‘పోలవరం’గ్యాప్‌ 1 ప్రధాన డ్యాం డిజైన్లపై పీపీఏ సీఈవో, ఈఎన్‌సీ భేటీ

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 05 Apr 2025 06:22 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఈనాడు-అమరావతి: పోలవరం ప్రాజెక్టులో గ్యాప్‌ 1 ప్రధాన డ్యాం డిజైన్లపై శుక్రవారం సమగ్ర చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టు అధారిటీ సీఈవో అతుల్‌జైన్‌ విజయవాడ వచ్చి జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ నరసింహమూర్తి తదితర అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ డిజైన్ల అంశంతో పాటు, నాణ్యత పరీక్షలు నిర్వహించే స్వతంత్ర ల్యాబ్‌ ఏర్పాటు, పోలవరం పునరావాసం వంటి అంశాలపైనా చర్చ జరిగింది. ప్రస్తుతం పోలవరంలో గ్యాప్‌ 1 ప్రధాన డ్యాంలో అబట్‌మెంట్‌ పనులు సూత్రప్రాయ డిజైన్ల అంగీకారంతో ప్రారంభమయ్యాయి. కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజినీరు రమేష్‌కుమార్‌ రాజమహేంద్రవరంలో పోలవరం అథారిటీ కార్యాలయంలో అందుబాటులో ఉంటూ ఈ ఆకృతులపై ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారు. వారి అనుమతి మేరకు పనులు ప్రారంభించారు. ఆ పనికి సంబంధించిన డిజైన్లు శుక్రవారం సిద్ధమయ్యాయి.

వాటిని పోలవరం అథారిటీకి సమర్పించారు. గ్యాప్‌ 1 ప్రధాన డ్యాం ప్రధాన పనుల డిజైన్లు మరో 3, 4 రోజుల్లో సిద్ధమవుతాయి. వాటిని పోలవరం అథారిటీ ద్వారా కేంద్ర జలసంఘానికి సమర్పిస్తారు. అవసరమయితే విదేశీ నిపుణులతోనూ చర్చించి వాటిని ఖరారు చేస్తారు. ఈ లోపు ప్రాథమికంగా పనులు జరుగుతుంటాయి. పోలవరంలో ఇప్పటికే గుత్తేదారు సంస్థ ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో పనుల నాణ్యతపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. జలవనరులశాఖ తరపున కూడా ప్రత్యేకంగా ఒక స్వతంత్ర ల్యాబ్‌ను ఏర్పాటు చేసి నాణ్యత పరీక్షలు చేయాలని పోలవరం అథారిటీ సీఈవో అతుల్‌జైన్‌ కోరారు. గతంలో విదేశీ నిపుణుల బృందం చేసిన సిఫార్సుల్లో ఇది కూడా ఉంది. హైదరాబాద్‌కు చెందిన ఒక సంస్థతో తాము మాట్లాడామని, త్వరలోనే ఈ ల్యాబ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేశారు. పోలవరం పునరావాసం, భూసేకరణ వంటి అంశాల్లో పురోగతిపైనా చర్చలు జరిగాయి.

కృష్ణా బోర్డుకు ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా ఉన్న అతుల్‌జైన్‌ నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుపై పోలీసుల భద్రత ఏర్పాటు తదితర అంశాలపైనా చర్చించారు. ఇప్పటి వరకు ఉన్న సీఆర్‌పీఎఫ్‌ను ఉపసంహరించుకున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చలు జరిగాయి.

Tags :
Published : 05 Apr 2025 05:14 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు