close

ముగ్గురు ఎమ్మెల్సీలపై ముగిసిన విచారణ

రిజర్వ్‌లో మండలి ఛైర్మన్‌ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస నుంచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన ఫిర్యాదుపై శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ నిర్వహించిన విచారణ శనివారం ముగిసింది. ఇరుపక్షాల వాదనలు పూర్తవడంతో స్వామిగౌడ్‌ తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో పెట్టారు. తెరాసకు చెందిన నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, అదే పార్టీ తరపున శాసనసభ్యుల కోటా, గవర్నర్‌ కోటాలో నియమితులైన యాదవరెడ్డి, రాములునాయక్‌లు ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై చర్య తీసుకోవాలని తెరాస శాసనమండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్వామిగౌడ్‌ వారి సంజాయిషీ కోరుతూ నోటీసులు ఇచ్చారు. వాటికి సమాధానం వచ్చిన తర్వాత విచారణ చేపట్టారు. శుక్రవారం రాములునాయక్‌, భూపతిరెడ్డిలపై.. శనివారం యాదవరెడ్డిపై విచారణ నిర్వహించారు. యాదవరెడ్డి తరఫున, మరోవైపు తెరాస తరఫున వారి న్యాయవాదులు హాజరై వాదనలు వినిపించారు. ఆధారాలు సమర్పించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం మండలి ఛైర్మన్‌ తమ నిర్ణయాన్ని రిజర్వ్‌ చేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన దాన్ని వెలువరిస్తారని భావిస్తున్నారు.  ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరినట్లు ఆధారాలు సమర్పించామని తెరాస విప్‌లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు చెప్పారు. చట్టప్రకారం వారిపై అనర్హత వేటు పడుతుందనే భావిస్తున్నామన్నారు.


 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.