National Turmeric Board: మోదీ ఆశీస్సులతోనే ఇందూరుకు పసుపు బోర్డు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 16 Jan 2025 06:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

బడ్జెట్‌లో నిధుల కేటాయింపు
కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌
దిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభం

కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌. పక్కన ఎంపీ ధర్మపురి అర్వింద్‌

ఇందూర్‌ సిటీ, న్యూస్‌టుడే: ప్రధాని మోదీ ఆశీస్సులతోనే పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యమైందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లతో కలిసి నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డును మంగళవారం ఆయన దిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. బోర్డుకు తొలి ఛైర్మన్‌గా నియమితులైన పల్లె గంగారెడ్డిని అభినందించారు. ‘‘గతంలో పంట ఉత్పత్తుల ఎగుమతులకు అంతగా ఆదరణ ఉండేది కాదు. మోదీ ప్రధాని అయ్యాక పరిస్థితి మారింది. తెలంగాణలో నాణ్యమైన పసుపు పండిస్తారు. అందుకే నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ కృషి ఎంతో ఉంది. రానున్న బడ్జెట్‌లో బోర్డుకు నిధులు, అధికారులను కేటాయిస్తాం. రెండేళ్లలో ఉత్పత్తులు రెండింతలు చేసి.. ఎగుమతులను ప్రోత్సహిస్తాం. ప్రపంచవ్యాప్తంగా పసుపు మార్కెటింగ్, ఎగుమతి, రవాణాపై బోర్డు దృష్టి సారిస్తుంది. 40 ఏళ్ల రైతుల కల నెరవేర్చాం’’ అని పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ.. పసుపు బోర్డుపై అర్వింద్‌ బాండ్‌ రాసిచ్చినప్పుడు అందరు హేళన చేశారన్నారు. పట్టుబట్టి బోర్డును తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.

నిజామాబాద్‌లోని పసుపు బోర్డు కార్యాలయంలో జ్యోతి వెలిగిస్తున్న ఛైర్మన్‌ పల్లె గంగారెడ్డి. చిత్రంలో కేసాంగ్‌ యాంగ్‌జోం శేర్పా, రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ, హేమలత, రేమాశ్రీ సుబ్రమణ్యం తదితరులు

అర్వింద్‌ మాట్లాడుతూ.. సంక్రాంతి రోజున లక్షల మంది రైతుల కల నెరవేర్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటుతో వ్యాపార, వాణిజ్యపరంగా నిజామాబాద్‌ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశాలున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తరఫున లేఖలు రాయడం వల్లే బోర్డు ఏర్పాటైందని మంత్రి తుమ్మల అనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. పసుపు బోర్డు ఛైర్మన్‌ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ.. పసుపు బోర్డు పేరుతో గతంలో పలువురు నాయకులు రైతుల్ని మోసం చేశారన్నారు. ఎంపీ అర్వింద్‌ రెండు నెలలుగా దిల్లీలోనే ఉండి బోర్డు ఏర్పాటయ్యేలా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపారన్నారు. పసుపు బోర్డుకు ఇన్‌ఛార్జిగా సుగంధద్రవ్యాల బోర్డు డైరెక్టర్‌ రేమాశ్రీ సుబ్రమణ్యం వ్యవహరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ, రాకేశ్‌రెడ్డి, కేంద్ర సుగంధద్రవ్యాల బోర్డు కార్యదర్శి హేమలత, కేంద్ర వాణిజ్యశాఖ సంయుక్త కార్యదర్శి కేసాంగ్‌ యాంగ్‌జోం శేర్పా, సుగంధ ద్రవ్యాల బోర్డు అధికారులు, రైతులు పాల్గొన్నారు. 


ఉత్పాదన, ఎగుమతుల పెంపునకు బోర్డు కృషి

‘‘పసుపు బోర్డు ప్రారంభించుకోవడం సంతోషకర విషయం. దేశంలో పసుపు ఉత్పాదన, ఎగుమతులు పెంచడానికి బోర్డు కృషి చేస్తుంది. రైతులకు సాగు లాభదాయకం కానుంది. వినియోగదారులకు కూడా నాణ్యమైన పసుపు అందుబాటులోకి రానుంది’’.

‘ఎక్స్‌’లో ప్రధాని మోదీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు