళ్లలో దేశవ్యాప్తంగా మావోయిస్టు హింస 43% తగ్గినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి లోక్‌సభకు తెలిపారు. గత మూడేళ్లలో మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ కోసం రాష్ట్రాలకు రూ.1,775 కోట్లు విడుదల చేశామన్నారు. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో 4,833 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం, 4,072 టెలికం టవర్ల ఏర్పాటు, 1,769 పోస్టాఫీసుల ప్రారంభం పూర్తిచేసినట్లు చెప్పారు. మావోయిస్టు ప్రభావమున్న 30 జిల్లాల్లో గత నాలుగున్నరేళ్లలో 879 కొత్త బ్యాంకు శాఖలు, 869 ఏటీఎంలు, 7,456 బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల ఏర్పాటు పూర్తయినట్లు వెల్లడించారు. మూడింట రెండొంతుల మేర మావోయిస్టు హింస దేశంలోని పది జిల్లాల్లోనే జరుగుతోందని చెప్పారు.
* విద్రోహ డ్రోన్ల నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కోవడానికి రక్షణ బలగాలు, భద్రతా సంస్థలకు ప్రామాణిక నిర్వహణ విధానాలు (ఎస్‌వోపీ)ను జారీ చేసినట్లు కిషన్‌ రెడ్డి తెలిపారు.
* ఫోన్ల ట్యాపింగ్‌ కోసం సీబీఐ, ఈడీ, ఐబీ సహా 10 కేంద్ర సంస్థలకే అధికారం ఇచ్చినట్లు కిషన్‌ రెడ్డి చెప్పారు. అయితే దీనికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనుమతిని తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర స్థాయిలో అయితే ఆయా రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులకు ఆ అధికారం ఉంటుందని వివరించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.