India Post: మీ ఇంటి నుంచే పోస్టు చేయండి

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 25 Jul 2025 06:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

అందుబాటులోకి ‘పోస్టల్‌ 2.0’

ఈనాడు, అమరావతి: తపాలాశాఖ కొత్త హంగులను సమకూర్చుకుంది. గ్రామీణ ప్రాంతాలు మొదలు నగరాల వరకూ అన్ని తపాలా కార్యాలయాల్లోనూ ఏపీటీ (అడ్వాన్స్డ్‌ పోస్టల్‌ టెక్నాలజీ) పేరుతో నూతన సాంకేతికత అమలులోకి వచ్చింది. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ పోస్టల్‌ టెక్నాలజీ (సీఈపీటీ) సహకారంతో ఏపీటీని రూపొందించారు. దీన్నే ‘పోస్టల్‌ 2.0’గా పిలుస్తున్నారు. ఈ నెల 22 నుంచి దేశవ్యాప్తంగా ఇది అమల్లోకి వచ్చింది. దీనివల్ల ప్రజలకు మెరుగైన సేవలు సులభంగా, వేగంగా అందనున్నాయి. గతంలో హెడ్‌ పోస్టాఫీసుల్లోనే అమల్లో ఉన్న యూపీఐ చెల్లింపులు ఇప్పుడు అన్నిచోట్లా అమల్లోకి వచ్చాయి. పోస్టల్‌ సేవింగ్‌ బ్యాంక్‌ సేవలు మినహా మిగతా అన్ని చెల్లింపులు యూపీఐ ద్వారా చేయవచ్చు. 

వేగంగా పార్సిళ్లు, రిజిస్టర్‌ పోస్టుల బట్వాడా 

పార్సిళ్లు, రిజిస్టర్‌ పోస్టుల వంటి వాటి బట్వాడా కూడా ‘ఏపీటీ’తో సులభతరం కానుంది. గతంలోలా మధ్యలో మరో మజిలీ లేకుండా ఈ విధానంలో బీట్‌ల వారీగా వాటి వివరాలు పోస్ట్‌మెన్‌ మొబైల్‌ నంబర్లకే వెళతాయి. వినియోగదారుల నుంచి డిజిటల్‌ సంతకం తీసుకొని డెలివరీ చేస్తారు. బట్వాడా సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుంది. 

డాక్‌ సేవ యాప్‌లో బుకింగ్‌.. 

‘డాక్‌ సేవ’ యాప్‌ ద్వారా స్పీడ్‌ పోస్టు, రిజిస్టర్‌ పోస్టు, పార్సిల్, బల్క్‌ బుకింగ్‌లను మనం ఉన్నచోటు నుంచే యాప్‌ ద్వారా బుక్‌ చేసుకొని సొమ్ము చెల్లించవవచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య టైం స్లాట్‌ ఆధారంగా పోస్ట్‌మెన్‌ మన వద్దకే వచ్చి వాటిని తీసుకెళతారు. నామమాత్రపు ధరే వసూలు చేస్తారు. లేదంటే బుకింగ్, చెల్లింపులు యాప్‌లో పూర్తిచేసి దగ్గరలోని పోస్టాఫీసులో ఉత్తరాలు ఇవ్వొచ్చు. దీనివల్ల సమయం కలిసి వస్తుంది. ఈ యాప్‌లో పోస్టల్‌ శాఖ సేవలన్నీ పొందవచ్చు. సేవల్లో ఏవైనా లోపాలుంటే ఇందులో ఫిర్యాదు చేయవచ్చు. వీటితోపాటు చిరునామాలను కచ్చితంగా గుర్తించేందుకు త్వరలో డిజి పిన్‌ అందుబాటులోకి రానుందని ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌ పోస్టల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ సంతోష్‌ నేత తెలిపారు.

Tags :
Published : 25 Jul 2025 04:25 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని