Andhra News: ఏపీ హోం మంత్రి పీఏ జగదీష్‌పై వేటు

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 04 Jan 2025 08:23 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఆయనపై అక్రమ వసూళ్లు, సెటిల్‌మెంట్లు, అవినీతి ఆరోపణలు 
అనిత అండతోనే అరాచకాలు కొనసాగిస్తున్నారని విస్తృత ప్రచారం
ఆరోపణలు, ఫిర్యాదులను పెద్దగా పట్టించుకోని మంత్రి
ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు 
ఎట్టకేలకు పీఏగా తొలగింపు

ఈనాడు, అమరావతి: హోం మంత్రి వంగలపూడి అనిత వద్ద ప్రైవేటు పీఏగా పనిచేస్తున్న సంధు జగదీష్‌పై వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను ఆ పోస్టు నుంచి తొలగించారు. బదిలీలు, పోస్టింగులు, సిఫార్సుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, సెటిల్‌మెంట్లు చేస్తున్నారని జగదీష్‌పై తొలి నుంచీ ఆరోపణలున్నాయి. ఆయన వ్యవహార శైలి, ప్రవర్తన దురుసుగా ఉందంటూ తెదేపా శ్రేణులు, అనితను వివిధ పనులపై కలవటానికి వచ్చిన వారు తొలినుంచీ అసంతృప్తిగా ఉన్నారు. జగదీష్‌ గత పదేళ్లుగా అనిత వద్ద ప్రైవేటు పీఏగా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై.. ఆమె హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగదీష్‌ ఎంత పెద్ద నాయకుడినైనా ఖాతరు చేసేవారు కాదు.

మంత్రి తర్వాత తానే అన్నట్లు వ్యవహరించేవారు. ఎన్ని విమర్శలొచ్చినా అనిత ఆయన్ను పీఏగా తొలగించలేదు. దీంతో ఆమె అండదండలతోనే ఆయన ఈ అరాచకాలు, అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్నారని విస్తృత ప్రచారం సాగింది. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అనిత.. జగదీష్‌ను పీఏగా తొలగించారు. ఈ విషయాన్ని ఇటీవల పాయకరావుపేట నియోజకవర్గ తెదేపా కార్యకర్తల సమావేశంలో ఆమె బహిరంగంగానే వెల్లడించారు. దీంతో నియోజకవర్గంలోని క్యాడర్, జగదీష్‌ బాధితులు సంబరాలు చేసుకున్నారు. 

‘ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ బెదిరింపు

జగదీష్‌ లెక్కలేనితనం, అరాచకాల్ని సహించలేకపోయిన ఎస్‌.రాయవరం మండలానికి చెందిన తెదేపా నాయకులు కొందరు ఆయన అక్రమాలపై అంతర్గతంగా ఓ సమావేశం పెట్టుకున్నారు. ఆయన తీరును హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జగదీష్‌ ఆ సమావేశంలో పాల్గొన్న నాయకులకు ఫోన్‌ చేసి.. ‘ఏం చేసుకుంటారో.. చేసుకోండి’ అంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడారు. దీంతో హోం మంత్రికి భయపడి.. వారెవరూ అప్పట్లో నోరు విప్పలేకపోయారు.  

పేకాట శిబిరాలు.. మద్యం దుకాణాల్లో వాటాలు!

  • ఎస్‌.రాయవరం మండలంలోని రెండుచోట్ల దాదాపు నెల రోజులపాటు, పాయకరావుపేట మండలంలో పాల్విన్‌పేటల్లో కొన్ని రోజులపాటు పేకాట శిబిరాలు నడిచాయి. జగదీష్‌ మద్దతుతోనే వీటిని నడిపించారనే ఆరోపణలున్నాయి. అప్పట్లో పత్రికల్లో కథనాలు రావటంతో.. ఈ పేకాట శిబిరాల్ని తాత్కాలికంగా నిలిపేశారు. 
  • మద్యం దుకాణాల్లో వాటాల కోసం ఎక్సైజ్‌ అధికారుల ద్వారా లైసెన్సుదారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని జగదీష్‌పై ఆరోపణలు ఉన్నాయి.
  • హోం మంత్రికి సంబంధించిన తిరుమల దర్శనం సిఫార్సు లేఖలను సైతం జగదీష్‌ తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్‌కు గంపగుత్తగా అమ్మేశారని ఆరోపణలు వినిపించాయి.
Tags :
Published : 04 Jan 2025 04:13 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని