యుద్ధ విమానాల్లో.. ఇది తెలుగువాడి ముద్ర!

‘రామన్న రాముడా...’ అని పాడుకుంటూ సాలు తప్పక చేను దున్నడంలో సైన్సుందా! పొలంలో ఆరుగాలం శ్రమించేటప్పుడు అందులో ‘వాటర్ రిటెన్షన్’ అనే శాస్త్రవిశేషం ఉండటం చూశాడతను. జోడెద్దులపైన కాడి పెట్టే తీరులో ‘కంట్రోల్ ఇంజినీరింగ్’ని గమనించాడు. అలా తమ శ్రమజీవితంలో సైన్స్‌ని వెతికిన ఆ జిజ్ఞాసే... వేటుకూరి వెంకటరాజుని మేటి ఇంజినీరుగా మార్చింది. ‘వెమ్ టెక్నాలజీస్’ సంస్థతో దేశ రక్షణ వ్యవస్థకు యుద్ధవిమానాలు రూపొందించే పారిశ్రామికవేత్తగా నిలిపింది. ఆ ప్రయాణం...

ఆ మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని భారత ప్రధాని మోదీ కలిశారు. ఆ సందర్భంగా ట్రంప్ అమెరికాకు చెందిన ‘ఎఫ్-35’ యుద్ధవిమానాలని భారత్‌కి విక్రయిస్తామని ఆఫర్ చేశారు. రాడార్ వ్యవస్థని కూడా ఏమార్చి శత్రుదేశంపైన దాడిచేయగల అత్యాధునిక స్టెల్త్ విమానాలవి! అమెరికాలో అక్కడ మోదీ- ట్రంప్ సమావేశం జరుగుతున్నప్పుడే ఇక్కడ బెంగళూరు ‘ఏరో ఇండియా’ ప్రదర్శనలో ప్రపంచం ముందు... ఎఫ్-35కి దీటైన విమానాకృతిని ప్రపంచం ముందు నిలిపింది వెమ్‌టెక్ సంస్థ. అలా అగ్రరాజ్య సాంకేతికతకి తామేమాత్రం తీసిపోమని చాటారు... ఆ సంస్థ వ్యవస్థాపకుడు వెంకటరాజు.

పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలంలో ఉన్న కలవపూడి అనే లంక గ్రామం ఆయనది. నాన్న వెంకట సుబ్బరాజు... అమ్మ వెంకమ్మ. నలుగురు పిల్లల్లో ఆయన రెండోవాడు. ‘పిల్లలందరూ చదువుకుని తీరాల్సిందేనన్న అమ్మ పట్టుదలవల్ల- చిన్నప్పటి నుంచే మేం పొలంతోపాటూ బడిబాటా పట్టాం. గేదెలు కాసేవాళ్ళం, పాలు పితికే వాళ్ళం, పిడకలు కొట్టేవాళ్ళం. ఇంట్లో ఆడపిల్లలు లేరు కాబట్టి అమ్మతోపాటూ వంటావార్పులూ చేసేవాళ్లం. కాకపోతే... ఏ పని చేస్తున్నా ‘ఇది ఎందుకిలా ఉంది? దాన్ని ఇలాగే ఎందుకు చేయాలి?’ అని ఆలోచిస్తుండేవాణ్ణి. స్కేలు పెట్టి కొలిచినట్టు సాలు వేస్తూ పొలం దున్నడం... జ్యామెట్రీ గీతకన్నా అద్భుతంగా తోచేది నాకు. ఎద్దులకి కాడిని బిగించేటప్పుడు వాటి మెడకి దెబ్బతగలకుండా చూసే ‘కంట్రోల్ ఇంజినీరింగ్’ అద్భుతమనిపించేది. నా మనసు ఇంజినీరింగ్‌వైపు రావడానికి ఈ జిజ్ఞాసే కారణమైందని చెప్పాలి. కానీ నేనో పారిశ్రామికవేత్తగా మారాలన్న లక్ష్యానికి బీజం మాత్రం నాన్న నుంచే వచ్చింది. నా చిన్నప్పుడెప్పుడూ ఆయన్ని మామూలు దుస్తుల్లో చూసింది లేదు... సేద్యం చేస్తూ బురదంటిన బట్టల్లో తప్ప! ఆయనకున్న రెండెకరాలతోపాటూ... కౌలు కూడా చేస్తుండేవాడు. దాంతో వచ్చే మిగులు ఆదాయంతో పొలాలు కొనేవాడు. అలా నేను పదో తరగతికి వచ్చేనాటికల్లా 120 ఎకరాలు సంపాదించాడు. ఊరందరినీ కలిపి కాలువలు బాగుచేయించాడు. ఆ పట్టుదలా... ఓ లక్ష్యం కోసం నలుగురినీ ముందుకు నడిపించే తత్వమే నాకు స్ఫూర్తిగా మారింది...’ అంటారు వెంకటరాజు. భీమవరంలో పదో తరగతి, ఏలూరు సర్ సీఆర్‌ఆర్ పాలిటెక్నిక్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశాక హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ)లో చదివి పరిశ్రమ స్థాపన వైపు నడిచారు.
ఓ మామూలు షాపులో...
‘సొంత పరిశ్రమ కలతో నాన్న దగ్గర రూ.10 వేలు తీసుకుని... తొలి అడుగులు వేశాను. ఈసీఐఎల్ సంస్థ కోసం స్ట్రాపింగ్ మాడ్యూల్ అనే పరికరం తయారు చేయడంతో నా ప్రయాణం మొదలైంది. మా సోదరులు రామకృష్ణరాజు, సత్యనారాయణ రాజు, శివరామ రాజు, మా బాబాయిగారబ్బాయి మార్రాజు నాకు తోడుగా వచ్చాడు. ఓ సెకండ్ హ్యాండ్ మౌల్డర్, అద్దెకు తెచ్చుకున్న ప్రెస్సింగ్ మెషిన్‌తో తయారీ ప్రారంభించాం. ఓ చిన్న దుకాణంలో పని మొదలుపెట్టాం. మా నాణ్యత నచ్చి అప్పటికప్పుడు లక్షన్నర పరికరాలకు ఆర్డర్ ఇచ్చింది ఈసీఐఎల్ సంస్థ. మళ్లీ గడువులోపే అన్నింటినీ అందించేశాం! ఈసీఐఎల్ ద్వారా- రక్షణ శాఖకి ఆయుధాలూ తయారుచేసే భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) నుంచి ఆర్డర్లు వచ్చాయి. తొలిసారి క్షిపణుల్లో వాడే కనెక్టర్స్‌ని చేసివ్వమన్నారు. రష్యన్ క్షిపణుల ఆధారంగా... వాటికన్నా మెరుగైనవాటిని తయారుచేయగలిగాం. అందుకోసం కేంద్రప్రభుత్వం నుంచి ‘ఇండిజినస్ అవార్డు’ అందుకున్నాం. అప్పుడే మాకో మహత్తర అవకాశం వచ్చింది...
1998 నాటి మాట..
అప్పట్లో మనదేశం సొంతంగా మిస్సైల్స్ తయారు చేసుకోవాలనుకుంది. వాటిని లక్ష్యం దిశగా నడిపించే యాక్చువేటర్ సాంకేతికతని మనకు అందిస్తామన్న ఇజ్రాయెల్ దేశం... చివరి నిమిషంలో వెనకడుగేసింది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో డీఆర్‌డీఓ సంస్థ ఆ ప్రాజెక్టును మాకు అప్పగించింది. హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ కాలేజీల ప్రొఫెసర్‌ల సాయాన్ని తీసుకుని యాక్చువేటర్‌ని పూర్తిచేశాం! అప్పట్నుంచీ భారత రక్షణ శాఖలో మేం ముఖ్య భాగస్వామిగా మారాం. మన ఆయుధ సంపత్తిలో అతికీలకమైన ఆకాశ్ క్షిపణికి మేము ముఖ్యమైన భాగాలను రూపొందించాం. ప్రతిష్ఠాత్మక తేజస్ యుద్ధ విమానంలో అతికీలకమైన మధ్యభాగాన్నీ మేమే రూపొందించాం! ఆ ఊపుతోనే డీఆర్‌డీవో సహకారంతో ‘ఆమ్‌కా’ యుద్ధవిమాన ఆకృతిని తయారుచేసి... మనదేశం తలెత్తుకునేలా చేశాం!’ అని సంస్థ ప్రస్థానాన్ని వివరిస్తారు వెంకటరాజు!
నలుగురితో ప్రారంభమైన వెమ్‌టెక్ సంస్థ నేడు 1400 మంది సిబ్బందితో అలరారుతోంది. పది వేల రూపాయల పెట్టుబడి కాస్తా 450 కోట్ల రూపాయల టర్నోవర్‌కి చేరుకుంది. ఒకప్పటి సాదాసీదా దుకాణం... దేశ రక్షణ అవసరాలు తీర్చే అతిపెద్ద ప్రైవేటు యూనిట్‌గా రూపుదిద్దుకుంది. చిన్నప్పుడు దుక్కి దున్నుతూ అందులో సైన్స్ ఏముందా... అని ఆలోచించిన వెంకటరాజు... నేడు, తెలుగుజాతి గర్వించే పారిశ్రామికవేత్తల్లో ఒకరయ్యారు. యుద్ధ విమానాల తయారీలో తనదైన ముద్రవేస్తూ యువతకు మరో స్ఫూర్తి ప్రదాతగా మారారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/12/2025)
-

100 వికెట్ల క్లబ్లో బుమ్రా.. అర్ష్‌దీప్ సింగ్ రియాక్షన్ ఇదే
-

క్రేజీగా సీజన్లు.. థ్రిల్లింగ్‌గా వెబ్‌సిరీస్‌లు.. జియో హాట్‌స్టార్‌లో కొత్త వెబ్‌సిరీస్‌లివే!
-

రైలు ఫుట్‌బోర్డ్ ప్రయాణం..ఆ కేసులో ‘నిర్లక్ష్యం’గా చూడలేం - బాంబే హైకోర్టు
-

పాఠశాలల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి చేయాలి - ఎంపీ సుధామూర్తి


