NEET UG 2025: ‘నీట్‌’లో ఫిజిక్స్‌ ప్రశ్నలు అత్యంత కఠినం

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 05 May 2025 07:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ స్థాయిలో రావడంతో బెంబేలెత్తిపోయిన విద్యార్థులు
ఇదే తొలిసారంటున్న నిపుణులు

చిట్టినగర్‌ పొట్టిశ్రీరాములు చలువాది మల్లికార్జునరావు ఇంజినీరింగ్‌ కళాశాల కేంద్రంలో అభ్యర్థి కాలర్‌ను కత్తిరిస్తున్న సిబ్బంది

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-కానూరు: నీట్‌-2025 (యూజీ)లో ఫిజిక్స్‌ ప్రశ్నలు అత్యంత కఠినంగా వచ్చాయి. నిర్ణీత వ్యవధిలో వీటికి జవాబులు గుర్తించలేక విద్యార్థులు హైరానాకు గురయ్యారు. నీట్‌ ప్రవేశపెట్టాక తొలిసారి ఫిజిక్స్‌లో ఇంత కఠినంగా ప్రశ్నలు ఇచ్చారని, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ స్థాయిలో ఈ ప్రశ్నలు ఉన్నాయని కోచింగ్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆదివారం జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో దేశవ్యాప్తంగా నీట్‌-2025 జరిగింది. రాష్ట్రంలో ఉదయం నుంచే పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల సందడి కనిపించింది. వాచ్‌లు, ఇతర గ్యాడ్జెట్లను లోపలికి తీసుకువెళ్లేందుకు అనుమతించలేదు. అకాల వర్షం, ట్రాఫిక్‌ సమస్యలతో కొన్ని చోట్ల విద్యార్థులు వారి కేంద్రాలకు చేరుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. వివిధ కేంద్రాల వద్ద ఆలస్యమైన వారిని అనుమతించకపోవడంతో అభ్యర్థులు కన్నీటి పర్యంతమై వెనుదిరిగారు.

బోటనీలో 50 ప్రశ్నలు

బయాలజీ విభాగంలో బోటనీ నుంచి 50 ప్రశ్నలు వచ్చాయి. ఆ సబ్జెక్టుపై పట్టు ఉన్న విద్యార్థులకు ఇది కలిసొచ్చింది. రీజన్‌ అండ్‌ అసెర్షన్, మ్యాచింగ్‌ ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చారు. మధ్యస్థంగా ఉండే ప్రశ్నలు సగానికి పైగా ఇచ్చారు. జువాలజీలో ఇచ్చిన ‘రీప్రొడక్షన్‌ హెల్త్‌’ ప్రశ్న ఎన్‌సీఆర్‌టీ పరిధిలో లేదని చెబుతున్నారు. 40కుపైగా ప్రశ్నలకు సమాధానం రాయొచ్చని కొందరు విద్యార్థులు వెల్లడించారు. కెమిస్ట్రీ విభాగంలో ఇచ్చిన ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉంది. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ నుంచి వచ్చిన ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. 

ప్రశ్నల నిడివి అదనం

సాధారణంగా బయాలజీ, కెమిస్ట్రీ ప్రశ్నలకు జవాబులు గుర్తించిన అనంతరం ఫిజిక్స్‌ ప్రశ్నలకు విద్యార్థులు జవాబులు గుర్తిస్తారు. ఆయా విభాగాల్లో ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉన్నందున కాస్త సమయం పట్టింది. తర్వాత ఫిజిక్స్‌ ప్రశ్నలు చూసిన విద్యార్థులు.. మరింత ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో లాంగ్‌ టర్మ్‌ కంటే రెగ్యులర్‌ విద్యార్థులు ముందంజలో ఉండొచ్చని నీట్‌ కోచింగ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

720 మార్కులు రావడం కష్టమే

గత రెండు సంవత్సరాల మాదిరిగా 720 మార్కులు ఈ సారి రాకపోవచ్చుననే అభిప్రాయం వినపడుతోంది. 2018లో 691 మార్కులు టాప్‌. ఈ సారి ఇంచుమించు ఇదే స్థాయిలో ఉంటాయని పేర్కొంటున్నారు.


నీట్ రాసిన 72 ఏళ్ల మహిళ 

పరీక్ష కేంద్రానికి వచ్చిన పోతుల వెంకటలక్ష్మి

ఆమెకు 72 ఏళ్లు. ఈ వయసులో నీట్‌ రాశారు. పరీక్ష కేంద్రం వద్ద ఉన్న వాళ్లు ఆమె ఉత్సాహాన్ని ఆసక్తిగా తిలకించారు. కాకినాడకు చెందిన పోతుల వెంకటలక్ష్మి నీట్‌ పరీక్ష రాసేందుకు కాకినాడలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఆదివారం వచ్చారు. చదువుకు వయసు అడ్డంకి కాదని నిరూపించారు. పరీక్ష సమయం దగ్గపడటంతో తనిఖీ కేంద్రం వద్ద ఆధార్, హాల్‌టికెట్‌ను త్వరత్వరగా చూపించి పరీక్ష రాసేందుకు వెళ్లారు.

ఈనాడు, కాకినాడ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు