నాన్న నన్ను ఐపీఎస్‌గా చూడాలనుకున్నారు!

మంచు విష్ణు... మోహన్‌బాబు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా... విభిన్నమైన పాత్రల్ని ఎంచుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. త్వరలో భక్త కన్నప్పగా అలరించబోతున్న ఈ హీరో తనకు సంబంధించిన విషయాలను పంచు కుంటున్నాడిలా...
సినిమాల్లోకి రావాలనుకోలేదు

నా పూర్తి పేరు మంచు విష్ణువర్ధన్‌బాబు అయినా అంతా విష్ణు అనే పిలుస్తారు. చిన్నప్పుడు ఓ సినిమాలో చేసినా... నేను ఇండస్ట్రీలోకి వస్తానని అనుకోలేదు. ఎందుకంటే.. నాన్నకు నన్ను ఐపీఎస్ ఆఫీసర్‌గా చూడాలని కోరిక. అందుకే నేను ఇంజినీరింగ్‌లో చేరా. అయితే.. చివరి ఏడాదిలో ఉన్నప్పుడు నాన్నే ఓరోజు నాకు సినిమా రంగమే బెస్ట్ అన్నారు. అప్పట్నుంచీ నన్ను నేను మార్చుకోవడంపైన దృష్టిపెట్టా. అలా ‘విష్ణు’తో తెలుగు తెరకు పరిచయమయ్యా.
రోజూ అంతే...
నేను ప్రతిరోజూ ఉదయం నాలుగ్గంటలకే నిద్రలేస్తా. అలాగే నా పనులన్నీ వీలైనంతవరకూ త్వరగా ముగించుకుని రాత్రి పదిగంటల్లోపే నిద్రపోతా. ఎంత బిజీగా ఉన్నా జిమ్ మాత్రం తప్పనిసరి.
నా డిజైనర్ తనే

నా భార్య వెరొనికాకు దేశవిదేశాల్లో బొతిక్‌లున్నాయి. మొదటిసారి చూసినప్పుడు తన నవ్వుకు ఫిదా అయ్యా. తనే నా జీవితభాగస్వామి కావాలనుకున్నా. మా పరిచయం ప్రేమగా మారి, పెళ్లికి దారితీసింది. నలుగురు పిల్లల బాధ్యత, వ్యాపారలావాదేవీలు, ఇతర పనులతో తను ఎంత బిజీగా ఉన్నా సరే... నా పర్సనల్ స్టైలిస్ట్‌గానూ వ్యవహరిస్తుంది.
ఒత్తిడి పోయేందుకు...
నేను పార్టీలకు దూరం. ఏ మాత్రం తీరిక దొరికినా ఇంటికే పరిమితమవుతా. ఆ సమయంలో పిల్లలతో గడిపేందుకే ఆసక్తి చూపిస్తా. వాళ్లతో కబుర్లు చెబుతూ, సరదాగా టీవీ చూస్తూ, ఏదో ఒకటి ఆడుతుంటే... నా పని ఒత్తిడి అంతా ఇట్టే పోతుంది మరి.
దత్తత తీసుకున్నా
కొన్నాళ్లక్రితం సమాజానికి నా వంతుగా ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకే 120మంది పిల్లల్ని దత్తత తీసుకుని వాళ్ల అవసరాలన్నీ చూస్తున్నా. ఎప్పుడైనా వాళ్ల దగ్గరకు వెళ్తే.. అందరూ అన్నా అంటూ చుట్టుముట్టేస్తారు. అప్పుడు మాత్రం ఎవరెస్టు ఎక్కినంత ఆనందంగా అనిపిస్తుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని సైనికుల పిల్లలకూ మా విద్యాసంస్థల తరఫున స్కాలర్‌షిప్‌లను ఇస్తున్నాం.
భక్తి ఎక్కువే!
నేను మొదటినుంచీ హనుమంతుడిని పూజించేవాడిని. అయితే భక్త కన్నప్ప ప్రాజెక్టు చేయడం మొదలుపెట్టాక పరమేశ్వరుడినీ ఆరాధించడం మొదలుపెట్టా. ఆ భక్తితోనే ద్వాదశ జ్యోతిర్లింగాలనూ చూసొచ్చా.
క్రీడలంటే ఇష్టం
నేను ముందునుంచీ క్రికెట్, బాస్కెట్‌బాల్ ఆడేవాడిని. మా క్యాంపస్‌లో బాస్కెట్‌బాల్ టీమ్‌కు కెప్టెన్‌ని కూడా. ఆటలపైన ఉన్న ఆ ఇష్టంతోనే మార్షల్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకున్నా. కొన్నాళ్లు లాస్‌ఏంజెలెస్‌లో స్టంట్‌మ్యాన్‌గానూ పనిచేశా. ఆ అనుభవంతోనే ‘కన్నప్ప’లో కొన్ని యాక్షన్ సీన్లను డిజైన్ చేశా.
మళ్లీ చూడాలనేలా..

‘కన్నప్ప’లో మా ముగ్గురు పిల్లలు నటించారు. మా అమ్మాయిలు తెరపైన కనిపించ బోతున్నారన్న ఉత్సాహం ఒకవైపూ అంత ఎండలో వాళ్లెలా చేస్తారోనన్న ఆందోళన మరోవైపూ ఉండేది. షూట్ అయ్యాక ఆ విజువల్స్ చూస్తుంటే.. మళ్లీ మళ్లీ చూడాలనిపించింది. అంత బాగా పాట పాడి, డ్యాన్స్ చేశారిద్దరూ. మా బాబుకూ ఆసక్తి ఉండటంతో.. తనూ ఈ సినిమాలో నటించాడు.

- నచ్చే ఆహారం చాక్లెట్లు. వాటిని చూస్తే ఆగలేను.
- మెచ్చే నటుడు మోహన్‌లాల్.
- ముద్దుపేరు విష్. దగ్గరివాళ్లు అలాగే పిలుస్తారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివి దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.







