మమతల చట్రాలు

‘‘అబ్బ! ఎంత అందంగా ఉంది’’ అనుకోకుండా ఉండలేకపోయాను. ఏప్రిల్‌ నెల. వసంతకాలం. పేరు కూడా తెలియని ఎన్నో చెట్లు, ఒక్క ఆకు కూడా లేకుండా, కొమ్మలు మొత్తం పూలతో నిండిపోయి, వాటి పరిమళం గాలిని

Updated : 13 Feb 2022 02:43 IST

మమతల చట్రాలు

జయలక్ష్మి అబ్బూరు

‘‘అబ్బ! ఎంత అందంగా ఉంది’’ అనుకోకుండా ఉండలేకపోయాను. ఏప్రిల్‌ నెల. వసంతకాలం. పేరు కూడా తెలియని ఎన్నో చెట్లు, ఒక్క ఆకు కూడా లేకుండా, కొమ్మలు మొత్తం పూలతో నిండిపోయి, వాటి పరిమళం గాలిని సువాసనభరితం చేస్తుంటే, వాటి రంగురంగుల పువ్వుల గుత్తులు నయనానందం కలిగిస్తున్నాయి. అందుకే అమెరికా ఏప్రిల్‌ నెలలో నాకు చాలా ఇష్టం. అందునా నా పద్దెనిమిది నెలల మనవడు ఆర్య కొత్త కొత్తవి చూస్తున్న ఆనందంలో కేరింతలు కొడుతూ ఉంటే వాడికి కబుర్లు చెబుతూ వాకింగ్‌కి తీసుకెళ్ళడం ఇంకా బాగుంది.

‘‘గ్రానీ’’ ఆర్యని ఏదో ఆకర్షించినట్లుంది. వాడి అరుపు లాంటి పిలుపులో హర్షాతిరేకం. కంటిచూపు చెట్ల మీది నుండి, స్ట్రోలర్‌లో ఉన్న వాడిమీదకి, తర్వాత వాడు చూపిస్తున్న వైపుకి మరలింది. ఓ అమెరికన్‌ యువజంట వాకింగ్‌కి వచ్చినట్టున్నారు. ఆమె స్ట్రోలర్‌ తోస్తుంటే అతను కుక్కను నడిపిస్తున్నాడు. ఆర్యకి ఆ కుక్కని చూస్తేనే ఉత్సాహం వచ్చినట్టుంది. వాళ్ళు దగ్గరకి రాగానే ఆగి వాళ్ళని పలకరించి ఆర్యని కుక్క దగ్గరగా తీసుకెళ్ళాను. దానికి దగ్గరగా వెళ్ళిన ఆనందం వాడి కళ్ళని మెరిపిస్తుంటే ఆ కాంతి నా మనసుని నింపింది.

‘అసలుకంటే వడ్డీ ముద్దు’ అనే మాట నిజమేనేమో నాకు తెలియదు కానీ నా మనవడు పుట్టినప్పటి నుంచీ వాడి పెంపకంలో భాగమైన నాకు వాడంటే వల్లమాలిన అభిమానం. వాడితో గడిపే ప్రతి క్షణాన్నీ ఆనందిస్తున్నాను. కానీ ఆ అనందంలో వెలితి... నా భర్త నా పక్కన లేని వెలితి. ఆ వెలితి పున్నమి చంద్రుడిని మింగేసే గ్రహణంలాగా నా ఆనందాన్ని హరిస్తూనే వుంది.

నాకు రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు.

నివేదిత, నిరుపమ్‌. చక్కగా చదువుకున్నారు. అమెరికాలో ఉద్యోగాలు తెచ్చుకుని సెటిల్‌ అయ్యారు. వాళ్ళకి నచ్చిన, మేము మెచ్చిన సంబంధాలు తెచ్చి పెళ్ళిళ్ళు చేశాం. అల్లుడు అరుణ్‌, కోడలు శ్రావణి మంచి పిల్లలు. మేమంటే అభిమానం, గౌరవం. వాళ్ళిద్దరికీ కూడా మంచి ఉద్యోగాలు. ఇంతలో నా భర్త రిటైర్‌ అవడంతో, పిల్లల దగ్గరకి వస్తూ పోతూ జీవితం అనందంగా ఉందనుకుంటున్న సమయంలో- నా కూతురు నెల తప్పిందన్న వార్త ఆ ఆనందాన్ని మరింత పెంచింది. తనకి అయిదో నెలలో అమెరికా వచ్చిన మేము, గ్రీన్‌ కార్డు కూడా రావడంతో, ఇప్పటికి దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఇక్కడే ఉండిపోయాం. మొదటి రెండు సంవత్సరాలూ మనవరాలు స్నిగ్ధ ముద్దూ ముచ్చట్లతో రెండు నిముషాల్లాగా గడచిపోయాయి. మేము నివేదిత దగ్గర ఉన్నా నిరుపమ్‌ వాళ్ళు ఒక గంట ప్రయాణం దూరంలోనే ఉండటంతో ప్రతీ వీకెండ్‌ కలిసే వాళ్ళం. పిల్లలకి సహాయపడుతున్న తృప్తి, వాళ్ళతో సమయం గడపగలుగుతున్నామన్న ఆనందం, కొత్త తరం ఇచ్చిన కొంగొత్త అనుభూతి... అన్నీ కలసి నాకూ నా భర్తకీ జీవితం సాఫల్యమయిన భావాన్నిచ్చాయి.
అయితే కాలం మనకోసం ఆగిపోదు కదా! కోడలు శ్రావణి నెల తప్పడం, వాళ్ళ తల్లిదండ్రులకు వీసా రిజెక్ట్‌ అవడంతో తనకి మా అవసరం పడింది. ఇటు చూస్తే స్నిగ్ధకి ఇంకా 18 నెలలు కూడా నిండలేదు. అప్పుడే డేకేర్‌కి పంపించడానికి మనస్కరించలేదు. మనవరాలి మీద ప్రేమతో, పిల్లలిద్దరికీ సాయం చేయాలన్న తపనతో, వాళ్ళు అడక్కుండానే- నా భర్త నా కూతురి దగ్గరే ఉండి మనవరాలిని చూసుకునేట్టూ, నేను కోడలి దగ్గరికి వెళ్ళేట్టూ నిర్ణయించుకున్నాం. ఆ రోజు మంచి నిర్ణయంగా అనిపించినా, దాదాపు రెండు సంవత్సరాల తర్వాత, ఈరోజు ఆ నిర్ణయమే నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది.

అపార్థం చేసుకోకండి, నాకు నివేదిత ఎంతో శ్రావణి కూడా అంతే. స్నిగ్ధ, ఆర్య ఇద్దరూ ప్రాణమే. కానీ 30 సంవత్సరాల అనుబంధం ప్రతీ క్షణం నా భర్త దగ్గర లేని లోటుని గుర్తుచేస్తుంది. వీకెండ్‌
కలుస్తూనే ఉన్నాం. వీడియో కాల్స్‌ ఉండనే ఉన్నాయి. కానీ మనసు బరువుని తగ్గించే యంత్రాలు మాత్రం లేవు.

ఉదయం కాఫీ కలుపుకుంటే- పేపరు చదువుతూ కాఫీ తాగుతూ నాకు విశేషాలు చెప్పే ఆయన గుర్తొచ్చి కాఫీ రుచి కూడా మారిపోతోంది. సాయంత్రం టీ తాగుతుంటే, ఆ సమయంలో ఇంటికి మళ్ళిన పక్షులను చూస్తూ గార్డెన్‌లో మొక్కల మధ్య కూర్చుని మేము చెప్పుకునే కబుర్లు గుర్తొచ్చి టీని సగంలోనే వదిలేస్తున్నాను. పడుకుంటే నన్ను అల్లుకున్న ఆర్య చేతులు కొంత స్వాంతనని ఇస్తున్నా, ఆయన స్పర్శలోని భరోసా కోసం ప్రాణం తహతహలాడిపోతోంది.

ఒక్కొక్కసారి ఇండియాకి వెళ్ళిపోదామని బలంగా అనిపిస్తుంది. మా పిల్లలు నిజంగా చాలా మంచివాళ్ళు. మాకు ఏ రకంగానూ లోటు చేయటం లేదు. మేము ఇండియా వెళ్ళిపోతామంటే కూడా, బాధపడినా కాదనరు. కానీ వెళ్ళాలంటే మా పిల్లలూ వాళ్ళ పిల్లలూ వాళ్ళ చుట్టూ మేము అల్లుకున్న అనుబంధాలూ ఆపేస్తున్నాయి. ఓ గంట కనిపించకపోతేనే వెతికేసుకునే మనవడూ, ‘అమ్మా’ అంటూ ఆఫీసు నుంచి రాగానే కబుర్లు చెప్పే కొడుకూ, ప్రతి దానికీ ‘అత్తయ్యా’ అంటూ నన్ను సంప్రదించి నిర్ణయాలు తీసుకునే కోడలూ... వీళ్ళని వదిలేసి వెళ్ళడం ఎలా? నిండా 18 నెలలు కూడా లేని ఆర్యని ముక్కూ మొహం తెలియని వాళ్ళ దగ్గర వదిలే పరిస్థితిని కల్పించడం ఎంత దారుణం? మా చుట్టూ మేమే చాలా బలమైన మమతల చట్రాలను బిగించుకున్నాం. త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టనిపించినా ఏమీ చేయలేని అయోమయం.

ఇంతలో ఆర్య దృష్టి కుక్క మీది నుంచి మరలడంతో వాళ్ళకి ‘బై’ చెప్పి ముందుకుసాగాం. దారిలో ఓ చైనీస్‌ దంపతులు తోటపని చేసుకుంటూ కనిపించారు. చాలా అందంగా ఉంది వాళ్ళ గార్డెన్‌. తులిప్స్‌ విరగబూసున్నాయి. మిరపనారు, టొమాటో నారు నాటుతున్నారల్లే ఉంది. ఆవిడ ఒక్కొక్క మొక్కా అందిస్తూ ఉంటే అతను వాటిని నాటుతున్నాడు. మనసు పిచ్చిది కదా! అంత అందమైన తోట కూడా
దానిని ఆకర్షించలేకపోయింది. గాలం వేసి లాగినట్లు, పని చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్న ఆ దంపతుల మీదకే వెళుతున్నాయి కళ్ళు. అదృష్టవంతులు అనుకోకుండా ఉండలేకపోయాను.

ఇక్కడినుంచి కొంచెం దూరంలోనే పాండ్‌. ఆ చుట్టుపక్కల వర్షం నీరంతా అక్కడికి వచ్చేట్టు ఏర్పాటు చేయడంతోపాటు చుట్టూ మొక్కలు వేసి నడవడానికి దారి ఏర్పాటు చేయడంతో ఆహ్లాదానికి ఆహ్లాదంతోపాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతూ ఉంది. వీలయినప్పుడల్లా సాయంత్రం పాండ్‌ దగ్గరకి ఆర్యని తీసుకుని వాకింగ్‌కి రావడం అలవాటైపోయింది నాకు. వచ్చినప్పుడల్లా ఇక్కడుండే బాతుల కోసం ఏదో ఒక మేత పట్టుకొస్తుంటాను. ఆర్యకి ఈ బాతులను చూడటం చాలా సరదా. వాటితో పోటీపడి కేరింతలు కొడుతూ ఉంటాడు. నాకేమో వాటిని చూస్తుంటే కొంచెం ఈర్ష్యగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అన్ని బాతులూ ఒక్కచోటే ఉంటాయి కదా! వాటిని దూరం చేయడానికి ఇళ్ళూ ఉద్యోగాలూ లేవు కదా!

మేమందరం ఒకేచోట ఉండలేని పరిస్థితికి కారణం ఇళ్ళూ, ఉద్యోగాలే. కొడుకు వర్జీనియాలో, కూతురు మేరీల్యాండ్‌లో ఇల్లు కొనుక్కున్నారు, ఉద్యోగాలూ అక్కడే. ట్రాఫిక్‌ లేకపోతేనే గంట పడుతుంది- ఒకరి దగ్గరి నుంచి ఇంకొకరి దగ్గరకి వెళ్ళాలంటే. పోనీ, మా భార్యాభర్తలం ఏదో ఒకచోట ఉంటాం, రెండోవాళ్ళు బిడ్డని మా దగ్గర వదిలివెళ్ళమని చెబుదామనుకుంటే, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రానూ పోనూ కలసి 4 గంటలు ప్రయాణం అవుతుంది. ఉద్యోగాలతో, మిగతా పనులతో ఇప్పటికే సతమతమవుతున్న వాళ్ళకి ఈ కష్టం అదనంగా ఇవ్వలేమనిపించింది. అలాకాక ఇద్దరు పిల్లల్నీ మేము ఒక దగ్గర ఉండి చూసుకుంటాం. వీకెండ్‌లో వాళ్ళు పిల్లల్ని కలవచ్చు అనుకుంటే, బిడ్డల్ని తల్లిదండ్రుల దగ్గర నుంచి విడదీసే పాపం చేయలేమనిపించింది. అన్నీ కారణాలూ కలిసి మమ్మల్ని విడదీయడానికి కంకణం కట్టుకున్నాయి. దీర్ఘంగా నిట్టూర్చాను. ఇప్పుడు నివేదిత, నిరుపమ్‌లు స్థలం రిజిస్ట్రేషన్‌ కోసం ఇండియా వెళ్ళున్నారు. వెళ్ళి రెండు వారాలయ్యింది. రావడానికి ఇంకో నాలుగు రోజులు పడుతుంది. ఇంట్లో నిరుపమ్‌ లేకపోవడం, దానివల్ల రెండు వారాలుగా మా వారిని కూడా కలవలేకపోవడం వల్ల- దిగులు ఇంకొంచెం ఎక్కువైంది.

వాకింగ్‌ ముగించుకుని వచ్చి తలుపు తీస్తుంటే, చప్పుడు వినపడింది కాబోలు, ‘‘అత్తయ్యా!’’ శ్రావణి వంటింటి నుంచే పలకరించింది.

‘‘అప్పుడే వచ్చేశావా శ్రావణీ?’’ ఆర్యని స్ట్రోలర్‌ నుంచి దించి వంటింటి వైపు నడిచాను.

‘‘అవునత్తయ్యా, ఫ్రైడే కదా! తొందరగా వచ్చెయ్యబుద్ధి అయ్యింది. ఈ టైమ్‌కి మీ వాకింగ్‌ అయిపోతూ ఉంటుందని మీక్కూడా పెట్టేశాను’’ టీ చేతికి అందిస్తూ ‘‘బయట డెక్‌ మీద కూర్చుందామా అత్తయ్యా?’’ అడిగింది శ్రావణి.

ఆర్యకి ఆడుకోవడానికి కొన్ని బొమ్మలు తీసుకుని బయటకి వెళ్ళి కూర్చున్నాం.

‘‘నిరుపమ్‌తో మాట్లాడావా? పనులు అయిపోయాయంటనా?’’

‘‘రిజిస్ట్రేషన్‌ బాగానే అయిపోయిందంట. నివేదిత షాపింగ్‌ చేసుకుంటుంటే ఈయన బంధువులందరినీ కలుస్తున్నారు.’’ నవ్వింది శ్రావణి. ‘‘మీకు ఫోన్‌ చెయ్యలేదా నిరుపమ్‌?’’ ఆమె గొంతులో అశ్చర్యం.

‘‘నేను రాత్రే మాట్లాడాను. రిజిస్ట్రేషన్‌ ఎలా అయ్యిందో అని నిన్నడిగాను అంతే. అయినా అంత అశ్చర్యం ఎందుకు?’’

‘‘ఎందుకా? అత్తయ్యా, మీ అబ్బాయి మీకు ఫోన్‌ చెయ్యకుండా ఒక్క రోజు కూడా ఉండరు కదా! నేను కంప్లైంట్‌ చెయ్యట్లేదులెండి’’ నవ్వేసింది శ్రావణి.

ఇంతలో ‘డబ్‌’ అన్న శబ్దంతో ఆర్య వైపు తిరిగిన మాకు బొమ్మలన్నీ ఒకటొకటిగా కిందకేస్తున్న ఆర్య కనిపించాడు.

‘‘వీడికి బొమ్మలు ఎక్కువైపోయాయి అత్తయ్యా! ఈ ఆదివారం గరాజ్‌ సేల్‌లో పెట్టేద్దాం అవసరం లేనివన్నీ’’ శ్రావణి గొంతులో చిరుకోపం ధ్వనించింది.

‘‘గరాజ్‌ సేల్‌ అంటే?’’

‘‘ఓ! మీరొచ్చిన తర్వాత ఇప్పటివరకూ గరాజ్‌ సేల్‌ పెట్టలేదు కదా అత్తయ్యా! మన కమ్యూనిటీలో రెండు సంవత్సరాలకొకసారి పెడతారు. అందరూ వాళ్ళకి అవసరం లేని వస్తువుల్ని వాళ్ళవాళ్ళ ఇంటిముందు అమ్మకానికి పెడతారు. వాటిని నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు.’’

‘‘అవునా? ఇక్కడ అందరూ బాగానే ఉన్నారుగా? అలా పాతవి కొనుక్కోవడానికి వాళ్ళేమీ ఫీలవ్వరా?’’

శ్రావణి నవ్వేసింది. ‘‘లేదత్తయ్యా! బట్టలు కూడా కొనుక్కుంటారు...

వేసుకుంటారు. పాతవి అని ఫీల్‌ అవ్వడం నేను పెద్దగా చూడలేదు. అలా అని ఎవరూ పాడయినవి సేల్‌లో పెట్టరు. మనం రేపు అన్నీ తీసి పక్కన పెడదాం. ఎల్లుండే కదా సేల్‌.’’

 *     *        *

నాకయితే చాలా గమ్మత్తుగా ఉంది. వస్తున్న వాళ్ళు పేదవాళ్ళలా లేరు. కానీ నచ్చినవి ఇష్టపడి కొనుక్కుంటున్నారు.

ఇక అవసరం లేదని పక్కన పెట్టేసిన అన్నింటినీ గరాజ్‌ నుంచీ, క్లోజెట్‌ల నుంచీ సేకరించి తెచ్చి ఒక టేబుల్‌ మీద అమర్చి నేనూ శ్రావణి కుర్చీలు వేసుకుని కూర్చున్నాం. సగం వరకూ అప్పుడే అమ్ముడుపోయాయి. ఇంకా అమ్ముడుపోవాల్సిన వాటిల్లో జంట కుందేళ్ళ బొమ్మలు చాలా బావున్నాయి. వాటిని ఎందుకు అమ్మడమో కూడా నాకర్ధం కాలేదు. శ్రావణేమో ‘‘అవి మన ఇంటి డెకరేషన్‌కి మాచ్‌ అవ్వవత్తయ్యా’’ అంది. ఇక నేనూరుకున్నాను. కానీ నా దృష్టంతా వాటిమీదే ఉంది. ఓ అమెరికన్‌ జంట వచ్చారు మా దగ్గరకి. చిన్న పిల్లల్లానే ఉన్నారు. ఆ అమ్మాయి దృష్టి కుందేళ్ళ మీద పడింది. తన కళ్ళల్లో మెరుపుని చూస్తే తెలిసిపోతుంది అవి నచ్చాయని. శ్రావణితో బేరమాడడం మొదలుపెట్టారు.

బేరం తెగినట్టుంది. కానీ అదేమిటి... శ్రావణి ఒక బొమ్మే ఇస్తుందేమిటి? ‘‘శ్రావణీ! ఒకటే ఇచ్చావేంటి?’’

‘‘వాళ్ళకి ఒకటే చాలంట అత్తయ్యా.’’

కానీ మిగిలిన ఒక్క కుందేలు బొమ్మని చూస్తే నా మనసు మెలిపెట్టినట్టయింది. ‘అది బొమ్మే’ అని నాకు నేను చెప్పుకున్నా లోపలి నుంచి తన్నుకొస్తున్న దుఃఖపు తెర ఆగట్లేదు.

‘‘శ్రావణీ, వద్దు! అలా విడదీసి ఇవ్వద్దు. కావాలంటే ఆ బొమ్మని ఫ్రీగా ఇచ్చెయ్‌’’ నా గొంతులో ఎంత వద్దనుకున్నా జీర ధ్వనించిందేమో, శ్రావణి నా వైపు విచిత్రంగా చూసింది. కానీ వెంటనే లేచి ఆ బొమ్మని తీసుకుని అప్పటికే కొంచెం ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గరకి వెళ్ళి అందించింది.

వెనక్కి వచ్చిన శ్రావణి చూపులో ప్రశ్నలు. నా చుట్టూ నా సమాధానాల్ని మింగేసిన మమతల చట్రాలు.  

*           *          *

నివేదిత, నిరుపమ్‌ ఉదయాన్నే వచ్చారు ఇండియా నుంచి. అందరమూ డిన్నర్‌కి ఇక్కడే కలుస్తున్నాం. కిచెన్‌లో వంట చేస్తున్న నాకూ శ్రావణికీ కబుర్లు చెబుతూ కూర్చున్నాడు నిరుపమ్‌. నా మనసంతా రాబోయే ఘడియల తాలూకూ ఊహలతో నిండింది. ఓ చిరునవ్వు చెప్పకుండానే నా పెదవుల మీద పరుచుకుంది.

అంతలో డోర్‌ బెల్‌ మోగింది. పరుగున వెళ్ళి తలుపు తీయాలనిపించినా నా వయస్సు, నేను చూపించాల్సిన హుందాతనాన్ని గుర్తు చేయడంతో ఆగిపోయాను. నిరుపమ్‌ వెళ్ళి తలుపు తీశాడు. ‘‘గ్రానీ’’ అంటూ వచ్చిన స్నిగ్ధ నన్ను అల్లుకుపోయింది. ‘‘అమ్మా! ఐ మిస్డ్‌ యు!’’ అంటూ నా భుజం మీద తల వాల్చింది నివేదిత. వాళ్ళ వెనకాల వచ్చిన మావారి ప్రేమ తన చూపులతోనే నన్ను చుట్టేసింది. చూపులతోనే ప్రశ్నలు... చూపులతోనే సమాధానాలు.

నా వాళ్ళందరినీ చూసుకుంటుంటే మనసంతా నిండిపోయినట్లయింది. ఇదీ జీవితం... ఇదీ సంతోషం... దీని ముందు వేయి సంక్రాంతులైనా చిన్నబోతాయి.

‘‘అమ్మా, అన్నయ్యయితే డిన్నర్‌ అయ్యాక చెబుదాం అన్నాడు కానీ నేనాగలేను. రా... నీకు మంచి గుడ్‌ న్యూస్‌ చెబుతాను’’ చెయ్యి పట్టుకుని ఫ్యామిలీ రూమ్‌ వైపు లాక్కెళ్ళింది నివేదిత.

‘‘రండి... రండి... అందరూ ఫ్యామిలీ రూమ్‌కి రండి’’ మిగతా వాళ్ళను కూడా పిలిచింది. దానికంతా హడావిడే.

‘‘నివీ, నువ్వు అస్సలు ఆగలేవా? నేను నీకు చెప్పకుండా ప్లాన్‌ చెయ్యాల్సింది’’ నిరుపమ్‌ టీజ్‌ చేస్తూ వచ్చాడు.

‘‘అది నా ఐడియా అయితే నాకు చెప్పకుండా ఎలా ప్లాన్‌ చేస్తావ్‌?’’ మాట పైన పెట్టుకోదు నివేదిత.

‘‘అయినా మంచి విషయానికి వెయిట్‌ చేయించకూడదన్నయ్యా!’’

‘‘అమ్మా, నాన్నా! గెస్‌ వాట్‌?’’ మమ్మల్నిద్దరినీ చెయ్యి పట్టుకుని సోఫాలో కూర్చోపెడుతూ అడిగింది.

‘‘ఏమిట్రా హడావుడి?’’ మా ఆయన గొంతులో మురిపెంతో కూడిన చిరునవ్వు. దీనికెంత హడావిడో ఈయనకంత నిదానం.

‘‘ఏమీ లేదు నాన్నా... మేమిద్దరం ఇప్పుడుంటున్న ఇళ్ళు అమ్మేసి, ఇక్కడ దగ్గరలో కడుతున్న కొత్త కమ్యూనిటీలో పక్క పక్కన ఇళ్ళు తీసుకుంటున్నాం’’ చెప్పేసింది నివేదిత.

అది చెప్పిన విషయం పూర్తిగా అర్థమవ్వకముందే, ‘‘అమ్మా, నాన్నా... వుయ్‌ ఆర్‌ వెరీ సారీ!’’ నా పక్కన నేలపైన మోకాళ్ళ మీద కూర్చుని నా ఒడిలో తల పెట్టుకున్నాడు నిరుపమ్‌.
‘‘ఎందుకు నాన్నా?’’ ఆప్యాయంగా తలపైన చెయ్యేశాను.

‘‘మాకు నిజంగా తెలియలేదమ్మా. మా అవసరాలు తీరిపోతున్న కొద్దీ ‘అంతా బాగానే ఉంది’ అనుకుంటూ ఉన్నాం. ఇండియాకి వెళ్ళినప్పుడు భారతి పిన్ని అంటేనే కానీ ఆ ఆలోచన రాలేదు.’’

‘‘ఏమందిరా భారతి?’’

‘‘నువ్వు నా దగ్గరా, నాన్న చెల్లి దగ్గరా ఉన్నారని తెలిసి ‘‘ఒరే, మీ నాన్న మిమ్మల్నీ మీ అమ్మనీ మిస్‌ అవుతారని ప్రమోషన్‌ కూడా వదులుకున్నారురా. ఏ శుభకార్యానికైనా వస్తే కలిసే వచ్చేవారు. అలాంటివాళ్ళని మీరు పిల్లలై పుట్టి విడగొట్టారు కదరా’’ అంది. నిరుపమ్‌ గొంతులో పశ్చాత్తాపం తాలూకు జాడలు కనిపిస్తున్నాయి.

‘‘ఏడిచిందిలే. దాని మాటలు పట్టించుకోకు’’ తల్లికి సహజమైన ఓదార్పు వచ్చింది బయటకి.

‘‘లేదమ్మా, శ్రావణి కూడా చెప్పింది నాకు... గరాజ్‌ సేల్‌ అప్పుడు కుందేలు బొమ్మల జత గురించి నువ్వు ఎలా ఫీల్‌ అయ్యావో! మేమెందుకు మీ గురించి అలా ఆలోచించలేదో నాకస్సలు తెలియడం లేదు. తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా మిమ్మల్ని అదే స్థితిలో ఉంచలేను.’’

‘‘అమ్మా, మేము ఇండియాకి వెళ్ళినప్పుడు... బంధువులంతా ఎంత బాగా చూసుకున్నా, అన్నయ్య నాతోటే ఉన్నా, అరుణ్‌ని చాలా మిస్‌ అయ్యాను. మరి నువ్వూ నాన్నా ఒకరినొకరు మిస్సవుతారనే ఆలోచన ఎందుకో మాకు రాలేదు. ఇండియాలో అడక్కుండానే ఉచిత సలహాలు ఇచ్చేస్తూ ఉంటారని చిరాకుపడేదాన్ని. కానీ మనకు సలహా కావాలనే తెలియనప్పుడు- ఇలా అడక్కుండానే ఇచ్చే సలహాలే
ఉపయోగపడతాయేమో’’ నివేదిత గొంతులో ఆర్ద్రత.

‘‘ఇల్లు ఇక్కడ కొంటే, రోజూ మీరు వెళ్ళి వస్తారా? కష్టం కదా తల్లీ?’’ అడిగాను నివేదితని.

‘‘లేదమ్మా. అరుణ్‌ ఆల్రెడీ ఇక్కడ జాబ్‌ చూసుకున్నాడు. నేను కూడా తొందరలో మారిపోతాను. నీకు తెలుసా, అరుణ్‌కి ఈ ఆలోచన చెప్పగానే వెంటనే ఆచరణలో పెట్టేశాడు. ఇళ్ళు కూడా వెతికేశాడు. రేపెళ్ళి చూద్దాం అమ్మా’’ ఉత్సాహంగా చెప్పింది నివేదిత.

‘‘అవునత్తయ్యా, పక్కపక్కన ఇళ్ళు.
మీరిద్దరూ ఏ ఇంట్లో అయినా ఉండొచ్చు. మీరెక్కడుంటే పిల్లలిద్దరూ అక్కడే. మీకు సాయం కోసం ఒక అమ్మాయిని కూడా మాట్లాడాను. రోజూ 3 గంటలు పనిచేస్తుంది మన దగ్గర’’ శ్రావణి తన వంతు సాయం అన్నట్లుగా చెప్పింది.

చుట్టూ చూశాను. నావాళ్ళూ నా భర్తా నా కొడుకూ కోడలూ నా కూతురూ అల్లుడూ మనవరాలూ మనవడూ... అందరి కళ్ళల్లోనూ ప్రేమా సంతోషం. నా పెదవుల మీదకి నవ్వుతోపాటు కళ్ళల్లోకి నీళ్ళు కూడా చేరాయి. మా ఆయన కళ్ళు నా కళ్ళకి ప్రతిబింబాలా అన్నట్లు నా భావాన్నే ప్రతిఫలిస్తున్నాయి.

‘ఒకరి కోసం ఒకరం ఆలోచిస్తే మమతల చట్రాలు కూడా అనురాగ లతలకి ఆలంబన అవుతాయి. అవధులులేని ఆనందానికి ఆరామాలవుతాయి’ అని అనుకోకుండా ఉండలేకపోయాను.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..