Polavaram: పోలవరం పనుల తీరుపై సంతృప్తి

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 01 Sep 2025 04:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ముగిసిన విదేశీ నిపుణుల బృందం సమీక్ష

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో బట్రస్‌ డ్యాం, డయాఫ్రం వాల్‌ పనులు సంతృప్తికరంగా ఉన్నాయని విదేశీ నిపుణుల బృందం వ్యాఖ్యానించింది. వానాకాలంలో పనులు బాగా చేశారని ప్రశంసించింది. ‘నాలుగో పర్యటన సమయంలో డ్యాం నిర్మాణ ప్రాంతంలో అంతా సీపేజీ నీరే ఉంది. రెండు నెలల్లో ఆ నీరంతా తోడి, నిర్మాణ క్షేత్రాన్ని సరైన స్థితిలోకి తీసుకువచ్చి పనులు చేయగలుగుతారని మేం భావించలేదు. అందుకు విరుద్ధంగా అంతా చక్కగా చేశారు. పనులు సంతృప్తికరంగా ఉన్నాయి. ఇలాగే సాగితే మార్చి నాటికి డయాఫ్రం వాల్‌ పనులు పూర్తిచేయడం సులభమే’ అని విదేశీ నిపుణులు పేర్కొన్నారు. బట్రస్‌ డ్యాం నిర్మించాలని విదేశీ నిపుణుల బృందం ఇచ్చిన సలహా తమకు ఎంతో ఉపయోగపడిందని, అందువల్లే వానాకాలంలో, వరద సీజన్‌లో ఎలాంటి సమస్య రాకుండా పనులు చేయగలిగామని పోలవరం అధికారులు ఆ బృందానికి తెలియజేశారు.

విదేశీ నిపుణుల బృందం మూడోరోజు సమీక్ష రాజమహేంద్రవరంలో నిర్వహించారు. మూడోపక్ష ల్యాబ్‌ కూడా చక్కగా ఏర్పాటుచేశారని, అందులో పరికరాలు బాగున్నాయని ఆ బృందం పేర్కొంది. ఈ సమావేశంలో నిపుణులు డిసిస్కో, రిచర్డ్‌ డొన్నెల్లీ, డేవిడ్‌ పాల్‌లు పాల్గొన్నారు. వీరితో పాటు పోలవరం అథారిటీ కార్యదర్శి రఘురామ్, కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కమిషనర్‌ గౌరవ్‌ సింఘాల్, కేంద్ర జలసంఘం సీఈ బక్షి, మరో సీఈ రమేష్‌బాబు, ఈఎన్‌సీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

డీప్‌ సాయిల్‌ మిక్సింగ్‌ మెథడాలజీకి ఓకే 

పోలవరం ప్రాజెక్టులో భారీ వరదల వల్ల నేల స్వభావం మారిపోయింది. అక్కడ డీప్‌ సాయిల్‌ మిక్సింగ్‌ చేయాలి. ఆ మెథడాలజీకి విదేశీ నిపుణుల బృందం సూత్రప్రాయంగా ఆమోదం తెలియజేసింది. అయితే మరో విధానాన్ని కూడా ఒక నిపుణుడు ప్రతిపాదించి అందులోని లాభనష్టాలు అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. దాదాపు 550 మీటర్ల మేర డీప్‌ సాయిల్‌ మిక్సింగ్‌ చేయాల్సి ఉంటుంది. 12 నుంచి 16 మీటర్ల లోతు వరకు చేయాలి. వైబ్రో కాంపాక్షన్‌ పనులకు సంబంధించి తిరుపతి ఐఐటీ చేసిన అన్ని పరీక్షల ఫలితాలు సమర్పించారు. తాము అధ్యయనం చేసిన తర్వాత అభిప్రాయాలు తెలియజేస్తామని విదేశీ నిపుణులు పేర్కొన్నారు.

Tags :
Published : 01 Sep 2025 03:38 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు