సిల్లీపాయింట్‌

ప్రపంచంలో ‘కాల్‌ రికార్డింగ్‌’ సౌకర్యంలేని ఏకైక స్మార్ట్‌ఫోన్‌... ఐఫోనే! మిగతా ఫోన్‌లన్నీ ఈ వెసులుబాటుని అందిస్తాయి.

Updated : 11 Jun 2023 15:36 IST

ప్రపంచంలో ‘కాల్‌ రికార్డింగ్‌’ సౌకర్యంలేని ఏకైక స్మార్ట్‌ఫోన్‌... ఐఫోనే! మిగతా ఫోన్‌లన్నీ ఈ వెసులుబాటుని అందిస్తాయి.

*144 సెక్షన్‌... ఒక్క భారతదేశంలోనే కాదు పాకిస్థాన్‌లోనూ అదే నంబర్‌తో, అవే సబ్‌సెక్షన్‌లతో వాడతారు! నేర శిక్షాస్మృతి మనకూ వాళ్ళకూ దాదాపు ఒక్కటే. ప్రపంచంలో మరే రెండు దేశాలకూ ఇలా లేదు!

* మనం రోజూ ఓ 12 గంటలు నడవగలిగితే.... 690 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టి రావొచ్చు!

*సముద్రంలో టురిటోప్సిస్‌ డొహ్రిని అనే జెల్లీచేప ఉంటుంది. దీని జీవనచక్రంలో గుడ్డు, లార్వా, పైలప్‌, మెడుసా.. అనే నాలుగు దశలు ఉంటాయి. మెడుసా దశలోని జెల్లీచేపకి బాగా వయసైపోయినా, తీవ్ర గాయమైనా... శరీరం కొన్ని కణాలుగా విడిపోతుంది. వాటినుంచి పైలప్‌ దశలో ఉండే కొత్త జీవులు పుడతాయి. అలా మరణమన్నదే లేకుండా ఎంతకాలమైనా బతగ్గలదు... ఏదైనా పెద్ద చేప దాన్ని మింగేస్తే తప్ప.

* మన రక్తంలో ఇనుమే కాదు... రాగి, బంగారం కూడా ఉంటాయి.

* రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ బైకుల తయారీకి ముందు బ్రిటిష్‌ పోలీసులకి ఎన్‌ఫీల్డ్‌ పేరుతో రైఫిళ్ళు తయారుచేసి ఇస్తుండేది. ప్రస్తుతం మన పోలీసుల దగ్గర ఉండేవి
ఆ ఎన్‌ఫీల్డ్‌ రైఫిళ్లే!

* కొందరికి కొత్త పుస్తకాల నుంచి వచ్చే వింతైన పరిమళం ఇష్టం! అన్నట్టు ఆ ఇష్టానికి ఓ పేరు కూడా ఉంది... అది బైబ్లియోస్మియా!

* ప్రపంచంలో రాశిఫలాలని నమ్మనివారు... కేవలం 10 శాతమేనట!

* స్లీపర్‌ బస్సుల్ని యూరప్‌లో బ్యాండ్‌ బస్సులంటారు. సంగీత కచేరీలు చేసే బ్యాండ్‌లు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తాయి కాబట్టి... అలా పిలుస్తారు!

* మనం ఏదైనా తింటూ... శ్వాస తీసుకోలేం!


సచిన్‌ పైలట్‌... అసలు ఇంటి పేరు బిధూరి. వాళ్ళ నాన్న రాజేశ్వర్‌ ప్రసాద్‌ బిధూరి పైలట్‌గా పనిచేసేవారు. 1980ల్లో ఎన్నికల్లో పోటీచేసేటప్పుడు తన పేరుని రాజేశ్‌ పైలట్‌ అని రాసుకున్నాడు. అప్పటి నుంచి అదే వాళ్ళ ఇంటి పేరైంది!


మరచెంబులూ సీసాలూ రాకమునుపు పల్లెల్లో సొరకాయబుర్రని తాగునీరు తీసుకెళ్ళడానికి వాడేవారు! వింతేమిటంటే- ఇప్పుడు వాటికి ఈ-కామర్స్‌లోనూ మంచి డిమాండు ఉంది. ఐదొందల నుంచి పదిహేను వందల రూపాయలకు అమ్ముతున్నారు.


పీసా టవర్‌ 1990 వరకూ 5.5 డిగ్రీల వరకూ వాలిపోయి ఉండేది. పదేళ్ళపాటు ఎంతో శ్రమించి అతి కష్టంపైన దాన్ని నాలుగు డిగ్రీలకి తగ్గించగలిగారు.


‘పల్సర్‌’... అంతరిక్షంలోని ఓ రకం నక్షత్రాలకున్న పేరు! ఇవి చాలా వేగంగా తిరుగుతాయంటారు. అందుకే, బజాజ్‌ కంపెనీ బైకులకి ఆ పేరు పెట్టారు.


పెంగ్విన్‌, ఈము, ఆస్ట్రిచ్‌, కివి... ఇవన్నీ రెక్కలున్నా ఎగరలేని పక్షులు. వీటిల్లో పెంగ్విన్‌కి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. అది ఎగరలేకున్నా ఏటా వందమైళ్ళు సుదూరప్రాంతాలకి వలస వెళ్తుంది!


ఐస్‌లాండ్‌ జాతీయ చిహ్నంలో... ఓ పక్షి, మృగం, డ్రాగన్‌, ఓ మనిషీ ఉంటారు. ప్రపంచంలో మరే జాతి చిహ్నంలోనూ ఇన్ని విభిన్న జీవజాతుల్ని చూడలేము!


బ్రిటిష్‌ రాజ వంశీయులకు అంగరక్షకులుగా ఉండేవారు ఎలుగుబంటి బొచ్చుతో చేసిన అడుగున్నర పొడవుండే బియర్‌స్కిన్‌ టోపీని మాత్రమే వాడాలి! కానీ, భారత సంతతి సిక్కులకి మాత్రం అందులో మినహాయింపు ఉంది. వాళ్ళు తమ తలపాగా వాడితే చాలు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..