subodh: సైకిల్‌పై దేశమంతా చుట్టేసి..

Eenadu icon
By Features Desk Updated : 01 Nov 2025 04:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

దేశమంటే ప్రేమ.. 
ఫిట్‌నెస్‌ అంటే పిచ్చి..
ప్రకృతి మీద మమకారం..
ఏదో సాధించాలనే తపన..
సొంత లక్ష్యాల కంటే నలుగురి కోసం పని చేయాలనే ఆసక్తి.. ఇవన్నీ ఇతడిలో ఉన్నాయ్‌. అతడే మహారాష్ట్రకు చెందిన సుబోధ్‌.

యువత కెరియర్‌ పోరులో పరుగులు పెడుతుంటారు.. కానీ సుబోధ్‌ సైకిల్‌ హ్యాండిల్‌ చేతపట్టాడు. సాఫ్ట్‌వేర్‌ కొలువులు చేద్దామా, గవర్నమెంట్‌ జాబ్‌ కొడదామా అని ఆలోచనలో ఉంటారు.. కానీ ఆ సైకిల్‌నే తన లక్ష్యసాధనకు సాధనంగా చేసుకున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 28 రాష్ట్రాల్లో సైకిల్‌ యాత్ర చేయాలని తలపెట్టాడు. కేవలం ఆలోచనే కాదు, గత కొన్నాళ్లుగా అదే పనిలో ఉన్నాడు. ఇదంతా తను ఎందుకు చేస్తున్నాడో తెలుసా? అందరిలో పర్యావరణం పట్ల ప్రేమ, దేశం మీద భక్తి, శారీరక దృఢత్వం మీద అవగాహన కల్పించడానికి! ఈ అబ్బాయి ప్రయాణం విచిత్రంగా ఉంది కదూ.. అందుకే ఇంకా వివరంగా తెలుసుకుందాం.

సుబోధ్‌ వయసు 26 ఏళ్లు. ఇప్పటివరకూ 9 రాష్ట్రాల మీదుగా సైకిల్‌ తొక్కాడు. మొత్తం 495 రోజుల యాత్ర పూర్తి చేసుకున్నాడు. ఇటీవలే గుజరాత్‌లోని మహేసనా నగరానికి చేరుకున్నాడు. మొదట లద్దాఖ్‌ పర్వత ప్రాంతం నుంచి ఈ ‘సంకల్ప్‌ యాత్ర’ను ప్రారంభించాడు. తన యాత్ర లక్ష్యం కేవలం సైకిల్‌పై తిరగడం మాత్రమే కాదు. మాతృభూమిని పచ్చగా చూడాలనే గొప్ప సంకల్పం దీని వెనక దాగుంది. అంతేకాదు, యువతలో దేశభక్తిని పెంపొందించడం, ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించడమూ ఈ యాత్రలో అంతర్భాగం. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా లక్ష మొక్కలు నాటాలని నిర్ణయించుకుని ఆ దిశగా  కృషిచేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని భావిస్తున్నాడు.

2027 నాటికి ఈ యాత్ర పూర్తయిన తర్వాత చివరగా ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు సుబోధ్‌. మొత్తంగా 950 రోజుల్లో 28 రాష్ట్రాల్లో పయనించాలనేది తన ప్రణాళిక. ఇందుకోసం దాదాపు లక్ష కిలో మీటర్లు ప్రయాణించనున్నాడు.

స్ఫూర్తిదాయకం

దేశం కోసం ఏమైనా చేయాలనే ఉద్దేశాన్ని యువతకు ప్రబోధిస్తూ.. దేన్ని సాధించాలన్నా శారీరక పటుత్వం ఎంత ప్రధానమైన అంశమో వివరిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలని చెబుతున్న ఈ యువకుడి యాత్ర ఎంతో స్ఫూర్తిదాయకం. తను అనుకున్న లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని మనమూ కోరుకుందాం! 


Published : 01 Nov 2025 01:30 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు