‘మరాఠ్వాడా’ తెలియక తికమక!

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 04 Aug 2025 04:10 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

నాటి రెవెన్యూ పరిభాషను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు
పోలవరం భూసేకరణలో ఇదే కీలకం

కుక్కునూరు, న్యూస్‌టుడే: పోలవరం భూసేకరణలో మరాఠ్వాడా ప్రాంతపు భాష అధికారులను తికమక పెడుతోంది. ప్రాజెక్టు ముంపులో పరిధిలో ఉన్న మండలాల్లో ఇప్పటికే భూసేకరణ చేపట్టగా, ఇంకా కొంత సేకరించాల్సి ఉంది. ఆయా మండలాల్లోని భూ చిత్రపటాలు (నక్షా) మరాఠీ భాషలోనే ఉన్నాయి. వాటిల్లోని అంకెలు, ఇతర వివరాలు ఆ భాష తెలిసిన వారికే అర్థమవుతాయి. అందుకోసం గతంలో చేపట్టిన భూసేకరణలో తెలంగాణలో పనిచేసి పదవీ విరమణ చేసిన కొందరు అధికారులు, సర్వేయర్లను ఒప్పంద పద్ధతిపై వినియోగించుకున్నారు. వైకాపా ప్రభుత్వంలో భూసేకరణ మరుగున పడటంతో వారిని తొలగించారు. ప్రస్తుతం తిరిగి భూసేకరణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 41.15 కాంటూరు స్థాయిలో నీరు నిలిపేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. ఆ స్థాయిలో ముంపునకు గురయ్యే గ్రామాలను ఖాళీ చేయించాలి. అక్కడి మిగులు భూములను సేకరించాలి. గిరిజన రైతులకు భూములిచ్చేందుకు కూడా భూసేకరణ చేయాలి. దీంతో మళ్లీ మరాఠీ తెలిసిన అధికారులు, ఉద్యోగుల అవసరం కన్పిస్తోంది. స్వాతంత్య్రానికి పూర్వం కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాలు పాల్వంచ పర్కనాలో నైజాం పాలనలో ఉండేవి. ఇక్కడ ఉర్దూ, మరాఠీ భాషల్లో దస్త్రాలు తయారయ్యాయి. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ)ను గిర్దావర్, డిప్యూటీ తహసీల్దార్‌ (డీటీ)ని నాయబ్‌ తహసీల్దార్‌గా సంబోధించేవారు. ఇక రికార్డుల్లో మెట్టభూమిని ‘ఖుష్కీ’గా, మాగాణిని ‘తరి’గా నమోదు చేసేవారు. రెవెన్యూ గ్రామాన్ని ‘మౌజే’ అనేవారు. అడంగల్‌ను పహాణీ, పైసల్‌ పట్టీ పేర్లతో రెవెన్యూ దస్త్రాలు ఉండేవి. ప్రస్తుతం ఈ పేర్లను మార్చి పలుకుతున్నా, భూ చిత్రపటం మరాఠీలోనే ఉండటంతో తెలంగాణ అధికారుల సహాయాన్ని ఆశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని