కొత్త గైడ్‌బండ్‌ నిర్మించాల్సిందే!

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 19 Sep 2025 06:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

పోలవరం ప్రాజెక్టుపై విదేశీ నిపుణుల బృందం సిఫార్సు 

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్పిల్‌ వే రక్షణకు, ప్రవాహ ఇబ్బందులను నిరోధించేందుకు నిర్మించిన గైడ్‌బండ్‌ ధ్వంసం కావడంతో ఆ స్థానే కొత్తది నిర్మించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టును తాజాగా సందర్శించిన విదేశీ నిపుణుల బృందం.. సాధ్యమైనంత త్వరగా ఈ అంశంపై ఒక వర్క్‌షాపు నిర్వహించాలని సిఫార్సు చేసింది. గైడ్‌బండ్‌ నిర్మాణంలో భాగంగా నిర్మించిన కట్‌ ఆఫ్‌ వాల్‌ ధ్వంసమైంది. ఫలితంగా గైడ్‌బండ్‌ కుంగిపోయింది. తాత్కాలికంగా మరమ్మతులు చేసినా.. ఆ కట్టడం స్థానే కొత్తగా గైడ్‌బండ్‌ నిర్మించాలని నిపుణులు సిఫార్సు చేశారు. 2027 డిసెంబరు నాటికే ఇవన్నీ పూర్తి చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. పుణెలోని పరిశోధనా కేంద్రంలో స్పిల్‌ వే 3డీ నమూనా రూపొందించి చేసిన అధ్యయనాల మేరకు ఇక్కడ స్పిల్‌ వే ఎడమ వైపున ప్రవాహంలో సుడి గుండాలను గుర్తించారు. అది డ్యాం కట్టడంపై ప్రభావం చూపే ఆస్కారం ఉండటంతో ప్రత్యామ్నాయంగా గైడ్‌బండ్‌ నిర్మాణాన్ని ప్రతిపాదించారు.

డి వాల్‌ లోపమే ప్రధాన సమస్య..

గతంలో ఈ గైడ్‌బండ్‌ నిర్మాణానికి రూ.83 కోట్లు వెచ్చించారు. 2021 నుంచి 2023 మధ్య నిర్మాణం చేపట్టారు. 2023 జూన్‌లో గైడ్‌బండ్‌ కుంగిపోయింది. అప్పట్లోనే కేంద్ర జలసంఘం విశ్రాంత ఛైర్మన్‌ పాండ్యా నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని నియమించింది. వారు స్పష్టమైన నివేదిక ఇచ్చారు. గైడ్‌బండ్‌ను పునరుద్ధరించాల్సి ఉందని తేల్చిచెప్పారు. గైడ్‌బండ్‌ నిర్మాణంలో భాగంగా నిర్మించిన డయాఫ్రం వాల్‌ (కట్‌ ఆఫ్‌ వాల్‌) నిర్మాణం డిజైన్‌ లోపాలతో ఈ కట్ట కుంగిపోయింది. ఆ కుంగుదలను తాత్కాలికంగా నిలుపుదల చేయడానికి బట్రస్‌ డ్యాం తరహాలో కొంత అడ్డుకట్ట వేసినా అది గైడ్‌బండ్‌ను పటిష్ఠం చేసే స్థాయిలో లేదు. దీంతో ప్రస్తుత కట్టడానికి ఎగువన కొత్త గైడ్‌బండ్‌ నిర్మించే విషయాన్ని ఆలోచిస్తున్నారు. తాజాగా విదేశీ నిపుణుల బృందం పోలవరం సందర్శన సమయంలో ఈ అంశం చర్చకు వచ్చింది. పాత గైడ్‌బండ్‌ డిజైన్‌ సరిగా లేదని కూడా వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్‌సీ డయాఫ్రం వాల్‌ ప్యానళ్లన్నీ సరిగా అనుసంధానించ లేకపోవడంతో నాడు సమస్య ఏర్పడింది. గైడ్‌బండ్‌లో భాగంగా నిర్మించిన డయాఫ్రం వాల్‌ వంగిపోయింది. 0.60 మీటర్ల నుంచి 11.98 మీటర్ల మేర వంగిపోవడంతో గైడ్‌బండ్‌ కుంగిపోయిందనేది ప్రధానాంశం. ఆర్‌సీసీ కట్‌ ఆఫ్‌ వాల్‌లో మొత్తం 105 ప్యానళ్లు ఉండగా 42 ప్యానళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని కూడా తేలింది.

Tags :
Published : 19 Sep 2025 05:09 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు