విఠల... విఠల... పాండురంగా!

పండరీపురం... వైష్ణవ ఆలయమైనా దీనికి దక్షిణ కాశీ అని పేరు. ఇక్కడ భగవంతుడి కన్నా భక్తులకే తొలి ప్రాధాన్యం. పాండురంగడి ఆలయానికి చేరుకునేముందు ఆయన భక్తుల్ని దర్శించుకోవాలన్నది నియమం. వయసుతో సంబంధం లేకుండా వందల కిలోమీటర్లు నడుస్తూ... విఠోబా, విఠలా, పాండురంగా... అని ఎలుగెత్తి కీర్తిస్తూ స్వామిని చూసేందుకు ఓ ఉద్యమంలా కదిలి తొలి ఏకాదశికి ఆలయానికి చేరుకుంటారు లక్షలాది భక్తులు. ఏటా ఆషాఢంలో అంగరంగవైభవంగా సాగే ఈ యాత్ర... స్వామి ఇక్కడ కొలువుదీరిన వైనం... నాటి భక్తులకు ప్రత్యేక మందిరాలు ఉండటం... స్వయంగా గర్భగుడి లోపలికి వెళ్లగలగడం... ఇలా పండరీపురంలో ప్రతిదీ ఓ విశేషమే.

పాండురంగ విఠలుడు... ఇటుకరాయి మీద నిల్చుని... నడుమున చేతులు పెట్టుకుని... నాలుగు అడుగుల ఎత్తులో మాత్రమే కనిపించే మహావిష్ణువు అవతారం. ఓ భక్తుడికి మోక్షసిద్ధిని ప్రసాదించేందుకు ఈ ప్రాంతానికి వచ్చిన స్వామి ఇక్కడే కొలువుదీరడంతో పండరీపురం మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ లక్షల సంఖ్యలో భక్తుల్ని ఆకట్టుకుంటోంది. ఆలయానికి వచ్చే భక్తులు కేవలం దర్శనంతోనే ఆగిపోరు. తనివితీరా స్వామి పాదాల్ని స్పృశించి మరీ పునీతులవుతారు. ఈ విఠల్ రుక్మిణీ మందిర్ మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో చంద్రభాగా నది ఒడ్డున ఉన్న పండరీపురంలో కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని హొయసల రాజైన విష్ణువర్ధనుడు పన్నెండో శతాబ్దంలో కట్టించాడని ప్రతీతి.

ఆ సేవకు మెచ్చి...
పద్మ పురాణం ప్రకారం... ఒకప్పుడు ఈ ప్రాంతంలో పుండలీకుడని ఉండేవాడు. దురలవాట్లకు బానిస అయిన పుండలీకుడు తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా దూషించేవాడట. కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన ఆ వృద్ధ దంపతులు తమకు మరణాన్ని ప్రసాదించమంటూ విష్ణుమూర్తిని వేడుకునేవారు. ఈ క్రమంలో ఓసారి పుండలీకుడు కుక్కుటస్వామి అనే రుషి ఆశ్రమానికి వెళ్లాడు. ఆ రుషి మాటలతో ప్రభావితుడై పశ్చాత్తాపానికి లోనై, కన్న తల్లిదండ్రుల్ని మించిన దేవతలు లేరని అర్థంచేసుకుని వాళ్లకు సేవ చేయడం మొదలుపెట్టాడు. పుండలీకుడిలోని ఆ పరివర్తనను చూసి తల్లిదండ్రులే కాక ఆ ఊరివాళ్లూ ఆశ్చర్యపోయారట. పుండలీకుడి గురించి తెలిసిన శ్రీకృష్ణుడు అతడి ఇంటికి వెళ్లి తన రాకను తెలియజేశాడట. ఆ సమయంలో పుండలీకుడు తన తల్లిదండ్రులకు సేవ చేస్తూ అదే విషయాన్ని స్వామికి వివరించి తాను వచ్చేందుకు సమయం పడుతుందని చెప్పాడట. అప్పుడు స్వామి తాను ఎక్కడ ఉండాలని అడిగితే ఒక ఇటుక రాయిని స్వామివైపు విసిరి దానిపైన కూర్చోమన్నాడట. కన్నవారిపైన పుండలీకుడు చూపిస్తున్న ప్రేమ, చేస్తున్న సేవకు కరిగిపోయిన స్వామి ఆ ఇటుకరాయిపైనే నిల్చుండిపోయాడట. కాసేపటికి బయటకు వచ్చిన పుండలీకుడు స్వామిని పూజించి క్షమించమని కోరి ఆ తరువాత ఇక్కడే ఉండిపొమ్మంటూ వేడుకోవడంతో కృష్ణుడు ఆ ఇటుకమీదే శిలగా మారిపోయి విఠోబాగా, విఠల్‌గా, పాండురంగడిగా పూజలు అందుకుంటున్నాడనేది కథనం. పుండలీకుడితోపాటు చౌకామేళ, సంత్‌నామ్‌దేవ్, భక్త తుకారాం... వంటి భక్తులూ స్వామిపట్ల అపారమైన భక్తిని చాటుకున్నారు. అందుకే ఇక్కడ వాళ్లని దర్శించుకున్నాకే విఠలుడి మందిరానికి వెళ్లాలనేది నియమం.

ఉద్యమంలా సాగే యాత్ర...
పండరీపురానికి వచ్చే భక్తుల్లో ఏడాదంతా వచ్చే వర్గం ఒకటైతే... ఆషాఢ, కార్తిక, మాఘ, చైత్ర మాసాల్లో మాత్రమే బృందంగా వెళ్లే వర్గం ఇంకోటి. మిగిలిన మూడు మాసాలతో పోలిస్తే ఆషాఢంలో లక్షల సంఖ్యలో భక్తులు వెళ్లేందుకు సిద్ధమవుతారు. పండర్‌పూర్ ఆషాఢవారీగా పిలిచే ఈ యాత్రలో పిల్లలు, పెద్దలు, స్త్రీ- పురుషులు, వృద్ధులు ఇలా అందరూ పాల్గొంటారు. ఎనిమిదివందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ యాత్ర ఆషాఢ ఏకాదశికి దాదాపు ఇరవైఒక్కరోజుల ముందుగా ప్రారంభమవుతుంది. కాషాయ జెండాలనూ, సంగీత వాద్యాలనూ పట్టుకుని పాండురంగడి మహిమల్ని కీర్తిస్తూ, భజనలు పాడుతూ ఆలయానికి చేరుకునే ఈ భక్తుల్ని వార్కరీలని పిలుస్తారు. చెప్పుల్లేకుండా కాలినడకన ఆలయానికి వెళ్లే ఈ వార్కరీలు రోజుకు ఇన్ని కిలోమీటర్ల చొప్పున నడుస్తూ సాయంత్రానికి విశ్రాంతి తీసుకుని మరునాడు మళ్లీ నడక ప్రారంభిస్తారు.

గర్భగుడిలోకి వెళ్లొచ్చు...
పండరీపురానికి చేరుకునే భక్తులు ముందుగా చంద్రభాగా నదిలో స్నానమాచరించి ఆ తరువాత అక్కడే ఉన్న పుండలీకుడి మందిరానికి వెళ్తారు. పుండలీకుడిని దర్శించుకుంటే పాండురంగడిని కళ్లారా చూసిన ఫలితం దక్కుతుందని ఓ నమ్మకం. ఆ తరువాత ప్రధాన ఆలయానికి చేరుకునే భక్తులకు సంత్‌నామ్‌దేవ్ మహాద్వారం కనిపిస్తుంది. ఇక్కడ చౌకామేళ, సంత్‌నామ్‌దేవ్ విగ్రహాలనూ పూజిస్తారు. విఠలుడి భక్తుడైన చౌకమేళ భక్తుల కోర్కెలను స్వామివారికి చేరవేస్తాడని చెబుతారు. గర్భాలయంలోకి వెళ్లే క్రమంలో స్వామికి మరో భక్తుడైన తుకారాం పాదుకలనూ స్పృశిస్తారు భక్తులు. ఇవన్నీ పూర్తయ్యాకే పాండురంగడి గర్భగుడికి చేరుకోవాలి. అక్కడ ఎత్తైన పీఠంమీద పాండురంగడు రెండు చేతులూ నడుముమీద పెట్టుకుని ఠీవిగా నిల్చుని దర్శనమిచ్చే తీరును చూసి తరించాల్సిందే. ఇక్కడ భక్తులు గర్భగుడిలోకి వెళ్లి స్వామి పాదాల్ని స్పృశించి ఆనందించొచ్చు. ఆ తరువాత రుక్మిణితోపాటు ఇతర దేవతలనూ దర్శించుకుంటారు. ఇక, ఆషాఢ ఏకాదశి నాడు పాండురంగడు- రుక్మిణి-రాధ విగ్రహాలను ఊరేగించే వేడుక పూరీ రథయాత్రను తలపిస్తుంది. ఆషాఢ పౌర్ణమితో ఈ కార్యక్రమాలన్నీ ముగియడంతో ఆనందంగా వెనుతిరుగుతారు భక్తులు.

ఆధ్యాత్మిక చింతనలోనే...
- ఈ యాత్రలో పాల్గొనే వార్కరీలు, డిండీలు(భక్త బృందం) అనుక్షణం ధైవచింతనలోనే గడుపుతూ మితాహారం తీసుకుంటారు. వీళ్ళకోసం అన్నదాన కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించే సంస్థలూ ఉంటాయి.
- స్వామి భక్తులైన ధ్యానేశ్వర్ మహారాజ్, భక్త తుకారాం పాదుకల్ని ఆళంది, దేహుల నుంచి పల్లకిల్లో మోస్తూ వచ్చే భక్తులూ ఈ వారీలో కనిపిస్తారు.
- ఒకప్పుడు కేవలం మహారాష్ట్రకే పరిమితమైన ఈ యాత్రలో ఇప్పుడు తెలంగాణ, ఒడిశా, కర్ణాటక... తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పాల్గొంటున్నారు.
- ఈ పండర్‌పూర్ వారీలో మహిళలూ- ప్రకృతి సహజంగా వచ్చే నెలసరితో సంబంధం లేకుండా - ఉత్సాహంగా ముందుకు కదులుతుంటారు. అలా వచ్చే స్త్రీలకు ఏ ఇబ్బందీ కలగకుండా మహారాష్ట్ర ప్రభుత్వం నెలసరి సమయంలో అవసరమయ్యే సరంజామానూ అందించడం ఒక్క ఈ ఆధ్యాత్మిక యాత్రలోనే కనిపిస్తుంది.





ఫొటోలు: బాలాజీ ఫుగారె, ఈటీవీ భారత్, పండర్‌పూర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివి దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.







