Deputy cm pawan kalyan: ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా పులికాట్
ఎకో టూరిజానికి గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్

ఈనాడు, అమరావతి: తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సును ఎకో టూరిజానికి గమ్యస్థానంగా.. ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఏటా నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్‌ను ఈ సారి మూడు రోజులతో సరిపెట్టేయకుండా, ఎకో టూరిజాన్ని ప్రోత్సహించేలా అటవీశాఖ ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ, పక్షుల వీక్షణ, ఎకో క్లబ్‌ల ఏర్పాటు వంటి వివిధ కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. ‘పులికాట్‌కు సైబీరియన్ పక్షులైన ఫ్లెమింగోల రాక మొదలైంది. ఆహారం, విశ్రాంతి నిమిత్తం ఈ పక్షులు 6 నెలల పాటు పులికాట్ పరిసరాల్లోనే ఉంటాయి. ఈ నీటి పక్షులను ఆహ్వానిస్తూ ఏటా ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహించుకుంటున్నాం. రాష్ట్రం నలుమూలల నుంచి ఏటా 7-8 లక్షల మంది పక్షి ప్రేమికులు హాజరవుతున్నారు.

రాజహంసలుగా పిలుచుకునే ఈ పక్షులు జీవవైవిధ్యానికి ప్రతీకలు. ఏటా అక్టోబరులో వచ్చి మార్చిలో తిరిగివెళ్లిపోయే ఈ అతిథి పక్షులు.. ఈ మధ్య ఏడాది పొడవునా కనువిందు చేస్తున్నాయి. ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా ఫ్లెమింగోలు పులికాట్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేలా అటవీశాఖ ఆధ్వర్యంలో అనువైన పరిస్థితులు కల్పిస్తున్నాం. మొంథా తుపానుకు ముందు నుంచే ఫ్లెమింగోల రాక మొదలైంది. పెనుగాలులు, భారీ వర్షాలకు, వాటి స్థావరాలకు ఇబ్బంది కలగకుండా అటవీశాఖ ఆధ్వర్యంలో తగిన చర్యలు చేపట్టాం. రాబోయే మూడు నెలలు వాటి రక్షణపై మరింత శ్రద్ధ పెడతాం’ అని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.
ఏనుగుల కదలికలపై సంకేతాలు: మానవ, వన్యప్రాణి సంఘర్షణను నిలువరించేందుకు ఏఐ, మెషిన్ లెర్నింగ్ విధానంతో పనిచేసే సరికొత్త వ్యవస్థను చిత్తూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు పవన్‌కల్యాణ్ తెలిపారు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ఈ సాంకేతిక వ్యవస్థను మోహరించామని అన్నారు. సౌరశక్తితో పనిచేసే ఈ వ్యవస్థ ఏనుగుల సంచారాన్ని గుర్తించడంతో పాటు వాటిని స్వల్పంగా భయపెడుతుందని, ఏనుగుల కదలికలను గమనించిన వెంటనే అటవీ శాఖాధికారులకు హెచ్చరిక సంకేతాలు పంపిస్తుందని చెప్పారు. తద్వారా అటు మనుషులు, ఇటు వన్యప్రాణులకు ఇది రక్షణ వ్యవస్థలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ‘120 డిగ్రీల పరిధిలో 60 మీటర్ల మేర సున్నిత ప్రాంతాలను ఈ వ్యవస్థ నిరంతరం పర్యవేక్షిస్తుంది. వన్యప్రాణుల వల్ల జరిగే పంట నష్టాన్ని నివారించడంతో పాటు మనుషులు- ఏనుగుల మధ్య సంఘర్షణను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది’ అని పవన్‌కల్యాణ్ అన్నారు. జనావాసాల్లోకి వచ్చే అటవీ ఏనుగులను తరిమికొట్టేందుకు ఇప్పటికే కర్ణాటక నుంచి తీసుకొచ్చిన కుంకీ ఏనుగులతో చేసిన ఆపరేషన్లు సత్ఫలితాలు ఇచ్చాయని అన్నారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి అధికారిక ఎక్స్ ఖాతాలో ప్రకటన విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


