ఆహార భద్రతకు.. ఆర్థిక వృద్ధికి!


భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వ్యవసాయం. జనాభాలో సగభాగానికి ఉపాధి కల్పిస్తూ, దేశానికి ఆహారభద్రతను అందిస్తోంది. గ్రామీణాభివృద్ధికి చోదకశక్తిగా, ప్రజల జీవితాలను మెరుగుపరిచే ప్రధాన వనరుగా కొనసాగుతోంది. భవిష్యత్తులోనూ జీడీపీలో వ్యవసాయం వాటా మరింత పెరుగుతుందని అంచనా. దేశంతో పాటు ప్రపంచ ఆహార అవసరాలను తీర్చడంలో కీలకంగా ఉన్న భారత వ్యవసాయ రంగం స్థితిగతులపై పోటీ పరీక్షార్థులకు స్థూల అవగాహన ఉండాలి. దేశవ్యాప్తంగా సాగు తీరుతెన్నులు, పంటకాలాలు, ముఖ్య పంటలు, నీటివనరులతో పాటు మౌలిక సవాళ్లనూ తప్పకుండా తెలుసుకోవాలి.

భారతదేశం - పంట కాలాలు
పంటలు నాటిన సమయం, పండించిన కాలం ఆధారంగా పంట కాలాలను మూడు రకాలుగా వర్గీకరించారు.
1) ఖరీఫ్: ఈ పంటలను వర్షాకాలంలో అంటే జూన్ నుంచి సెప్టెంబరు వరకు పండిస్తారు. వీటినే ‘వర్షాకాల పంటలు’ అంటారు.
ఉదా: వరి, మొక్కజొన్న, సజ్జ, రాగులు, వేరుశనగ, పత్తి మొదలైనవి. జూన్‌లో రుతుపవనాలు మొదలవగానే విత్తనాలు వేస్తారు. సెప్టెంబరు నాటికి కోతకు వస్తుంది.
2) రబీ: ఇవి రెండో రకం పంటలు. రబీ అనే పదం అరబిక్ భాష నుంచి వచ్చింది. అంటే వసంతకాలం అని అర్థం. అక్టోబరు నుంచి మార్చి వరకు పండించే వీటిని ‘శీతాకాలం పంటలు’ అంటారు.
ఉదా: గోధుమ, ఆవాలు, బఠానీ, బార్లీ మొదలైనవి. వీటికి తక్కువ నీరు సరిపోతుంది.
3) జైద్: ఇవి మూడో రకం పంటలు. మార్చి నుంచి జూన్ వరకు పండిస్తారు. ఖరీఫ్, రబీతో పోల్చుకుంటే తక్కువకాలపు పంట. ఈ కాలంలో ఎక్కువగా కాకర, పుచ్చ, గుమ్మడి, దోసకాయలు లాంటివి పండుతాయి.
వ్యవసాయం

ప్రపంచ వ్యవసాయ దేశాల్లో భారత్ ప్రముఖ స్థానంలో ఉంది. అత్యధిక జనాభా ఉన్న దేశంలో నేటికీ 45%-50% ప్రజలకు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలే ముఖ్య ఉపాధి వనరులు. దేశ ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయ రంగం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సుమారు 18% వ్యవసాయ రంగం సమకూరుస్తోంది. 2025 లెక్కల ప్రకారం ఈ వాటా సుమారు 567 బిలియన్ డాలర్లు. 2030 నాటికి నూతన వ్యవసాయ విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ విధానాల కారణంగా జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 20% వరకు పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయ రంగం దేశ జనాభాకు ఆహారంతో పాటు, పరిశ్రమలకు ముడిసరకును అందిస్తుంది. ఎగుమతుల రూపేణా పెద్దమొత్తంలో విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం దేశంలో నీటిపారుదల సౌకర్యాల ద్వారా సాగవుతున్న భూమి నికరంగా 45.5% ఉండగా, వర్షాధారంగా పండే భూమి 54.5%. ప్రస్తుత నికర సాగు విస్తీర్ణం 145 మిలియన్ హెక్టార్లు.
భారతదేశ వ్యవసాయాన్ని నేలలు, వర్షపాతం, ఉష్ణోగ్రత, పంటల విధానం ఆధారంగా వర్గీకరించారు. దేశవ్యాప్తంగా 14 ప్రధాన, 44 మధ్యస్థ, 55 చిన్నతరహా నదులన్నీ కలిపి సుమారు 83% నదీ వ్యవస్థను ఏర్పరుస్తున్నాయి. సాగునీటి పారుదలలో మెజారిటీ వాటా ఈ నదుల నుంచే వస్తోంది. కొన్ని రాష్ట్రాలు భూగర్భ జలాలను వ్యవసాయానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ఇటీవల కాలంలో వ్యవసాయ ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి నమోదైంది. మేలు జాతి వంగడాల సాగు, ఎరువుల వాడకం, సమర్థ నీటి నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తదితరాలన్నీ ఉత్పాదకతను మరింత పెంచాయి. దేశీయంగా ఆహారభద్రత సాధించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా ఆహార డిమాండ్ తీర్చడంలో భారత్ సహాయపడుతోంది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం 1950-51లో సాగు కింద ఉన్న భూమి 119 మిలియన్ హెక్టార్లు. 1970-71 నాటికి 140 మి.హెక్టార్లకు, 1990-91లో 142 మి.హెక్టార్లకు పెరిగింది. 2018-19లో 139 మి.హెక్టార్లకు, 2023-24లో 138.9 మి. హెక్టార్లకు తగ్గింది. వ్యవసాయ భూములు నెమ్మదిగా వ్యవసాయేతర అవసరాలకు, పట్టణీకరణ ప్రభావంతో నివాస ప్రాంతాలుగా మారుతుండటమే ఇందుకు కారణం.

వ్యవసాయ రంగంలోని సవాళ్లు
- దేశంలో గత 4-5 వేల సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తుండటంతో నేలసారం తగ్గిపోతోంది.
 - మృత్తికా క్రమక్షయానికి కారణం అడవుల నరికివేత, అత్యధిక వర్షపాతం, తద్వారా సంభవించే వరదలు.
 - కుటుంబాలు క్రమంగా చిన్నవిగా మారడంతో కమతాల పరిమాణం కూడా ఏటా తగ్గుతూ వస్తుంది.
 - 1970-71లో సగటు కమత పరిమాణం 2.28 హెక్టార్లు ఉండగా, 1990-91 నాటికి 1.6 హెక్టార్లకు, ప్రస్తుతం 2015-16 లెక్కల ప్రకారం 1.08 హెక్టార్లకు తగ్గిపోయింది.
 - ఆధునికత ఎంత పెరిగినా నేటికీ మారుమూల ప్రాంతాల్లో పాతతరం పనిముట్లే వాడుతున్నారు.
 - కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడుల సౌకర్యం, రుణ సౌకర్యం, బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేకపోవడంతో నేటికీ వ్యవసాయ ఖర్చుల కోసం ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు.
 - పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర, సరిపడా గిడ్డంగి సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో కోతల సమయంలో దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది.
 - అతిపెద్ద నదీ వ్యవస్థ, కాలువలు ఉన్నప్పటికీ ఇంకా సాగుయోగ్యమైన చాలా భూమికి నీటిపారుదల వసతి లేదు.
 

ముఖ్యాంశాలు
- ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ విస్తీర్ణంలో వ్యవసాయం చేసే దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. (చైనా, అమెరికా, బ్రెజిల్ మొదటి మూడు స్థానాలు)
 - దేశంలోని నికర సాగు భూమి 138.99 మిలియన్ హెక్టార్లు. మొత్తం వ్యవసాయ భూమి 140-157 మి.హె.
 - దేశ విస్తీర్ణంలో అడవులు 24% మేర ఉన్నాయి. అటవీ విస్తీర్ణం పరంగా మనది ప్రపంచంలో 9వ స్థానం.
 - 1950 నాటికి జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 67.5% ఉండగా, ప్రస్తుతం (2023-24 ఐబీఈఎఫ్ లెక్కలు) సుమారు 18%.
 - 1908లో దేశంలో బిహార్‌లోని పూసా వద్ద వ్యవసాయ కళాశాల, పరిశోధనశాల స్థాపించారు.
 - భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులు ఖరీఫ్ కాలంలో అధికంగా 47%-49%, రబీలో 44%-45%, జైద్‌లో 5%-7% వస్తున్నాయి.
 - దేశంలో ప్రస్తుతం నికర నీటిపారుదల వసతులున్న సాగుభూమి 45.5%. వర్షాధార వ్యవసాయ భూమి 54.5%.
 - దేశవ్యాప్తంగా 14 ప్రధాన, 44 మధ్యతరహా, 55 చిన్న నదులు 83% నదీపరీవాహక ప్రాంతాన్ని ఏర్పరుస్తున్నాయి.
 


రచయిత: డాక్టర్ గోపగోని ఆనంద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 - 
                        
                            

‘ఎస్ఐఆర్’కు ఈసీ రెడీ.. 12 రాష్ట్రాలు/యూటీల్లో అమలు
 


