Prime Minister Internship Scheme: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ స్కీమ్.. పూర్తి వివరాలు ఇవీ!

Eenadu icon
By Features Desk Published : 08 Oct 2024 21:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకం (PM Internship Scheme) గురించి ఏఐసీటీఈ చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్, అనువాదిని ఏఐ (Anuvadini AI) సీఈఓ డాక్టర్ బుద్ధా చంద్రశేఖర్ (Buddha Chandrasekhar) ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం..

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ స్కీమ్ ప్రాథమిక లక్ష్యం ఏమిటి?

డా. బుద్ధా చంద్రశేఖర్: కోటి మంది యువతకు ఇంటర్న్‌ షిప్‌లు అందించడం ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకం లక్ష్యం. దీని కోసం భారతదేశంలోని టాప్ 500 కంపెనీలతో కలసి పని చేస్తున్నాం. విద్య, ఉపాధి మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఈ చొరవ సహాయపడుతుంది. ఉపాధిని పెంచడానికి ఆచరణాత్మక అనుభవాన్ని అందిస్తుంది.

ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్‌ స్కీమ్‌కు ఎవరైనా అప్లై చేయవచ్చా?

21 - 24 సంవత్సరాల వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఫుల్‌ టైమ్‌ ఉద్యోగం, విద్యాభ్యాసంలో ఉన్నారు దరఖాస్తు చేయకూడదు. అభ్యర్థులు ఎస్ఎస్సీ, హెచ్ఎస్సీ, ఐటీఐ సర్టిఫికెట్లు, పాలిటెక్నిక్ డిప్లొమాలు లేదా బీఏ, B.Sc, B.Com, బీసీఏ, బీబీఏ లేదా బీఫార్మసీ వంటి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంబీఏ, ఎంబీబీఎస్‌, పీహెచ్‌డీ తదితర అడ్వాన్స్‌డ్ అర్హతలు ఉన్న అభ్యర్థులు అప్లై చేయకూడదు. ఐఐటీ, ఐఐఎం తదితర ఇతర ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి గ్రాడ్యుయేట్లు అయినవారు కూడా అనర్హులు. కుటుంబ ఆదాయం రూ.8 లక్షలకు మించి ఉన్నవారు, లేదా వారి కుటుంబ సభ్యులు కూడా అప్లై చేయకూడదు.  సీఏ, సీఎంఏ, సీఎస్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఎంబీఏ వంటి మాస్టర్స్ డిగ్రీ లేదా అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ అర్హతలు ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. ఆన్‌లైన్‌ / డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ ద్వారా చదువుతుంటే.. ఈ పథకానికి దరఖాస్తు చేయవచ్చు.

ఈ పథకంలో చేర్చడానికి ఏదైనా రిజర్వేషన్ నిబంధన ఉందా?అంతర్జాతీయ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చా?

అధికారిక రిజర్వేషన్లు లేవు. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఇతర వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తాం. దీని ద్వారా వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన అభ్యర్థులకు సమాన అవకాశాలు దక్కుతాయి. అంతర్జాతీయ అభ్యర్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. ఈ పథకం కేవలం భారతీయ పౌరుల కోసం రూపొందించారు. 

ఇంటర్న్‌లను ఎలా ఎంపిక చేస్తారు?
ఆబ్జెక్టివ్, టెక్ ఆధారిత ప్రక్రియ ద్వారా ఇంటర్న్‌లను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు పీఎం ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ప్రొఫైల్స్ పూర్తి చేసి, సీవీలను జనరేట్ చేసి, ప్రాధాన్యతలను సమర్పించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు లాంటి వివరాల ద్వారా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు.

ఈ పథకం ద్వారా అందించే ఇంటర్న్‌షిప్‌ల వ్యవధి ఎంత?దరఖాస్తు చేసుకున్నాక ప్రాధాన్యతలను మార్చవచ్చా?
ఈ ఇంటర్న్‌షిప్‌లు ఒక సంవత్సరం ఉంటాయి. ఇందులో పాల్గొనేవారికి వారు ఎంచుకున్న పరిశ్రమలో నైపుణ్యాలు నేర్పిస్తారు. దరఖాస్తు గడువుకు ముందు ప్రాధాన్యతలను ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. అయితే, ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత, మార్పులు సాధ్యం కాదు. 

రిజిస్టర్ చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్లు అవసరం?ఎన్ని ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్‌ సైజ్ ఫొటో అవసరం. అభ్యర్థులు తమ స్థానం, రంగం, పాత్ర, అర్హతల ఆధారంగా 5 ఇంటర్న్‌షిప్‌లకు అవకాశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నచ్చిన ఐదు అవకాశాల్లో దేనికీ ఎంపిక చేయకపోతే? ఎన్ని ఇంటర్న్‌షిప్‌లను పొందొచ్చు?
ఎంపిక చేసిన ఐదు అవకాశాల్లో దేనికీ ఎంపిక కాకపోతే భవిష్యత్తులో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకసారి రెండు ఇంటర్న్‌షిప్‌ ఆఫర్లను పొందవచ్చు. ఆఫర్ అందుకున్న తర్వాత, ఇచ్చిన కాలపరిమితిలో అంగీకరించాలి లేదా తిరస్కరించాలి.

ఇంటర్న్‌షిప్‌ ఆఫర్‌ను అంగీకరిస్తే.. ఆఫర్ లెటర్ ఎలా వస్తుంది?
ఫైనల్ ఆఫర్ లెటర్ పీఎం ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి కూడా వస్తుంది.

ఇంటర్న్‌షిప్‌ చేయడానికి ఆర్థిక సహాయం లభిస్తుందా?

12 నెలల ఇంటర్న్‌షిప్‌ కోసం ప్రతి ఇంటర్న్‌కు నెలకు రూ.5,000 లభిస్తుంది. కంపెనీ నుంచి రూ.500, ప్రభుత్వం నుంచి రూ.4,500 డీబీటీ ద్వారా ఇంటర్న్ ఆధార్ సీడ్‌ అయిన బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. చేరిన తర్వాత వన్ టైమ్ గ్రాంట్ కింద రూ.6,000 అందుతుంది. ఇక ఇంటర్న్‌లు ప్రభుత్వ బీమా పథకాల పరిధిలోకి వస్తారు. ఈ పథకంలో ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద బీమా కవరేజీ ఉంటుంది. బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. కొన్ని కంపెనీలు అదనపు ప్రమాద బీమా కవరేజీని అందించవచ్చు. కానీ ఇది ఐచ్ఛికం, అలాగే కంపెనీ విచక్షణపై ఆధారపడి ఉంటుంది.

ఇంటర్న్ షిప్ సమయంలో ట్రావెల్ అలవెన్సులు లాంటివి వస్తాయా?

ట్రావెల్ అలవెన్సులు, అదనపు ఆర్థిక సహాయం ఇంటర్న్‌షిప్‌ ఇచ్చిన కంపెనీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే రూ.6,000 వన్ టైమ్ గ్రాంట్ ప్రారంభ ఖర్చులకు సహాయపడుతుంది. స్టైఫండ్‌ ఎలాగూ వస్తుంది. 

పీఎం ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌కు, ఏఐసీటీఈ నేషనల్ ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌కు తేడా ఏమిటి?

పీఎం ఇంటర్న్‌షిప్‌ పోర్టల్ 21 - 24 సంవత్సరాల మధ్య వయసు గలవారికి అలాగే పూర్తి సమయం విద్య లేదా ఉపాధిలో నిమగ్నం కాని యువతను లక్ష్యంగా చేసుకుంది. బీఏ, బీఎస్సీ, బీకామ్‌, టెక్నికల్ డిప్లొమా వంటి రంగాలలో గ్రాడ్యుయేట్లకు ఇది ఉపయుక్తం. ఇందులో 500 కంపెనీలే ఉంటాయి. ఏఐసీటీఇ నేషనల్ ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌కు వయసు, అర్హత పరిమితులు లేవు. ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థులకు ఆ పోర్టల్‌ సేవలు అందిస్తుంది. 75,000 కి పైగా పరిశ్రమలు ఉంటాయి. 

ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ స్కీమ్ ద్వారా ఎలాంటి ఇంటర్న్‌షిప్‌లు లభిస్తాయి?

ఐటీ సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్, బ్యాంకింగ్ - ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆయిల్, గ్యాస్ అండ్ ఎనర్జీ, మెటల్స్ అండ్ మైనింగ్, ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్), టెలికాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ - కన్స్ట్రక్షన్, రిటైల్ - కన్జ్యూమర్ డ్యూరబుల్స్, సిమెంట్ - బిల్డింగ్ మెటీరియల్స్, ఆటోమోటివ్, ఫార్మాస్యూటికల్, ఏవియేషన్ అండ్ డిఫెన్స్, మాన్యుఫ్యాక్చరింగ్ - ఇండస్ట్రియల్, కెమికల్, మీడియా, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ తదితర విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌లు లభిస్తాయి. అగ్రికల్చర్ - అలైడ్, కన్సల్టింగ్ సర్వీసెస్, టెక్స్‌టైల్‌ మాన్యుఫ్యాక్చరింగ్, జెమ్స్ జువెలరీ, ట్రావెల్ హాస్పిటాలిటీ, హెల్త్‌ కేర్‌ కూడా ఇందులో ఉంటాయి.

ఇంటర్న్‌షిప్‌ల వ్యవధి ఎంత? పూర్తయిన తర్వాత ఉద్యోగం వస్తుందా?
ఒక్కో ఇంటర్న్‌షిప్‌ వ్యవధి 12 నెలలు. ఈ పథకం ఉద్యోగానికి హామీ ఇవ్వనప్పటికీ, పొందే నైపుణ్యాలు, అనుభవం మీ కెరీర్ అవకాశాలను, ఉపాధిని గణనీయంగా మెరుగుపరుస్తాయి. 

ఇంటర్న్‌షిప్‌ స్కీమ్ పోర్టల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది?
అక్టోబర్ 12, 2024న పోర్టల్‌ను ఓపెన్‌ చేస్తారు ఆ తేదీ నుంచి అభ్యర్థులు పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని, ప్రొఫైల్స్ పూర్తి చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని