Published : 18 Sep 2022 00:16 IST

తెర తొలగిన వేళ

- రేణుక జలదంకి

ఉదయం టిఫిన్‌ చేసి తాపీగా టీవీ ముందు కూర్చుని తీరికగా దమయంతి, రామారావు లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉండగా హడావుడిగా వచ్చింది శ్రీదేవి.

‘‘పిన్నీ, సంతోష్‌కు మెడిసిన్‌లో సీటు వచ్చింది’’ సంబరంగా చెప్తూ చేతిలోని స్వీట్‌ ప్యాకెట్‌లో నుండి ఒక స్వీటు దమయంతి నోటికి అందించింది.

దమయంతి, రామారావుల ముఖాలు ఎందుకో మాడిపోయాయి.

శ్రీదేవి- దమయంతి అక్క కూతురు. ఇద్దరు మగపిల్లలు. చిన్నవాడు బీటెక్‌ చదువుతున్నాడు. పెద్దవాడు మాత్రం ఎంబీబిఎస్‌లో సీటు కోసం మూడేళ్ళుగా లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకుంటున్నాడు. బి-ఫార్మసీ కానీ మరేదైనా చదవమంటే వాడు ఒప్పుకోలేదని చెప్తూ ఉండేది శ్రీదేవి.

‘‘మంచి విషయమే కానీ... వీడికి ఎంబీబిఎస్‌ తర్వాత ఎంఎస్‌ అయ్యేలోపు ముప్ఫై ఏళ్ళు దాటిపోతాయేమో శ్రీదేవీ’’ వెంటనే అంది దమయంతి.

శ్రీదేవి ముఖం కొద్దిగా పాలిపోయింది.

‘‘అయితే అయిందిలే పిన్నీ! డాక్టర్‌ చదవాలన్న వాడి కోరిక నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది మా అందరికీ’’ అంది.

‘‘అదే కాదు, ఇంకొక సమస్య కూడా ఉంది... పెద్దవాడు సెటిల్‌ అయ్యేవరకూ చిన్న పిల్లవాడికి పెళ్ళి చేయకూడదు. దానితో చిన్నాడి పెళ్ళి కూడా ఆలస్యమవుతుంది’’ అందుకుంటూ అన్నాడు రామారావు.

దమయంతి భర్త వైపు సమర్ధిస్తున్నట్లుగా చూసింది.

‘‘అలా కానివ్వంలే బాబాయ్‌. ముందు చదువులు కానివ్వండి. తర్వాత పెళ్ళి మాట’’ శ్రీదేవి తేలికగా అన్నట్లు అన్నదే కానీ, ఆమె ముఖంలో ముందు ఉన్న సంతోషం తగ్గి కాస్త టెన్షన్‌ కనిపించింది. అది గమనించిన దమయంతికి ఊరట కలిగింది.

‘‘సరే, వస్తాను పిన్నీ’’ ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారో అన్నట్లుగా గబగబా బయటకు నడిచింది శ్రీదేవి.

‘‘సీటు రాగానే డాక్టర్‌ అయిపోయినట్లు సంబరపడిపోతోంది. మీరు అలా అనేసరికి ముఖం మాడ్చుకుంది చూశారా?’’ స్వీటు ప్యాకెట్లోంచి స్వీటు తీసి భర్తకి అందించింది దమయంతి.

‘‘దిగితేనే కదా లోతు తెలిసేది? మన వాడిని డాక్టర్‌ చేయలేక కాదుగా మనం డిగ్రీ చేయించింది’’ అన్నాడు రామారావు.

కాకపోతే అరవింద్‌కు డాక్టర్‌ చదివేంత తెలివితేటలు లేవని ఇద్దరికీ తెలిసిన విషయమే. ఎంసెట్‌లో క్వాలిఫై కాకపోవడంతో డిగ్రీ చదివించారు. డొనేషన్‌ కట్టి బీటెక్‌ చేయించాలి అనుకున్నా, అరవింద్‌ వినకపోవడంతో డిగ్రీ చదివించారు. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో తెలిసిన కాంట్రాక్టర్‌ దగ్గర జీతానికి పని చేస్తూ ఉన్నాడు.

పెళ్ళయిన తర్వాత భార్యాపిల్లలను పోషించడానికి కొడుకు సంపాదన సరిపోకపోవడంతో అప్పుడప్పుడూ రామారావుకు వచ్చే పెన్షన్‌లో నుంచి కూడా పంపిస్తూ ఉంటారు.

* * * * *

‘‘అత్తయ్యా, అమ్మాయి పెళ్ళి! మీరు రెండు రోజులు ముందు రావాలి. మాకున్న పెద్ద దిక్కు మీరే’’ పెళ్ళి కార్డు ఇస్తూ ఆహ్వానించింది సరిత.

సరిత స్వయానా దమయంతికి అన్నయ్య కూతురు. తన కూతురు పెళ్ళికి పిలవడానికి భర్తతో కలసి వచ్చింది.

దమయంతి పెళ్ళి కార్డు చూస్తూ కల్యాణమండపం పేరు దగ్గర ఆగింది.

‘‘అబ్బాయి వాళ్ళు కట్నం పెద్ద పట్టించుకోలేదత్తయ్యా. పెళ్ళి మాత్రం గ్రాండ్‌గా చేయాలన్నారు. అందుకే మేము ఖర్చు దగ్గర వెనుకాడటం లేదు’’ సంబరంగా చెప్పింది సరిత.

‘‘ఇంతకీ... పెళ్ళికొడుకు ఏం చేస్తున్నాడు?’’

‘‘హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేస్తున్నాడు అత్తయ్యా’’ చెప్పింది సరిత.

‘‘ఏం సాఫ్ట్‌వేర్‌లే బాబూ! బూమ్‌ పడిపోతే వీళ్ళ ఉద్యోగాలు కూడా బోల్తా పడతాయట. ఎవరైనా గవర్నమెంట్‌ ఉద్యోగస్తుడిని చూసి ఇస్తే బాగుండేది కదా, స్థిమితంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు.’’

‘‘పెద్దమ్మా... మా పెద్దల్లుడు గవర్నమెంట్‌ ఆఫీసరే. అప్పుడు నువ్వు- ఆ ఎదుగూ బొదుగు లేని జీతాలతో ఏం బతుకుతారు... సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుకు ఇవ్వకూడదూ అన్నావు, మరచిపోయావా?’’ దమయంతిని ఆటపట్టిస్తున్నట్లుగా అన్నాడు సరిత భర్త నరేష్‌.

‘‘ఇంతకీ... కట్నం ఎంత ఇస్తున్నారు? కట్నం వద్దన్నారని అసలు ఏమీ ఇవ్వడం లేదా?’’ వెంటనే మాట మార్చేసింది. కానీ, ఆమెకెందుకో సరిత భర్త అలా మాట్లాడటం నచ్చలేదు.

‘‘ముప్ఫై తులాల బంగారం, ఓ ప్లాటు అత్తయ్యా’’ అంది సరిత.

‘‘ప్లాటు అమ్మాయి పేరు మీద రాయండి. అల్లుడి పేరు మీద రాసిస్తావేమో... ఈ రోజుల్లో ఎవరు ఎలాంటి వారో తెలియడం లేదు. మా పక్క ఫ్లాటులో రాజారాం కూతురికి పెళ్ళి అయిన నాలుగు నెలలకే దాని ఆస్తంతా తెగనమ్మాడు ఆ అమ్మాయి మొగుడు’’ అంది.

ఈసారి సరిత, నరేష్‌ కాసేపు ఏమీ మాట్లాడలేదు. కానీ, వారి ముఖాలలో సంతోషం కనిపించలేదు. దమయంతికి మాత్రం వాళ్ళనలా చూస్తుంటే లోలోపల సంబరంగా అనిపించింది.

వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ‘‘అయినా గొప్పలకు కాకపోతే, అంత పెద్ద కల్యాణమండపం అవసరం అంటారా?’’ అంది.

‘‘మరే, నువ్వు బాగా అడిగావులే. ముఖాలు చూశావా ఎలా అయ్యాయో?’’ తాళం వేస్తున్న భర్త మాటలకు గర్వంగా నవ్వుకుంటూ టీవీ ఆన్‌ చేసింది దమయంతి.

‘బ్రేకింగ్‌ న్యూస్‌! పెద్దాపురం వద్ద అదుపు తప్పి వంతెనను ఢీ కొని నదిలో బోల్తా పడిన బస్సు’ టీవీలో పెద్ద స్వరంతో చెప్తున్నాడు యాంకరు.

ఇద్దరూ ఆసక్తిగా చూస్తూ సోఫాలో కూర్చున్నారు.

‘‘నదిలో పడటం అంటే... ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే ఛాన్సే లేదు’’ తేల్చేసింది దమయంతి.

‘‘అవునూ, మన ఎదురు ప్లాటు నరసింహారావు టీచరుగా పనిచేసేది పెద్దాపురంలోనే కదూ?’’ రామారావు హఠాత్తుగా గుర్తు చేశాడు.

‘‘అవునండోయ్‌! స్కూలు నుండి ఈ టైమ్‌లోనే వస్తుంటాడు బస్సులో. ఇంతకీ ఈ బస్సులోనే ఉన్నాడంటారా?’’ ఎందుకో దమయంతి మనసులో ఓ సంతోషంతో కూడిన తుళ్ళింత.

నరసింహారావు ఎంత సంపాదిస్తాడో తెలియదు కానీ ఆ భార్యాభర్తలు పిల్లలతో కలసి నెలలో నాలుగు సినిమాలు చూస్తారు. ఎప్పుడూ ఎగ్జిబిషన్‌లనీ పార్కులనీ తిరుగుతూనే ఉంటారు.

దమయంతి ఎదురింటికి వెళ్ళి కనుక్కుని వస్తానంటూ లేచింది.

యాంకర్‌ టీవీలో పదే పదే చెప్తున్నవాడల్లా ఓ బాంబు లాంటి వార్త పేల్చాడు.

‘ఇప్పుడే అందిన వార్త! నదిలో పడిన బస్సులో ప్రయాణీకులు ఎవ్వరూ లేరనీ, బస్సు సర్వీసింగ్‌కు తీసుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందనీ, బస్సులో డ్రైవర్‌ ఒక్కడే ఉన్నాడనీ, అతను ప్రమాదం నుండి తప్పించుకున్నాడనీ తెలిసింది.’

ఉత్సాహంగా లేచిన దమయంతి నీరసంగా మళ్ళీ సోఫాలో కూలబడింది.

ఎందుకో ఆమెకు బాగా నిరుత్సాహంగా అనిపించింది.

* * * * *

‘‘హలో దమయంతీ, ఎలా ఉన్నావ్‌? ఈమధ్య నీతో మాట్లాడటమే కుదరలేదు’’ ఫోనులో పలకరించింది బాల్య స్నేహితురాలు సుజాత.

‘‘బాగున్నాను. ఏంటి విశేషాలు?’’

‘‘ఈ మధ్య నేనూ మావారూ ఓ టూరు వేసి వచ్చాంలే. కాశ్మీర్‌, సిమ్లా, డార్జిలింగ్‌, ఊటీ అన్నీ చూశాం. నీకు ఫొటోలు పెడతాను, చూడు. చాలా ఎంజాయ్‌ చేశాంలే’’ సుజాత చకచకా చెప్తోంది.

ఆమె స్వరంలోని సంతోషం దమయంతికి అసహనంగా అనిపించింది.

‘‘డబ్బు దండగ తప్పితే ఏమైనా ఉందా సుజా. యూట్యూబ్‌ ఓపెన్‌ చేస్తే ఎంత మంచి వీడియోలు ఉంటున్నాయి. అన్ని ప్రదేశాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటే... వృథాగా డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా? నేనైతే మీ అన్నయ్య వెళదాం అన్నా ఒప్పుకోలేదు. ఆ డబ్బు తీసుకుని రెండు గాజులు చేయించుకున్నాను’’ దమయంతి అనేసింది.

‘‘.....’’

‘‘సుజా..!’’

‘‘ఉంటాను దమయంతీ’’ నీరసంగా వినిపించింది సుజాత స్వరం. దమయంతి మనసులో మళ్ళీ ఓ ఆనంద తరంగం.

* * * * *

‘‘నేనూ నీ మరదలూ ఓ నెల రోజుల్లో యూఎస్‌ వెళ్తున్నాం అక్కా. నీ అల్లుడు మాకు సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని టికెట్‌ బుక్‌ చేసిన తర్వాత చెప్పాడు’’ పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతూ చెప్తున్నాడు రంగనాధ్‌.

రంగనాధ్‌ దమయంతికి స్వయానా తమ్ముడు. నాలుగిళ్ళ అవతల ఉంటున్నాడు. ఇద్దరు పిల్లలు. పెళ్ళిళ్ళయి అమెరికాలో ఉంటున్నారు. రిటైరై హ్యాపీగా కాలం వెళ్ళదీస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరూ.

‘‘జాగ్రత్తరోయ్‌! అక్కడ తుపాకులతో కాల్చేస్తారట. ఆ విమానాలలో ప్రయాణం కూడా మంచిది కాదు. ఎప్పుడు, ఎక్కడ కూలిపోతాయో తెలియదు’’ గబుక్కున అనేసింది దమయంతి.

‘‘అదేంటక్కా, అలా అంటావు? రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని రైలు ఎక్కకుండా ఆగామా?’’ అతను ముఖం మాడ్చుకున్నాడు. దమయంతికి సహజంగానే ఆనందం కలిగింది.

* * * * *

ఉదయం లేచి రామారావు, దమయంతి కాఫీ తాగుతూ పేపర్‌ చూస్తుండగా ఫోను. ఎవరో తెలియని నంబరు.

‘‘హలో! రామారావుగారి నంబరే కదండీ?’’

‘‘అవునండీ, ఆయన భార్యను మాట్లాడుతున్నాను. ఎవరు మీరు?’’

‘‘మీ అబ్బాయి అరవింద్‌ పని చేసే దగ్గర క్వారీలో ప్రమాదవశాత్తూ బాంబు పేలి కొందరు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. ప్రమాదంలో ఎవరెవరు ఉన్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. వాళ్ళలో మీ అబ్బాయి కూడా ఉన్నాడని అనుమానం. మీకు విషయం చెప్పాలని...’’ దమయంతికి ఇంకేమీ వినిపించలేదు. చెవుల్లో సముద్రం హోరు... ఆమె చేతిలో ఫోను కింద పడింది కూడా తెలియలేదు.

‘‘దమయంతీ దమయంతీ... అక్కా, పిన్నీ, అత్తయ్యా...’’ రకరకాల పిలుపులు ఆమె చెవులను గట్టిగా తాకడంతో ఒక్కసారిగా లేచి కూర్చుంది. వేగంగా కొట్టుకుంటున్న గుండెను అదుపులో పెట్టుకోబోయింది. వీలు కాలేదు. ఒక్కసారిగా బావురుమంది. ‘‘అరవింద్‌!

నాన్నా, బాబూ’’ ఆక్రోశంతో, ఆవేదనతో వెర్రికేకలు వేయసాగింది.

‘‘అక్కా, మన అరవింద్‌కు ఏమీ అయి ఉండదు. నువ్వు కంగారుపడకు. మేము వెళ్తున్నాం అక్కడికి’’ ఆమె చేతిలో చేయి వేసి చెప్తున్న రంగనాధ్‌ వైపు వెర్రిగా చూసింది దమయంతి.

‘‘పిన్నీ, భయపడొద్దు... ధైర్యంగా ఉండు. దేవుడున్నాడు. అరవింద్‌కు ప్రమాదం జరిగి ఉండదు. సంతోష్‌ తన ఫ్రెండ్స్‌తో బయలుదేరి వెళ్ళాడు’’ దమయంతి భుజాల చుట్టూ చేతులు వేసి ఆర్తిగా దగ్గరకు తీసుకుంటూ అంది శ్రీదేవి.

‘‘అత్తయ్యా, ఆ ప్రమాదంలో అరవింద్‌ ఉన్నాడో లేదో కూడా తెలియదు. లేడనే అనుకుని దేవుడిని తలచుకుందాం. అంతా మంచే జరుగుతుంది’’ సరిత చెప్తోంది.

‘‘ముందు ఆమెకు కాస్త మంచినీళ్ళు తాగించండి’’ ఎదురు ఫ్లాటులో ఉన్న టీచర్‌ నరసింహారావు భార్య ఉమ అంది.

దమయంతి కళ్ళు తిప్పి పక్కకు చూసింది. భర్తను భుజాల చుట్టూ చేయి వేసి పట్టుకుని ధైర్యం చెప్తున్న నరసింహారావు కనిపించాడు.

ఓ రెండు గంటల తర్వాత ‘‘పిన్నీ, సంతోష్‌ ఫోను... నీతో మాట్లాడుతాడట’’ ఫోను దమయంతికి ఇచ్చింది శ్రీదేవి.

‘‘అమ్మమ్మా, కాన్ఫరెన్స్‌ కాల్‌ కలిపాను.

అరవింద్‌ మామ మాట్లాడుతున్నాడు విను’’ సంతోష్‌ స్వరంలో సంతోషం.

‘‘అమ్మా..!’’ అరవింద్‌ గొంతు కాస్త నీరసంగా.

‘‘నాన్నా..!’’ దమయంతి బావురుమంది. ‘‘ఎలా ఉన్నావురా... నీకేం కాలేదుగా?’’ కాస్త తమాయించుకుని అడిగింది.

‘‘చిన్న చిన్న దెబ్బలేనమ్మా, పర్లేదు. డ్రెస్సింగ్‌ చేసి, మందులు ఇచ్చారు. నా ఫోను అక్కడే పడిపోయింది. అనవసరంగా మీకు చెప్పి ఎందుకు కంగారు పెట్టడం అనుకున్నాను.

తీరా చూస్తే మీకు ఎవరో ఫోన్‌ చేశారనీ నువ్వు కంగారు పడుతున్నావనీ సంతోష్‌ హాస్పిటల్‌ నంబరుకి ఫోను చేసి కనుక్కుని నీకు ఫోను కలిపాడు. ఉంటానమ్మా, దిగులు పడకండి’’ ఫోను పెట్టేశాడు.

‘‘అమ్మమ్మా, విన్నావుగా... మామ బాగున్నాడు. దిగులు పడకు’’ ఫోనులో చెప్తున్నాడు సంతోష్‌. దమయంతి ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుంది.

‘‘సంతోష్‌, మెడిసిన్‌లో సీటు వచ్చిందట కదా... బాగా చదువు. మన కుటుంబాల్లో ఇంతవరకూ ఎవరూ డాక్టర్లు కాలేదు. నీతోనే ప్రారంభం’’ సంతోషంగా అభినందనలు చెప్పింది దమయంతి.

‘‘అక్కా, బావా... సాయంత్రం ఏడు గంటలకు ట్రైనుకు టికెట్లు బుక్‌ చేశాను, అరవింద్‌ దగ్గరకు వెళ్ళండి. వాడిని చూస్తే కాస్త మీ ఇద్దరికీ మనసు స్థిమితంగా ఉంటుంది’’ రంగనాధ్‌ చెప్తుంటే ఎందుకో భార్యాభర్తలు ఇద్దరికీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

‘‘మీరు అమెరికా వెళ్ళేలోపు వచ్చేస్తానులే. పిల్లలకు పచ్చళ్ళూ పొడులూ చేసిస్తాను. ఇక్కడి తిండికి మొహం వాచిపోయి ఉంటారు’’ తమ్ముడి వంక ఆప్యాయంగా చూస్తూ అంది దమయంతి.

‘‘మీరు భోజనం ఏమీ చేసుకోవద్దు ఆంటీ, నేను పంపిస్తాను. మీరు ప్రయాణానికి అవసరమైనవి సిద్ధం చేసుకోండి’’ అంది నరసింహారావు భార్య. దమయంతి మూగగా తల ఊపింది.

ఆ క్షణం ఆమెకు చిన్నప్పుడు సాయంత్రం దీపారాధన చేస్తూ అమ్మ వల్లించే పద్యం జ్ఞాపకం వచ్చింది. ‘ఇరుగు చల్లన... పొరుగు చల్లన... ఇంట్లో చల్లన... వీధిలో చల్లన’ అంటూ అమ్మ భక్తితో చేతులు జోడించి దేవుడి ముందు నిలుచుని ప్రార్థిస్తుంటే, ‘ఇరుగు పొరుగు ఎలా ఉంటే నీకెందుకమ్మా..?’ అని తను ఫక్కున నవ్వేది.

‘ఇరుగు పొరుగు చల్లగా ఉంటే, మనకేదైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకోగలరు తల్లీ.

వాళ్ళు ఇబ్బందిలో ఉంటే మనకేం సహాయం చేయగలరు?’- అమ్మ చెప్పేది.

‘వాళ్ళు బాగున్నా మనకు సహాయం చేయకపోతేనో..?’ దమయంతి అనేది.

‘సహాయం చేయకపోయినా వాళ్ళు బాగుంటే... వాళ్ళు బాగున్నారు కాబట్టి, మనకేదైనా కష్టం వస్తే ఆదుకుంటారు... అనే ఆత్మస్థైర్యం అయినా ఉంటుంది మనకు. వాళ్ళు ఉన్నారన్న ఆత్మవిశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది.’

రెండవ తరగతితో చదువు ఆపేసిన తల్లి మాటలు చెవుల్లో మారుమోగుతుంటే కళ్ళు తుడుచుకుని, తన చుట్టూ ఉన్న వారి వంక ఈర్ష్యా అసూయల తెర తొలగించుకుని ఆత్మీయమైన చూపులు సారించింది దమయంతి. తన కష్టం వీళ్ళందరికీ సంతోషం కలిగించడం లేదు. పైగా తన బాధను పంచుకుంటున్నారు. ఇక నుండీ తను కూడా ఇంతే! అసూయ తెర తొలగిన వేళ ఆమె మనసు ప్రశాంతంగా ఉంది.

‘ఇరుగు చల్లన! పొరుగు చల్లన! ఇంట్లో చల్లన! వీధిలో చల్లన!’ అమ్మ చెప్పిన పద్యం పదే పదే నెమరువేసుకుంటుంటే పశ్చాత్తాపం ఆమె కన్నుల నుండి అశ్రువుల రూపంలో వర్షించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని