ఆపిల్ కాదు... రేగు పండు!

రంగూ రూపంలో చూడ్డానికి అచ్చం మినీ ఆపిల్‌లానే ఉంటుంది. అంతేనా... ఆపిల్‌ను మించిన తీపి రుచితో నోరూరిస్తుంటుంది. అదే కశ్మీరీ ఆపిల్ రేగు. మిస్ సుందరి, మిస్ ఇండియా బిరుదులతో అటు రైతుల్నీ ఇటు కొనుగోలుదారుల్నీ ఆకర్షిస్తోన్న ఈ రేగుపండు కథాకమామీషు..!
ఎర్రగా గుండ్రంగా ఉండే పండు అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఆపిలే కదా. అందుకేనేమో... గుండ్రంగా చిన్న సైజు ఆపిల్‌లో ఉన్న ఈ రేగుపండుకు కూడా ఆ పేరే పెట్టి ‘ఆపిల్ బేర్’ అని పిలుస్తున్నారు. అయితే ఇప్పటివరకూ మనందరికీ ఆకుపచ్చ రంగులో ఉన్న ఆపిల్ రేగుపండు మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు అచ్చం ఎర్రని కశ్మీరీ ఆపిల్‌ను పోలిన రేగుపండ్లూ వస్తున్నాయి.
అంతర్జాలం పుణ్యమాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న రకరకాల పండ్లూ వాటి పుట్టుపూర్వోత్తరాలూ అందరికీ తెలుస్తున్నాయి. దాంతో వీటిని అంతటా పండించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగానే ఈ కశ్మీరీ ఆపిల్ బేర్ కూడా మనదేశంలోకి అడుగుపెట్టింది. థాయ్, మలేషియా, చైనాల్లో ఎక్కువగా పండించే ఈ రకం హైబ్రిడ్ రేగు పండ్లను బంగ్లాదేశ్‌లోనూ గత కొన్నేళ్లుగా పండిస్తున్నారట. చూడ్డానికి చిన్నసైజు కశ్మీరీ ఆపిల్‌ను పోలి ఉండటంతో కావచ్చు... వీటిని అంతటా ఆ పేరుతోనే పిలుస్తున్నారు. వీటిల్లోనూ కశ్మీరీ, సిందూరి అని రెండు రకాలు ఉన్నాయి. మిగిలిన రేగు రకాలతో పోలిస్తే ఇవి పెద్దగానూ తియ్యగానూ ఉంటాయి. అన్నింటినీ మించి కరవునీ వేడి వాతావరణాన్నీ తట్టుకుని పెరుగుతాయి. నీటి అవసరం పెద్దగా ఉండదు. పురుగుమందుల అవసరం కూడా తక్కువే. ఎక్కువ శ్రమా పెట్టుబడీ లేకుండా రైతులు వీటి ద్వారా మంచి లాభాల్ని పొందవచ్చని ఉద్యానశాఖ నిపుణులూ చెబుతున్నారు.

ఏడాదిలోనే పంట!
త్రిపురలోని ఉనాకోటీ ప్రాంతానికి చెందిన కొందరు రైతులు ఇప్పటికే ఈ మొక్కల్ని నాటడం ద్వారా లాభాల్ని పొందుతున్నారు కూడా. దీనికి కారణం అక్కడ పెచర్తాల్ గ్రామానికి చెందిన విక్రమ్‌జీత్ అని చెప్పాలి. బంగ్లాదేశ్‌లో వీటిని పండించడం చూసిన ఆయన కోల్‌కతా నుంచి ఈ మొక్కల్ని తెచ్చి పొలంలో నాటాడట. నాటిన ఎనిమిది నుంచి పది నెలలకే అవి కాయడం, వాటి రుచి బాగుండటంతో తొలి ఏడాదిలోనే రెండు ఎకరాలకి సుమారు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల లాభం వచ్చిందట. రెండో ఏడాదికి దిగుబడి మరింత బాగుంటుందని చెబుతున్నారు. ఆయన స్ఫూర్తితో ఆ చుట్టుపక్కల మరెందరో రైతులు- అంతంత మాత్రం ఆదాయాన్నిచ్చే సంప్రదాయ పంటల్ని మాని ఈ కశ్మీరీ, సిందూరి ఆపిల్ రేగు రకాల్ని పండిస్తున్నారు. పంట చేతికొచ్చాక మొక్కలను కత్తిరిస్తే మళ్లీ ఏపుగా పెరిగి బాగా కాస్తాయనీ, ఏటికేడూ దిగుబడి పెరుగుతుందేకానీ తగ్గదనీ, మార్కెట్లో డిమాండ్ కూడా బాగుందనీ చెబుతున్నారు రైతులు. అక్కడనే కాదు, మనదగ్గర కూడా కొందరు ఆకుపచ్చ రేగుతోపాటు ఈ మొక్కల్నీ నాటుతున్నారు. ఒకసారి నాటితే తరచూ మార్చాల్సిన అవసరం ఉండదని సిద్ధిపేటకు చెందిన చంద్రమౌళి అనే రైతు చెబుతున్నారు. పైగా ఈ పండ్లు రుచిగా ఉండటంతో చాలామంది నేరుగా పొలానికి వచ్చి మరీ పండ్లను కొంటున్నారట.

సాధారణ రేగు పండ్లతో పోలిస్తే ఈ రకం ఆపిల్ రేగు పండ్లలో ఎ, బి, సి-విటమిన్లతోపాటు కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి ఖనిజాలూ పీచూ ప్రొటీన్ల శాతం ఎక్కువే. రోగనిరోధకశక్తిని పెంచే ఈ పండ్లు పాలిచ్చే తల్లులకీ మంచివట. నిజానికి రేగుపండు ఏదయినా ఆరోగ్యానికి మంచిదే. జీర్ణక్రియని పెంచడంతోపాటు మెదడు పనితీరుని పెంచి మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు ఆల్జీమర్స్, హృద్రోగాల్నీ నియంత్రిస్తాయి. ప్రొటీన్లూ పీచూ ఆకలిని నియంత్రించడం ద్వారా బరువు పెరగకుండా చేస్తాయి. పైగా రేగుపండు పిత్త, కఫ దోషాల్ని హరిస్తుందనీ చర్మవ్యాధుల్నీ అల్సర్లనీ డయేరియానీ తగ్గిస్తుందని ఆయుర్వేదం సైతం చెబుతుంది. అసలే ఇది రేగుపండ్ల సీజన్... మార్కెట్లో కనిపిస్తే కొనడం మర్చిపోకండి..!

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


