ఐవీఎఫ్‌ సాఫల్యం సజావుగా..

సంతానలేమితో బాధపడుతున్న ఎంతోమందిని కృత్రిమ గర్భధారణ పద్ధతులు ఆదుకుంటున్నాయి. సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి. వీటిల్లో ఎక్కువగా వాడకంలో ఉన్నది ఐవీఎఫ్‌ (ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌) పద్ధతే. 

Updated : 19 Mar 2024 06:55 IST

సంతానలేమితో బాధపడుతున్న ఎంతోమందిని కృత్రిమ గర్భధారణ పద్ధతులు ఆదుకుంటున్నాయి. సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి. వీటిల్లో ఎక్కువగా వాడకంలో ఉన్నది ఐవీఎఫ్‌ (ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌) పద్ధతే. ప్రయోగశాలలో అండాన్ని, శుక్రకణాలను ఫలదీకరణ చెందించి, అభివృద్ధి చెందిన పిండాన్ని మహిళల గర్భసంచిలో ప్రవేశపెట్టటం దీనిలోని కీలకాంశం. దీంతో వెంటనే గర్భం వస్తుందని, సంతానం కలుగుతుందని చాలామంది భావిస్తుంటారు. నిజానికి అందరికీ తొలిసారే సంతానం కలగకపోవచ్చు. రెండు మూడు సార్లూ ప్రయత్నించాల్సి రావొచ్చు. కొందరికి సఫలం కాకపోవచ్చు కూడా. ఇందుకు రకరకాల అంశాలు కారణమవుతుంటాయి. ఐవీఎఫ్‌ ఎవరికి అవసరం? ఇది ఎందుకు విఫలమవుతుంది? అనేవి తెలుసుకుంటే పొరపాట్లకు తావివ్వకుండా ఈ ప్రక్రియ సఫలమయ్యేలా చూసుకోవచ్చు.

గర్భధారణ సహజమే అయినా సంక్లిష్టమైంది. ఇద్దరు వ్యక్తుల సమాగమం, రెండు సంతాన వ్యవస్థలతో ముడిపడిన వ్యవహారమిది. భాగస్వాముల వయసులూ వేరే. శారీరక, మానసిక స్వభావాలూ భిన్నమే. కొందరు వేర్వేరు చోట్లా నివసిస్తుండొచ్చు. ఇవన్నీ గర్భధారణ మీద ప్రభావం చూపేవే. కృత్రిమ గర్భధారణ సాఫల్యత విషయంలోనూ ఇవి మినహాయింపు కావు. సుమారు 40 అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి. మందులతో అండాలను విడుదల చేయగలమే గానీ వాటి నాణ్యతను ముందే నిర్ణయించలేం. బయటకు తీసేంతవరకూ వాటి నాణ్యత గురించి తెలియనే తెలియదు. ఇవి నాణ్యంగా లేకపోతే ఫలదీకరణ సాధ్యం కాదు. మగవారిలో వీర్యం నాణ్యత, శుక్రకణాల సంఖ్య తగ్గినా, అవి చురుకుగా కదలకపోయినా ఫలదీకరణ సామర్థ్యం తగ్గుతుంది. మగవారిలో థైరాయిడ్‌, మధుమేహం వంటి సమస్యలను సరి చేయకుండా ఐవీఎఫ్‌కు ప్రయత్నిస్తే విఫలమయ్యే అవకాశముంటుంది. ఆడవారు రక్తహీనత, థైరాయిడ్‌ సమస్యలతో బాధపడుతుంటే వాటికి చికిత్స తీసుకోకపోయినా ఇబ్బందే. మానసిక సమస్యలు, మూర్ఛ కోసం వాడే మందులూ ప్రభావం చూపొచ్చు. పిండం అనేది దంపతుల జన్యు పదార్థం. ఇది బయటకు వచ్చి తరతరాల వరకూ నిలుస్తుంది. అందువల్ల ప్రకృతి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. పిండంలో జన్యులోపాలుంటే తిరస్కరించొచ్చు. గర్భసంచిలో అండాన్ని ప్రవేశ పెట్టిన తర్వాతా శరీరం దాన్ని సంగ్రహించకపోవచ్చు. గర్భసంచి సరిగా లేకపోయినా పిండం కుదురుకోకపోవచ్చు. చికిత్స చేసే నిపుణులు, ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలూ ముఖ్యమే. ఇవీ ఐవీఎఫ్‌ సాఫల్యాన్ని నిర్దేశిస్తాయి. పిండాన్ని సరిగా ప్రవేశపెట్టకపోతే విఫలం కావొచ్చు. కాబట్టి సంతానలేమి కారణాలు, దీనికి దోహదం చేస్తున్న ఇతర అంశాలన్నింటిని బట్టి ఐవీఎఫ్‌ సాఫల్యత ఆధారపడి ఉంటుంది.

 ఐవీఎఫ్‌ ఎవరికి?

 సంతానలేమి కారణాలు, వాటి తీవ్రత, ఇతరత్రా అంశాలను బట్టి ఐవీఎఫ్‌ ఎవరికి అవసరమన్నది నిర్ణయిస్తారు.

గొట్టాల్లో అడ్డంకులు గలవారికి: అండాశయాల్లో విడుదలైన అండం ఫలోపియన్‌ గొట్టాల ద్వారా బయటకు వస్తుంది. అండం, శుక్రకణం కలిసేదీ.. పిండంగా ఏర్పడేదీ ఇక్కడే. ఈ గొట్టాలు దెబ్బతిన్నా, వీటి లోపల అడ్డంకులు ఏర్పడినా ఫలదీకరణ జరగదు. గొట్టాలు దెబ్బతినటానికి ప్రధాన కారణం క్షయ, క్లామీడియా వంటి ఇన్‌ఫెక్షన్లు. ఇవి కొనసాగుతూ వస్తుంటే గొట్టాల్లో చుట్టుపక్కల కణజాలం అతుక్కుపోయి (ఎడిషన్స్‌), మూసుకుపోయే ప్రమాదముంది. ఇలాంటి వారికి ఐవీఎఫ్‌ మంచి మార్గం. ఇందులో అండాశయం నుంచి అండాలను సేకరించి, ప్రయోగశాలలో శుక్రకణంతో కలిపి ఫలదీకరణ చెందిస్తారు కాబట్టి ఫలోపియన్‌ గొట్టాలతో పనుండదు.

నెలసరి అస్తవ్యస్తమయ్యేవారికి, మందులు పనిచేయనివారికి: గర్భధారణలో రుతుక్రమం సజావుగా అవటం ముఖ్యం. లేకపోతే అండం విడుదలయ్యే తీరూ మారిపోతుంది. అధిక బరువు, అండాశయాల్లో నీటితిత్తులు (పీసీఓడీ) వంటివి నెలసరి అస్తవ్యస్తమయ్యేలా చేస్తుంటాయి. నెలసరి సక్రమంగా రావటానికి తోడ్పడే మందులు సమస్యను అప్పటికి సరిచేస్తాయే తప్ప, పూర్తిగా తగ్గించవు. ఇలాంటివారు సంతానం కోసం ప్రయత్నిస్తూ.. 6-12 నెలలు దాటినా గర్భం ధరించనట్టయితే మరో కారణమేదో ఉందనే అర్థం. వీరికి ఐవీఎఫ్‌తో మంచి ఫలితం కనిపిస్తుంది.
కారణం తెలియనివారికి: కొందరిలో సంతానలేమికి ఎలాంటి కారణమూ ఉండకపోవచ్చు. అయినా గర్భం ధరించరు. గర్భసంచిలోకి నేరుగా వీర్యాన్ని ప్రవేశపెట్టే పద్ధతి (ఐయూఐ) కూడా విఫలం కావొచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఐవీఎఫ్‌ ఉత్తమ మార్గం.

ఎండోమెట్రియోసిస్‌, గర్భసంచిలో గడ్డలు గలవారికి: ఎండోమెట్రియోసిస్‌లో గర్భసంచిలో ఏర్పడే పొర బయట ఏర్పడుతుంది. నెలసరి సమయంలో అక్కడా రుతుక్రమం అవుతుంది. దీంతో చుట్టుపక్కల భాగాలు అతుక్కుపోతాయి. ఫలోపియన్‌ గొట్టాల్లోకి అండం చేరుకోవటం కష్టమవుతుంది. ఎండోమెట్రి యోసిస్‌ను అదుపులో ఉంచటం తప్ప, పూర్తిగా నయం చేయలేం. కాబట్టి సమస్య అదుపులో ఉన్న సమయంలో గర్భం ధరించేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 12-18 నెలలు దాటినా గర్భం ధరించకపోతే ఐవీఎఫ్‌ చేయించుకోవటమే మంచిది. గర్భసంచిలో గడ్డలు (ఫైబ్రాయిడ్లు) గలవారిలోనూ మున్ముందు గర్భసంచి తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. కాబట్టి శస్త్రచికిత్సతో గడ్డలను తొలగించిన తర్వాత నిర్ణీత కాలం వరకూ (18 నెలలు) గర్భం ధరించకపోతే కృత్రిమ గర్భధారణకు ప్రయత్నించటం మేలు. ఆలస్యంగా పెళ్లి చేసుకున్నవారికిది మరింత ముఖ్యం. ముఖ్యంగా గడ్డలతో పాటు పాటు నెలసరి సక్రమంగా అవకపోతున్నా, మగవారిలో సంతానలేమి సమస్యలున్నా ఆలస్యం చేయరాదు.

ట్యూబెక్టమీ అనంతరం: పిల్లలు పుట్టకుండా ట్యూబెక్టమీ చేయించుకొని, తర్వాత తిరిగి సంతానాన్ని కనాలని అనుకునే మహిళలకు ఐవీఎఫ్‌ మంచి పరిష్కారం. సాధారణంగా ట్యూబెక్టమీలో కొద్దిభాగాన్నే తీసేస్తే దాన్ని తిరిగి కలిపినప్పుడు (రీకెనలైజేషన్‌) సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ శస్త్రచికిత్స విఫలమైతే నిందిస్తారనే భయంతో మనదగ్గర చాలా ఆసుపత్రుల్లో కాస్త పెద్ద ముక్కనే కత్తిరిస్తున్నారు. దీంతో రీకెనలైజేషన్‌ చేసినా అంతగా ఫలితం కనిపించకపోవచ్చు. వీరికి ఐవీఎఫ్‌ తిరిగి సంతాన భాగ్యాన్ని కలిగిస్తుంది.

మగవారిలో సమస్యలు ఉన్నప్పుడు: మగవారిలో వీర్యం నాణ్యత లోపించటం, శుక్రకణాల సంఖ్య తగ్గటం, చురుకుగా కదలకపోవటం వంటివి సంతానలేమికి కారణమవుతుంటాయి. వీరికి సూది ద్వారా అండంలోకి నేరుగా శుక్రకణాన్ని ప్రవేశపెట్టే ప్రక్రియ (ఇక్సీ) మేలు చేస్తుంది. శుక్రకణాలు అసలే లేనివారిలోనూ వృషణాల నుంచి శుక్రకణాలను సంగ్రహించి కూడా అండంలో ప్రవేశపెట్టొచ్చు (టీసా ఇక్సీ).

జన్యు సమస్యల నివారణకు: రేచీకటి, సికిల్‌సెల్‌ ఎనీమియా, థలసీమియా వంటి జబ్బులు గలవారిలో పిండానికి ముందే జన్యు పరీక్షలు చేసి మార్పిడి చేయటానికి ఐవీఎఫ్‌ ఉపయోగపడుతుంది. పిల్లలకు జబ్బులు సంక్రమించకుండా చూడటం దీని ఉద్దేశం. ఇందులో పిండం ఏర్పడిన ఐదు రోజులకు కొన్ని కణాలను తీసుకొని పరీక్షిస్తారు. జన్యుమార్పులు గల వాటిని పక్కనపెట్టి, బాగున్న వాటిని ఎంచుకుంటారు.
క్యాన్సర్‌ బాధితులకు: క్యాన్సర్‌ చికిత్సలో వాడే కీమో, రేడియేషన్‌ చికిత్సలు సంతాన సామర్థ్యాన్ని తగ్గించొచ్చు. వీరికీ ఐవీఎఫ్‌ గొప్ప వరం. చిన్నవయసులో క్యాన్సర్‌ బారినపడ్డవారు కీమో, రేడియో చికిత్సలు తీసుకోవటానికి ముందు వీర్యం, అండాలు భద్రపరచుకోవచ్చు. తర్వాత ఐవీఎఫ్‌ ద్వారా సంతానాన్ని కనొచ్చు. పెళ్లయినవారికైతే ఐవీఎఫ్‌ ద్వారా పిండాలను వృద్ధి చేసి, భద్రపరచొచ్చు కూడా. ఇప్పుడు క్యాన్సర్‌ బారినపడినా ఎంతోమంది ఎక్కువకాలం జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐవీఎఫ్‌ ఆశాజనకంగా కనిపిస్తోంది.

రకరకాల అంశాల ప్రభావం

సాధారణంగా ఒకసారి ఐవీఎఫ్‌కు ప్రయత్నించినప్పుడు 20% నుంచి 35% వరకూ గర్భం ధరించి, సంతానం కలిగే అవకాశముంది. కొందరిలో ఇంకాస్త ఎక్కువగానూ ఉండొచ్చు లేదూ తగ్గొచ్చు. ఇది రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది. వీటిని అర్థం చేసుకోవటం మంచిది.
వయసు: ఆడవారిలో రజస్వల అయిన దగ్గరి నుంచే అండాల సంఖ్య, నాణ్యత తగ్గుతూ వస్తాయి. అందువల్ల వయసు మీద పడుతున్నకొద్దీ సంతానం కలిగే అవకాశం సన్నగిల్లుతుంది. కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లోనూ ఇలాంటి ధోరణే కనిపిస్తుంది. చిన్న వయసులో.. ముఖ్యంగా 35 ఏళ్ల లోపు మహిళలకు ఐవీఎఫ్‌తో సంతానం కలిగే అవకాశం (30-40%) ఎక్కువ. 35 ఏళ్లు దాటితే సాఫల్యత గణనీయంగా తగ్గుతూ వస్తుంది. 40 ఏళ్లు దాటితే 20 శాతమే ఫలితం కనిపించొచ్చు. అదే 45 ఏళ్లు దాటితే సఫలమయ్యే అవకాశం 3 శాతమే. మగవారిలోనూ వయసు మీద పడుతున్నకొద్దీ వీర్యం నాణ్యత తగ్గుతుంది. శుక్రకణాల చురుకుదనం సన్నగిల్లుతుంది. అందువల్ల 50 ఏళ్లు దాటితే సంతానం కలగటం కష్టమేనని చెప్పుకోవచ్చు. ఒకవేళ గర్భధారణ జరిగినా పూర్తికాలం నిలవకపోవచ్చు. పుట్టబోయే పిల్లల్లోనూ క్రోమోజోముల మార్పులు, బుద్ధిమాంద్యం వంటివి వచ్చే ప్రమాదముంది. మున్ముందు బిడ్డకు ఆరోగ్య సమస్యలూ ఎదురవ్వచ్చు. అందువల్ల మగవారు, ఆడవారు సంతానం కనటాన్ని దృష్టిలో పెట్టుకొనే వృత్తిగత, జీవిత లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. సరైన వయసులో సంతానం కోసం ప్రయత్నించాలి. ఐవీఎఫ్‌ వంటి అధునాతన పరిజ్ఞానాలు కూడా వయసు అడ్డంకిని అధిగమించలేవని గుర్తుంచుకోవాలి.

  •  సంతానలేమి సమస్యలు: ఆడవారిలో అండాశయ సమస్యలు, అండాలు సక్రమంగా లేకపోవటం, భాగస్వాములిద్దరికీ సంతానలేమి సమస్యలుండటం వంటివీ ఐవీఎఫ్‌ సాఫల్యాన్ని దెబ్బతీయొచ్చు. ప్రత్యేకించి కొన్నిరకాల సమస్యలు కృత్రిమ గర్భధారణ చికిత్సలకు పెద్ద అవరోధంగా నిలుస్తుంటాయి. ఇలాంటివారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం.
  • జీవనశైలి: పొగ తాగటం ఆడ, మగ ఇద్దరిలోనూ సంతాన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. మగవారిలో వీర్యం నాణ్యత, ఫలదీకరణ సామర్థ్యం తగ్గుతుంది. ఇలాంటి వీర్యంతో వృద్ధి చేసిన అండాలు గర్భంలో కుదురుకోవటమూ తక్కువే. ఆడవారిలో అండాశయాల వయసు త్వరగా మీద పడుతుంది. గర్భసంచి కూడా పిండాన్ని అంతగా స్వీకరించదు. మొత్తమ్మీద పొగ తాగే ఆడవారిలో ఐవీఎఫ్‌ సాఫల్యత గణనీయంగా పడిపోతుంది. వీరికి ఒకటికి రెండు సార్లు ఐవీఎఫ్‌ చికిత్స అవసరమవుతుంది.
  •  అధిక బరువు/ఊబకాయం: ఇవి సంతాన సాఫల్యత మీద పెద్ద ప్రభావం చూపుతాయి. చికిత్సల్లో భాగంగా ఇచ్చే మందులు, హార్మోన్లను శరీరం గ్రహించుకునే తీరును ఊబకాయం మార్చొచ్చు. నెలసరి సమయానికి రాకపోవటం, ఫలదీకరణ సరిగా జరగకపోవటం వంటివీ తలెత్తుతాయి. గర్భం ధరించినా తొమ్మిది నెలలూ బిడ్డను మోయటమూ కష్టమవుతుంది.
  • గతంలో గర్భధారణ: సహజంగా గానీ చికిత్సలతో గానీ ఇంతకుముందు గర్భం ధరించి, బిడ్డను కన్నవారికీ మంచి ఫలితం కనిపిస్తుంది. ఏదైనా కారణంతో ఐవీఎఫ్‌ అవసరమైతే వీరికి విజయవంతమయ్యే అవకాశం ఎక్కువ.
  • ఆసుపత్రి ఎంపిక: కృత్రిమ గర్భధారణ చికిత్సలు చేసే ఆసుపత్రుల ఎంపిక ముఖ్యం. అధునాతన చికిత్స పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, నిపుణులతో కూడిన ఆసుపత్రుల్లో సంతాన సాఫల్యత అధికంగా ఉంటుంది.ః పిండం నాణ్యత: ఐవీఎఫ్‌ కోసం ఉపయోగించే పిండం నాణ్యత చాలా కీలకం. మంచి నాణ్యతతో కూడిన పిండాలు గర్భసంచిలో బాగా కుదురుకుంటాయి. తొమ్మిది నెలలూ స్థిరంగా ఉంటాయి.
  • పిండం నాణ్యత: ఐవీఎఫ్‌ కోసం ఉపయోగించే పిండం నాణ్యత చాలా కీలకం. మంచి నాణ్యతతో కూడిన పిండాలు గర్భసంచిలో బాగా కుదురుకుంటాయి. తొమ్మిది నెలలూ స్థిరంగా ఉంటాయి.
  • పిండాల సంఖ్య: ఒకటి కన్నా ఎక్కువ పిండాలను ప్రవేశ పెడితే గర్భం ధరించే అవకాశం పెరుగుతుంది. అయితే కవలలు పుట్టే అవకాశమూ ఉంది. కాబట్టి ఎన్ని పిండాలను గర్భసంచిలో ప్రవేశ పెట్టాలనేదీ ముఖ్యమే.

    తొలిసారే కాకపోవచ్చు

కృత్రిమ గర్భధారణకు ప్రయత్నించేవారిలో చాలామంది ఆశించేది తొలిసారే సంతాన భాగ్యం కలగాలని. అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. ఒక్కొక్కరి శారీరక స్వభావాలు ఒక్కోలా ఉంటాయి. ఆరోగ్యం తీరుతెన్నులూ వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి సంతాన చికిత్సలు అందరిలోనూ ఒకేలా పనిచేయవని అర్థం చేసుకోవాలి. ఇవి సంక్లిష్టమైనవి కావటం వల్ల చాలామందికి రెండు, మూడు సార్లూ చేయాల్సి ఉంటుంది. ప్రయత్నిస్తున్నకొద్దీ సంతానం కలిగే అవకాశం పెరుగుతూ వస్తుంది. గర్భం ధరించకపోవటానికి కారణాలు, వాటిని అధిగమించే మార్గాలు అవగతమవుతాయి. తొలి ప్రయత్నంలో గర్భం ధరించనంత మాత్రాన నిరాశ పడరాదు. అక్కడితోనే ఆపటం సరికాదు. దంపతులిద్దరూ వాస్తవ దృక్పథంతో మెలగాలి. మరీ అతిగా ఊహించుకోవద్దు. ఏవైనా సందేహాలుంటే నిస్సంకోచంగా డాక్టర్‌ను అడిగి నివృత్తి చేసుకోవాలి.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని