బెదిరింపుల వల్లే పీడీ యాక్ట్‌ పెట్టాం

ప్రధానాంశాలు

బెదిరింపుల వల్లే పీడీ యాక్ట్‌ పెట్టాం

సుప్రీంలో ప్రభుత్వం వాదన

ఈనాడు, దిల్లీ: పలు నేరాల్లో భాగస్వామి కావడంతో పాటు హైకోర్టు న్యాయవాదినంటూ పలువురిని బెదిరించడం వల్లనే హైదరాబాద్‌కు చెందిన బంక స్నేహశీల అనే మహిళ భర్తపై పీడీ యాక్ట్‌ కేసు పెట్టి మరోసారి అరెస్టు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. తన భర్తను పోలీసులు పీడీ యాక్ట్‌ పెట్టి అరెస్టు చేయగా.. తెలంగాణ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్‌ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ తొలి విచారణ సందర్భంగా ఈనెల 9న సుప్రీంకోర్టు ‘ఈ చట్టాన్ని ఎవరూ సవాల్‌ చేయలేదా? అదో క్రూరమైన చట్టం’ అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. జస్టిస్‌ రోహింగ్టన్‌ ఫాలీ నారీమన్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం దీనిపై మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది గౌరవ్‌ అగర్వాల్‌ వాదనలు వినిపించారు. స్నేహశీల భర్త బెయిల్‌పై విడుదలయ్యాక ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా, సరైన కారణం లేకుండానే పీడీ యాక్ట్‌ కింద పోలీసులు సెప్టెంబరులో మరోసారి అరెస్టు చేశారని ధర్మాసనానికి విన్నవించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది రంజిత్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ నిందితుడు చాలామంది చిన్న వ్యాపారులను మోసగించినట్లు తెలియజేశారు. ఎవరైనా తన ఖాతాలో నగదు జమ చేస్తే వెంటనే భార్య ఖాతాకు మళ్లించేవారని తెలిపారు. నగదు తిరిగి అడిగితే తాను హైకోర్టు న్యాయవాదినంటూ బెదిరించేవారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌లో సుప్రీంకోర్టు జోక్యం అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని