logo

Nara Lokesh: ‘నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం’ అంశం.. తెదేపా అధిష్ఠానం కీలక ఆదేశాలు

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Updated : 20 Jan 2025 18:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను (Nara Lokesh) డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తోన్న నేపథ్యంలో తెదేపా అధిష్ఠానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నేతలను ఆదేశించింది. ఎవరూ మీడియా వద్ద బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని పేర్కొంది.

ఇటీవల సీఎం చంద్రబాబు మైదుకూరు పర్యటనలో ఉన్నప్పుడు కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. నారా లోకేశ్‌కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆ తర్వాత పలువురు నేతలు ఇదే అంశంపై బహిరంగంగా మాట్లాడారు. పార్టీతో సంబంధం లేకపోయినప్పటికీ.. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలను వారు చెబుతున్నారు.

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ, రాజమండ్రి అర్బన్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారు చెప్పడం సరికాదని పార్టీ అధిష్ఠానం భావించింది. ఇలాంటి సున్నితమైన అంశాలపై కూటమి నేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది.


Tags :
Published : 20 Jan 2025 16:30 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని