Polavaram: ఎగువ కాఫర్‌ డ్యాంపై భయం అక్కర్లేదు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 30 Aug 2025 03:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండండి
దిగువ కాఫర్‌ డ్యాం లీకేజిని గమనించాలి
డాక్యుమెంటేషన్‌ మెరుగుపడాలి: విదేశీ నిపుణుల బృందం
ఈనాడు - అమరావతి 

ఫొటో ప్రదర్శనను పరిశీలిస్తున్న విదేశీ నిపుణులు

పోలవరం ప్రాజెక్టులో భాగమైన ఎగువ కాఫర్‌ డ్యాం ఎడమ వైపున ఎగువ ప్రాంతంలో ఇటీవల కొంత కుంగడంపై భయపడాల్సిన అవసరం లేదని విదేశీ నిపుణుల బృందం భరోసా ఇచ్చింది. ఇప్పటికే బట్రస్‌ డ్యాం నిర్మాణం పూర్తిచేసినందున పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలని, అవసరమైతే తగిన చర్యలు చేపడదామని పేర్కొంది. దిగువ కాఫర్‌ డ్యాంలో 200 మీటర్ల వద్ద నీరు లీకవుతున్న ప్రాంతాన్ని నిత్యం గమనిస్తూ ఉండాలని నిపుణులు సూచించారు. వచ్చే సీజన్‌ నాటికి ఈ సమస్య పరిష్కారంపై దృష్టి సారిద్దామన్నారు. పోలవరం విదేశీ నిపుణుల బృందం శుక్రవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. విదేశీ నిపుణులు డిసిస్కో, రిచర్డ్‌ డొన్నెల్లీ, డేవిడ్‌ పాల్‌లతో పాటు పోలవరం అథారిటీ కార్యదర్శి రఘురామ్, కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కమిషనర్‌ గౌరవ్‌ సింఘాల్, కేంద్రజలసంఘం సీఈ బక్షి, డైరెక్టర్‌ రాకేష్‌ తదితరులు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. జలవనరులశాఖ ఈఎన్‌సీ నరసింహమూర్తి దగ్గరుండి ప్రాజెక్టు పనులనుచూపించారు. సమస్యలు ప్రస్తావిస్తూ వాటి పరిష్కారాలపై చర్చించాల్సిన అవసరాన్ని తెలియజేశారు.

  • ‘పోలవరంలో ఎలాంటి అధ్యయనాలు చేసేందుకైనా అభ్యంతరం లేదు. ఆకృతులు త్వరగా ఖరారుచేయాలి. 2027 డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తిచేయాలనే గడువును అందరూ గుర్తుంచుకోవాలి’ అని ఈఎన్‌సీ నరసింహమూర్తి కోరారు.
  • గ్యాప్‌ 1, గ్యాప్‌ 2 ప్రధాన డ్యాంల మధ్య ఉన్న జి హిల్‌ ఎంతమేర తగ్గించాలనేది పరిస్థితులను బట్టి స్థానికంగా నిర్ణయించుకోవాలని విదేశీ నిపుణులు పేర్కొన్నారు. ఈ కొండలో మంచి రాయి ఉందన్న విషయాన్ని అధికారులు చెప్పారు. మొత్తం అంతా అదే రాయి ఉందా లేదా అన్నది పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 
  • ప్రస్తుతం గ్యాప్‌ 1 ప్రధాన డ్యాంలో రాళ్లు నింపుతున్నారు. 15 మీటర్ల స్థాయి నుంచి 17 మీటర్ల స్థాయి వరకు వచ్చింది. 25 మీటర్ల స్థాయి వరకు రాళ్లు నింపి, అగాథాలు పూడ్చాక ప్రధాన డ్యాం నిర్మాణం ప్రారంభమవుతుంది. ఆ స్థాయికి రాళ్లు నింపేందుకు మరో నెల పడుతుందని అధికారులు వివరించారు.
  • ప్రధాన డ్యాం నిర్మాణం కోసం మీనియేచర్‌ తరహా కట్టడం నిర్మాణానికి వర్షాలు ఇబ్బందిగా మారినందున, వర్షాలు తగ్గేవరకు ఆగదలుచుకున్నామని పోలవరం అధికారులు నిపుణులకు తెలిపారు. 
  • పోలవరంలో చేసే పని డాక్యుమెంటేషన్‌ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, దానిపై దృష్టిసారించాలని నిపుణులు కోరారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు